India US Agreement: భారత్, అమెరికా మధ్య డిఫెన్స్ సెక్టార్ లో కీలక ఒప్పందం.. పదేళ్ల పాటు..

ఇది ఇరు దేశాల రక్షణ భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

India US Agreement: భారత్, అమెరికా మధ్య డిఫెన్స్ సెక్టార్ లో కీలక ఒప్పందం.. పదేళ్ల పాటు..

Updated On : October 31, 2025 / 6:25 PM IST

India US Agreement: భారత్, అమెరికా మధ్య రక్షణ (డిఫెన్స్) సెక్టార్ లో కీలక ఒప్పందం కుదిరింది. రక్షణ రంగంలో సహకారాన్ని బలోపేతం చేయడానికి ఇరు దేశాలు 10 సంవత్సరాల ఫ్రేమ్‌వర్క్ ఒప్పందంపై సంతకం చేశాయి. మలేషియాలోని కౌలాలంపూర్‌లో భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, అమెరికా రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సేత్ లు సమావేశం అయ్యారు. ఇందులో ఈ ఒప్పందం ఖరారైంది.

రష్యా నుంచి చమురు కొనుగోలు చేసుందన్న కారణంతో భారత వస్తువులపై ట్రంప్ 50శాతం సుంకం విధించిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాల నడుమ భారత్, అమెరికా మధ్య ఈ ఒప్పందం కుదరడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ఒప్పందం భారత్-అమెరికా రక్షణ భాగస్వామ్యానికి మార్గనిర్దేశం చేస్తుందని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక, భద్రత సహకారాన్ని పెంపొందించేందుకు ఉద్దేశించిన ఈ ఒప్పందం పదేళ్ల పాటు కొనసాగనుందని ఆయన తెలిపారు.

“రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలలో డిఫెన్స్ ప్రధాన అంశంగా ఉంటుంది. స్వేచ్ఛాయుత, బహిరంగ, నియమాల ఆధారిత ఇండో-పసిఫిక్ ప్రాంతాన్ని నిర్ధారించడానికి మా భాగస్వామ్యం చాలా కీలకం” అని రాజ్ నాథ్ సింగ్ తేల్చి చెప్పారు.

భారత్, అమెరికా ఒప్పందంపై అమెరికా రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సేత్ ఎక్స్ లో స్పందించారు. రాజ్ నాథ్ సింగ్ ను కలిసి పదేళ్ల రక్షణ ఒప్పందంపై సంతకం చేయడం సంతోషంగా ఉందన్నారు. ఇది ఇరు దేశాల రక్షణ భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సమన్వయం, సమాచారంతో పాటు సహకారాన్ని మరింతగా పెంచుకుంటామన్నారు. భారత్ తో అమెరికా రక్షణ సంబంధాలు మరింత బలంగా ఉన్నాయని స్పష్టం చేశారు.

”10 సంవత్సరాల అమెరికా-భారత రక్షణ ఒప్పందంపై సంతకం చేయడానికి నేను రాజ్ నాథ్ సింగ్ ని ఇప్పుడే కలిశాను. ఇది మా రక్షణ భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్తుంది. ఇది ప్రాంతీయ స్థిరత్వానికి ఒక మూలస్తంభం. మేము సమన్వయం, సమాచార భాగస్వామ్యం, సాంకేతిక సహకారాన్ని పెంచుకుంటున్నాము. మా రక్షణ సంబంధాలు ఇంతకు ముందు ఎన్నడూ లేనంత బలంగా ఉన్నాయి” అని ఎక్స్ లో పోస్ట్ పెట్టారు పీట్ హెగ్సేత్.

మలేషియాలో ఆసియాన్ రక్షణ మంత్రుల సమావేశం జరిగింది. ఆగ్నేయాసియా దేశాల సంఘం (ASEAN)లో ASEAN రక్షణ మంత్రుల సమావేశం (ADMM) అత్యున్నత రక్షణ సంప్రదింపులు, సహకార వేదికగా పనిచేస్తుంది.

ADMM-ప్లస్ ఫ్రేమ్‌వర్క్‌లో బ్రూనై, కంబోడియా, ఇండోనేషియా, లావోస్, మలేషియా, మయన్మార్, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయిలాండ్, తైమూర్-లెస్టే , వియత్నాం వంటి ASEAN సభ్య దేశాలు ఉన్నాయి. భారత్, యునైటెడ్ స్టేట్స్, చైనా, రష్యా, జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ డైలాగ్ పార్టనర్స్ గా ఉన్నాయి.

 

Also Read: షాకింగ్.. ఇవి సాధారణ కుక్కలంటే మీరు నమ్ముతారా? నీలి రంగులోకి మారిపోయి ఇప్పుడు..