Hurricane Melissa : వామ్మో.. ఈ శతాబ్దంలోనే అత్యంత ప్రమాదకర తుఫాన్.. విధ్వంసమే.. కుప్పకూలుతున్నాయ్..
Hurricane Melissa స్కూళ్లకు సెలవు ప్రటకించారు. ద్వీపంలోని రెండు అంతర్జాతీయ విమానాశ్రయాలను మూసివేశారు. వారాంతం వరకు విమానాల రాకపోకలను నిలిపివేశారు.
Hurricane Melissa
Hurricane Melissa : కరీబియన్ ద్వీపం దేశాలపై మెలిసా హెరికేన్ విరుచుకుపడుతుంది. ఈ తుపాను జమైకా గుండా క్యూబాలోని రెండో అతిపెద్ద నగరమైన శాంటియాగో డి క్యూబా వైపు దూసుకెళ్తోంది. కరీబియన్ సముద్ర తీరం వెంబడి ఉన్న అనేక దేశాలపై మెలిస్సా విచురుకుపడుతోంది.
కరీబియన్ దీవులను ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన హరికేన్ వణికిస్తోంది. గడిచిన 174 ఏళ్లలో ఎన్నడూ చూడని అత్యంత భీకర తుపాన్ జమైకాపై విరుచుకుపడింది. ఈ తుపాను కారణంగా ఇప్పటికే ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ మెలిసా తుపానును కేటగిరీ -5గా వర్గీకరించారు. అమెరికాకు చెందిన నేషనల్ హరికేన్ సెంటర్ ప్రకారం ఈ శతాబ్దంలో భూమిపై నమోదైన అత్యంత బలమైన హరికేన్లలో మెలిసా తీవ్రమైనదని పేర్కొంది.
Also Read : Hurricane Melissa : తుపాను మధ్యలో నుంచి వెళ్లిన విమానం.. గూస్ బంప్స్ వీడియో.. తుపాను లోపల చూడండి ఎలా ఉందో…
మెలిసా తుపాను జమైకాలో విధ్వంసం సృష్టిస్తోంది. 295 కిలో మీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీస్తున్నాయి. భీకర గాలుల తీవ్రతకు చెట్లు కూలిపోయాయి.. అనేక ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. ఈ తుపాను కారణంగా ఆకస్మిక వరదలు, అనేక ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని మయామిలోని యూఎస్ నేషనల్ హరికేన్ సెంటర్ హెచ్చరించింది.
జమైకా విపత్తు ప్రమాద నిర్వహణ మండలి డిప్యూటీ చైర్మన్ డెస్మండ్ మెకెంజీ మాట్లాడుతూ.. రాజధాని కింగ్ స్టన్ లోని వీధులు చాలా వరకు ఖాళీగా ఉన్నాయి. తుపాను ద్వీపాన్ని దాటుతున్నందున ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేశారు. 174 సంవత్సరాల క్రితం రికార్డుల నిర్వహణ ప్రారంభమైనప్పటి నుంచి జమైకా ద్వీపాన్ని తాకిన అత్యంత బలమైన హరికేన్ లలో ఇది ఒకటి అంటూ పేర్కొన్నారు.
ఆ దేశ ప్రధాని ఆండ్రూ హోల్నెస్ మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో కేటగిరీ 5ని తట్టుకోగల మౌలిక సదుపాయాలు లేవు. ఇప్పుడు మా ముందున్న సవాల్ ఏమిటంటే.. ఈ తుపాను బీభత్సం నుంచి కోలుకోవడం అని అన్నారు. మరోవైపు.. జమైకాలో స్కూళ్లకు సెలవు ప్రటకించారు. ద్వీపంలోని రెండు అంతర్జాతీయ విమానాశ్రయాలను మూసివేశారు. వారాంతం వరకు విమానాల రాకపోకలను నిలిపివేశారు.
దక్షిణ జమైకా అంతటా 13 అడుగుల (4 మీటర్లు) ఎత్తు వరకు ప్రాణాంతక తుఫాను ఉప్పెన వచ్చే అవకాశం ఉందని, తీరప్రాంతంలోని కొన్ని ఆసుపత్రులపై దీని ప్రభావం గురించి అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఆరోగ్య మంత్రి క్రిస్టోఫర్ టఫ్టన్ మాట్లాడుతూ.. కొంతమంది రోగులను గ్రౌండ్ ఫ్లోర్ నుండి రెండవ అంతస్తుకు తరలించామని తెలిపారు.
కింగ్‌స్టన్ సమీపంలోని మెర్సీ కార్ప్స్ సలహాదారు కాలిన్ బోగ్లే మాట్లాడుతూ.. ప్రభుత్వం వరదలకు గురయ్యే ప్రాంతాలను ఖాళీ చేయమని ఆదేశించినప్పటికీ చాలా కుటుంబాలు తమ నివాసాల్లోనే తలదాచుకుంటున్నాయని అన్నారు. చాలామంది ఇంతకు ముందు ఎప్పుడూ ఇలాంటి తుపాన్‌ను చూడలేదని అన్నారు.
