భారత్ మమ్మల్ని దెబ్బకొడుతోంది…పర్యటనకు ముందే ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

వాణిజ్యంపై అధిక సుంకాలతో భారతదేశం అమెరికాను గట్టిగా కొడుతోందని అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ అన్నారు. తన మొదటి భారత పర్యటనకు రెండు రోజుల ముందు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కీలకంగా మారాయి. అమెరికా ఉత్పత్తులను ప్రోత్సహించడానికి తాను ప్రధాని నరేంద్ర మోడీతో వ్యాపారం గురించి మాట్లాడుతామని ట్రంప్ అన్నారు.
తాను వచ్చే వారం భారత్ లో పర్యటిస్తున్నానని,చాలా చాలా ఏళ్లుగా భారత్ తమకు గట్టిగా దెబ్బకొడుతోందని గురువారం(ఫిబ్రవరి-20,2020)కొలరాడోలో నిర్వహించిన కీప్ అమెరికా గ్రేట్ ర్యాలీలో ట్రంప్ అన్నారు. వేలాదిమంది మద్దతుదారులనుద్దేశించి ట్రంప్ మాట్లాడుతూ…తనకు భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ అంటే చాలా ఇష్టమని,భారత పర్యటనలో మోడీతో వ్యాపారం గురించి మాట్లాడతామని చెప్పారు. మేము కొంచెం వ్యాపారం మాట్లాడవలసి వచ్చింది. భారత్ మాకు బాగా దెబ్బకొట్టింది. ప్రపంచంలోనే అత్యధికంగా భారత్ మాకు సుంకాలను విధించిందని ఆయన అన్నారు.
ట్రంప్ భారత పర్యటన సందర్భంగా అమెరికా-భారత్ ల మధ్య ట్రేడ్ డీల్ కుదిరే అవకాశమున్నట్లు ముందుగా ఊహాగానాలు వినిపించాయి. అయితే భారత్ తో ట్రేడ్ ఉంటుందని,కాకపోతే అది ఇప్పుడు కాదంటూ గత వారం ట్రంప్ ఆ ఊహాగానాలకు చెక్ పెట్టారు.. భారత్ తో ట్రేడ్ డీల్స్ కు కట్టుబడి ఉన్నామని,అయితే అది అధ్యక్ష ఎన్నికల తరువాత ఆలోచిస్తామని తెలిపారు. భవిష్యత్తులో భారత్‌తో భారీ వాణిజ్య ఒప్పందం తప్పక ఉంటుందని ట్రంప్….భారత్ తో ట్రేడ్ డీల్ అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగనున్న నవంబర్ కి ముందు జరుగుతుందో లేదో అన్నది తనకు తెలియదన్నారు. అవి గుడ్ డీల్స్ అయితేనే తాము ఒప్పందాలు కుదుర్చుకుంటామని,ఎందుకంటే తాము అమెరికా ఫస్ట్ ఉంచుతామని,ఎవరికి నచ్చినా,నచ్చకపోయినా తమ విధానం అమెరికా ఫస్ట్ అన్నారు ట్రంప్.
ఫిబ్రవరి-24,25న ట్రంప్ తన భార్య మెలానియా, కూతరు ఇవాంకా, అల్లుడు జరీద్ కుష్నర్ తో కలిసి ట్రంప్ భారత్ లో పర్యటించనున్నారు. అమెరికా అధ్యక్షుడికి ఇవాంకా,కుష్నార్ లు సీనియర్ సలహాదారులుగా ఉన్న విషయం తెలిసిందే. ట్రంప్ బృందంలో అమెరికా జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్ ఓ బ్రెయిన్,టెజ్రీరరీ సెక్రటరీ స్టీవ్ మ్నుచిన్,కామర్స్ సెక్రటరీ విల్బర్ రోస్,ఇంధనశాఖ సెక్రటరీ బ్రౌయలట్టీ కూడా ఉండనున్నారు. మరోవైపు ట్రేడ్ డీల్ కోసం భారత వాణిజ్యశాఖ మంత్రి పియూష్ గోయల్ తో చర్చలు జరిపిన అమెరికా వాణిజ్య ప్రతినిధి రాబర్ట్ లైట్‌హైజర్ ట్రంప్ పర్యటన బృందంలో లేరు. భారత్-అమెరికాల మధ్య ఇంకా కొన్ని విబేధాలు నెలకొన్న కారణంగా రెండుదేశాలు ప్రస్తుతం ట్రేడ్ డీల్ ను పక్కన పెట్టేసినట్లు క్లియర్ గా అర్థమవుతోంది.