Palak Paneer: వెరీ ఇంట్రస్టింగ్.. పాలక్ పన్నీర్ వాసనతో కోటి రూపాయలు గెలుచుకున్న భారతీయ విద్యార్థులు
అమెరికాలోని కొలరాడో బౌల్డర్ విశ్వ విద్యాలయంలో ఇద్దరు భారతీయ పీహెచ్‌డీ విద్యార్థులు తాము తినే ఆహారం విషయంలో వివక్షను ఎదుర్కొన్నారు.
Palak Paneer Representative Image (Image Credit To Original Source)
- పాలక్ పన్నీర్ వాసనపై అభ్యంతరం
- సిబ్బందితో భారతీయ విద్యార్థుల వాగ్వాదం
- వివక్షకు గురైన విద్యార్థులు.. డిగ్రీలు నిలిపివేత
- న్యాయపోరాటంలో దక్కిన విజయం
Palak Paneer: పాలక్ పన్నీర్ వాసన ఏంటి, కోటి రూపాయలు గెలుచుకోవడం ఏంటి.. నమ్మబుద్ధి కావడం లేదు కదూ. కానీ, ఇది నిజం. పాలక్ పనీర్ వాసనతో భారతీయ విద్యార్థులు అక్షరాల కోటి రూపాయలు గెలుచుకున్నారు. అసలేం జరిగింది, ఇదెలా సాధ్యమైంది అనే వివరాల్లోకి వెళితే..
అమెరికాలో కొలరాడో యూనివర్సిటీలో వివక్షకు గురైన ఇండియన్ పీహెచ్ డీ విద్యార్థులు ఆదిత్య ప్రకాశ్, ఊర్మి భట్టాచార్య న్యాయ పోరాటంలో నెగ్గారు. ఇది 2023లో జరిగింది. క్యాంపస్ లో పాలక్ పనీర్ వేడి చేస్తున్న సమయంలో వచ్చిన వాసనపై సిబ్బంది అభ్యంతరం తెలిపారు. ఇది వివాదానికి దారి తీసింది. భారతీయ విద్యార్థుల డిగ్రీలను నిలిపివేసే వరకు గొడవ వెళ్లింది. దాంతో వారు కోర్టును ఆశ్రయించారు. న్యాయపోరాటంలో నెగ్గారు. వర్సిటీ వారికి దాదాపు 1.8 కోట్ల పరిహారం చెల్లించింది. అలాగే మాస్టర్స్ డిగ్రీలను సైతం అందజేసింది. తమ విజయాన్ని భారతీయ విద్యార్థులు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
అమెరికాలోని కొలరాడో బౌల్డర్ విశ్వ విద్యాలయంలో ఇద్దరు భారతీయ పీహెచ్‌డీ విద్యార్థులు తాము తినే ఆహారం విషయంలో వివక్షను ఎదుర్కొన్నారు. ఈ వివాదంలో వారు సుమారు రూ. 1.8 కోట్లు పరిహారం గెలుచుకున్నారు. ఈ వివాదం 2023లో 34 ఏళ్ల ఆదిత్య ప్రకాష్ విశ్వవిద్యాలయంలోని ఆంత్రోపాలజీ విభాగంలో పీహెచ్‌డీ చేస్తున్నప్పుడు జరిగిన సంఘటనకు సంబంధించినది.
పాలక్ పన్నీర్ వాసనపై ఫిర్యాదు..
విశ్వవిద్యాలయంలో చేరిన దాదాపు సంవత్సరం తర్వాత.. సెప్టెంబర్ 5, 2023న.. ప్రకాశ్ తన లంచ్ అయిన పాలక్ పన్నీర్‌ను డిపార్ట్‌మెంట్‌లోని మైక్రోవేవ్‌లో వేడి చేస్తున్నాడు. ఆ సమయంలో ఒక మహిళా సిబ్బంది అతని వద్దకు వెళ్లింది. పాలక్ పన్నీర్ వాసన తీవ్రంగా ఉందని, అస్సలు బాగోలేదని ఫిర్యాదు చేసింది. ఆహారాన్ని వేడి చేయడానికి మైక్రోవేవ్‌ను వాడొద్దని చెప్పింది. ఆ మహిళ వాదనను ప్రకాశ్ తోసిపుచ్చాడు. ఇది కామన్ స్పేస్, మైక్రోవేవ్ వాడుకునే హక్కు నాకు కూడా ఉందని ప్రకాశ్ ఆమెతో వాదించాడు.
వారి మధ్య మాట మాట పెరిగింది. వివాదంగా మారింది. ప్రకాశ్ భాగస్వామి ఊర్మి భట్టాచర్య సైతం ఇందులో జోక్యం చేసుకున్నారు. ప్రకాశ్ కి మద్దతు పలికారు. కాగా, ఈ ఘటన కారణంగా తాము వివక్షకు గురయ్యారని ఆ జంట ఆరోపించింది. సీనియర్ అధ్యాపకులతో సమావేశాలకు తనను పదేపదే పిలిచారని ప్రకాష్ పేర్కొన్నాడు. ప్రకాష్‌కు మద్దతిచ్చినందుకు వివరణ లేకుండానే తనను బోధనా సహాయక పదవి నుండి తొలగించారని భట్టాచర్య వాపోయారు. అంతేకాదు పీహెచ్‌డీ విద్యార్థులకు ఇచ్చే మాస్టర్స్ డిగ్రీలను తమకు ఇవ్వడానికి నిరాకరించారని తెలిపారు. దాంతో తాము చట్టపరమైన సాయం తీసుకోవాలని నిర్ణయించుకున్నామని ప్రకాష్ వెల్లడించారు.
వివక్షపై భారతీయ విద్యార్థుల న్యాయపోరాటం..
ప్రకాశ్, భట్టాచార్యలు యునైటెడ్ స్టేట్స్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఫర్ కొలరాడోలో విశ్వవిద్యాలయంపై దావా దాఖలు చేశారు. వంట గది వివాదం తర్వాత మాస్టర్స్ డిగ్రీలను విశ్వవిద్యాలయం నిలిపివేసిందన్నారు. తమ విద్యకు ఆటంకం కలిగించే ప్రతికూల వాతావరణాన్ని ఎదుర్కొన్నామని ఆరోపించారు. తమ సాంస్కృతిక ఆహారం పట్ల విశ్వవిద్యాలయం ప్రతిచర్య అంతర్జాతీయ విద్యార్థుల పట్ల లోతైన వ్యవస్థాగత పక్షపాత ధోరణిని చాటుతుందని వాదించారు. వారి వాదనతో కోర్టు ఏకీభవించింది. వారికి పరిహారం చెల్లించడంతో పాటు డిగ్రీలను ప్రదానం చేయాలని యూనివర్సిటీని ఆదేశించింది. సెప్టెంబర్ 2025లో కొలరాడో బౌల్డర్ విశ్వవిద్యాలయం ప్రకాష్, భట్టాచార్యలకు 1.8 కోట్లు చెల్లించింది. అలాగే మాస్టర్స్ డిగ్రీలను ప్రదానం చేసింది.
ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో విశ్వవిద్యాలయంపై కేసు గెలిచినట్లు భట్టాచార్య తెలిపింది. నాకు కావాల్సింది నేనే తినే స్వేచ్ఛ కోసం చేసిన పోరాటంలో నేను గెలిచాను అని పేర్కొంది.
Also Read: కొత్త యాప్.. పిచ్చ పిచ్చగా డౌన్‌లోడ్ చేస్తున్న జనం.. డబ్బులు ఎదురిచ్చి..
