ఇరాన్‌పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం.. మిలిటరీ చీఫ్ బాఘేరి సహా కీలక నేతలు హతం.. ప్రతీకారం ఉంటుందన్న ఇరాన్ సుప్రీం లీడర్.. విమానాలకు బ్రేక్..

ఇజ్రాయెల్ దాడులపై ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీ స్పందించారు. ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు.

ఇరాన్‌పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం.. మిలిటరీ చీఫ్ బాఘేరి సహా కీలక నేతలు హతం.. ప్రతీకారం ఉంటుందన్న ఇరాన్ సుప్రీం లీడర్.. విమానాలకు బ్రేక్..

Israel-Iran Crisis

Updated On : June 13, 2025 / 12:38 PM IST

Israel Attacks Iran: ఇరాన్‌పై ఇజ్రాయెల్ మిసైళ్ల వర్షం కురిపించింది. దీంతో శుక్రవారం తెల్లవారుజామున ఆదేశ రాజధాని టెహ్రాన్ బాంబుల మోతతో దద్దరిల్లిపోయింది. ఇరాన్ లోని అణు స్థావరాలు, సైనిక స్థావరాలు లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో ఇరాన్ కు భారీ దెబ్బ తగిలింది. ఈ దాడుల్లో ఇరాన్ మిలిటరీ చీఫ్ మహమ్మద్ బాఘేరి మృతిచెందాడు. ఈ మేరకు ఆ దేశ ప్రభుత్వ మీడియా సంస్థ ఐఆర్ఎన్ఎన్ ధ్రువీకరించింది. ఇప్పటికే ఇరాన్ కు చెందిన ఆరుగురు అణుశాస్త్రవేత్తలు కూడా మరణించారు. వీరితోపాటు సైన్యంలోని సీనియర్ జనరల్స్ కూడా ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఐఆర్జీసీ చీఫ్ హొస్సేన్ సలామీ కూడా ఉన్నాడు.

 

ప్రతీకారం తీర్చుకుంటాం: ఇరాన్ సుప్రీం లీడర్
ఇజ్రాయెల్ దాడులపై ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీ స్పందించారు. ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు. ఇజ్రాయెల్ కు తీవ్రమైన శిక్షను విధిస్తామమని అన్నారు. ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ లోని నతాంజ్ అణుశుద్ది కేంద్రం ధ్వంసమైందని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ప్రకటించింది. ఈ మేరకు ఆ సంస్థ చీఫ్ గ్రోసీ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. రేడియేషన్ లీకేజీ స్థాయిపై సమాచారం కోసం ఇరాన్ అధికారులను ఎప్పటికప్పుడు సంప్రదిస్తున్నట్లు గ్రోసీ తెలిపారు.

‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ కొనసాగుతుంది.. నెతన్యాహు
ఇరాన్ పై దాడులపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పందించారు. ఇరాన్ అణు లక్ష్యాలను దెబ్బతీసేందుకు ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ను ప్రారంభించినట్లు ప్రకటించారు. ఆ దేశ అణు కార్యక్రమానికి గుండె లాంటి ప్రదేశాన్ని ధ్వంసం చేసినట్లు వీడియో సందేశాన్ని విడుదల చేశారు. అయితే, ఇరాన్ నుంచి ముప్పును పూర్తిగా తొలగించేంతవరకు చాలారోజుల పాటు ఈ ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ కొనసాగుతుందని నెతన్యాహు స్పష్టం చేశారు.


మాకు ఎలాంటి సంబంధం లేదన్న అమెరికా..
ఇరాన్ పై ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల నేపథ్యంలో అమెరికా స్పందించింది. ఈ దాడులతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. యూఎస్ విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఇరాన్ పై ఇజ్రాయెల్ ఏకపక్షంగా చర్యలు ప్రారంభించింది. ఈ దాడుల్లో అమెరికా ప్రమేయం లేదని తెలిపారు. ఆ ప్రాంతంలోని అమెరికన్ దళాలను రక్షించడం పైనే మా దృష్టి ఉందని అన్నారు. ఈ దాడుల నేపథ్యంలో ఇరాన్‌కు స్పష్టంగా ఒకటి చెప్పాలనుకుంటున్నా. అమెరికా ప్రయోజనాలను గాని, మా సిబ్బందిని గాని లక్ష్యంగా చేసుకోకూడదని రూబియో పేర్కొన్నారు. అయితే, ఇరాన్ మాత్రం అమెరికా ప్రమేయం లేకుండా ఇజ్రాయెల్ ఈ దాడులు చేయదని, అమెరికా ఈ దాడులకు బాధ్యత వహించాలని ఇరాన్ విదేశాంగశాఖ పేర్కొంది.


అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం భిన్నంగా స్పందించారు. ఇరాన్ పై ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల గురించి తమకు ముందే తెలుసునని అన్నారు. అయితే, ఈ దాడుల్లో తమ ప్రమేయం లేదని స్పష్టం చేశారు. ఇరాన్ అణ్వాయుధాలు కలిగి ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్ ఏదైనా ప్రతీకార దాడులకు పాల్పడితే దాన్ని ఎదుర్కొనేందుకు తమ సెంట్రల్‌ కమాండ్ సిద్ధంగా ఉందని, అమెరికా తనను తాను రక్షించుకోవడంతో పాటు ఇజ్రాయెల్‌ను కూడా కాపాడేందుకు సిద్ధంగా ఉందంటూ ట్రంప్ అన్నారు.

విమానాల రాకపోకలకు బ్రేక్..
ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఆ ప్రాంతంలో పలు చోట్ల గగనతలాలపై ఆంక్షలు విధించారు. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా పలు విమానాలను దారిమళ్లించారు. కొన్ని విమాన సర్వీసులు రద్దయ్యాయి. ముంబయి ఎయిర్‌పోర్టు నుంచి శుక్రవారం తెల్లవారు జామున లండన్ వెళ్లాల్సిన ఎయిర్ ఏఐసీ 129 విమానం కొన్ని గంటలకే వెనక్కి మళ్లింది. ఇరాన్ గగనతలం మూసివేతతో ఎయిరిండియా విమానాలకు అంతరాయం ఏర్పడింది. పలు విమానాలు వెనక్కి మళ్లాయి. ఇప్పటి వరకు మొత్తం 16 విమానాలకు అంతరాయం కలిగినట్లు ఎయిర్ లైన్ వెల్లడించింది.

మధ్యప్రాచ్యంలో సైనిక ఉద్రిక్తతను ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఖండించారు. ఇరాన్‌లోని అణు స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇరుదేశాలు సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు.