ఇరాన్ ఎదురుదాడి.. ఇజ్రాయెల్ పై మిసైళ్ల వర్షం.. జనాలపై కురుస్తున్న బాంబులు.. జెరూసలేంపైనా దాడి..

ఇజ్రాయెల్ జరిపిన క్షిపణుల దాడిలో ఇరాన్ మిలిటరీ చీఫ్ మహమ్మద్ బాఘేరి మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే, అతని స్థానంలో ఇరాన్ కొత్త మిలిటరీ చీఫ్ ను ఎంపిక చేసింది.

ఇరాన్ ఎదురుదాడి.. ఇజ్రాయెల్ పై మిసైళ్ల వర్షం.. జనాలపై కురుస్తున్న బాంబులు.. జెరూసలేంపైనా దాడి..

Iran-Israel war

Updated On : June 16, 2025 / 4:57 PM IST

ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య భీకర యుద్ధంతో పశ్చిమాసియా భగ్గుమంది. ఇరు దేశాలు మిసైళ్లతో దాడులు చేసుకుంటున్నాయి. ఇరాన్ లోని అణ్వాయుధ కేంద్రాలు, మిలిటరీ స్థావరాలను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్ గురువారం అర్ధరాత్రి, శుక్రవారం తెల్లవారు జామున వైమానిక దాడులకు పాల్పడింది. ఆపరేషన్ ‘రైజింగ్ లయన్’ పేరుతో పెద్దెత్తున దాడులకు దిగింది. అణు, సైనిక స్థావరాలతోపాటు సైనిక ఉన్నతాధికారులే లక్ష్యంగా వందల క్షిపణులు, డ్రోన్లతో ఇరాన్ పై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. ఈ దాడుల్లో ఇరాన్ సైనిక దళాల పర్యవేక్షకుడు జనరల్ మహమ్మద్ బాఘేరి, రెవల్యూషనరీ గార్డ్ చీఫ్ మేనేజర్ జనరల్ హోస్సేన్ సలామీసహా కీలక సైన్యాధికారులు, అణుశాస్త్రవేత్తలు మృతిచెందారు.. అయితే, ఈ దాడుల్లో మొత్తం 78మంది పౌరుల మరణించగా.. 329 మంది గాయపడినట్లు తెలిసింది. ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ సైతం క్షిపణులతో దాడులు చేసింది.


శనివారం తెల్లవారు జామున ఇరాన్ క్షిపణులు, రాకెట్లు టెల్‌అవీవ్ ను తాకాయి. ఇజ్రాయెల్‌లోని రెండు అతిపెద్ద నగరాలైన జెరూసలేంలో మిసైళ్ల దాడులకు పాల్పడింది. ఇరాన్ ప్రయోగించిన క్షిపణుల దాడిని చురుగ్గా అడ్డుకుంటున్నామని ఇజ్రాయెల్ దళాలు తెలిపాయి. అనేక నగరాల్లో వైమానిక దాడుల సైరన్లు మోగాయి. టెల్ అవీవ్ ఇరాన్ దాడుల కారణంగా దాదాపు 35 మంది గాయపడినట్లు సమాచారం. జెరూసలేంలో కూడా భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి.

ఇజ్రాయెల్ శనివారం తెల్లవారు జామున టెహ్రాన్ పై మరోసారి మిసైళ్ల దాడికి పాల్పడింది. స్థానిక మీడియా నివేదికల ప్రకారం.. రెండు క్షిపణలు మెహ్రాబాద్ విమానాశ్రయాన్ని తాకాయి. ఈ ప్రాంతంలోనే పైటర్ జెట్ లు, రవాణా విమానాలను కలిగిఉన్న వైమానిక దళ స్థావరం కూడా ఉంది. ఈ ప్రదేశంలో మంటలు చెలరేగినట్లు తెలిసింది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ నివాస సమీపంలోనూ ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరిగినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టెహ్రాన్ లోని మోనిరియాలో ఈ వైమానిక దాడులు జరిగాయి. అక్కడే ఖమేనీ నివాసంతోపాటు ఇరాన్ అధ్యక్ష కార్యాలయం కూడా ఉంది.


ఇరాన్ మిలిటరీ చీఫ్‌గా అమీర్‌ హతామీ..
ఇజ్రాయెల్ జరిపిన క్షిపణుల దాడిలో ఇరాన్ మిలిటరీ చీఫ్ మహమ్మద్ బాఘేరి మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే, అతని స్థానంలో ఇరాన్ కొత్త మిలిటరీ చీఫ్ ను ఎంపిక చేసింది. ఇరాన్ మిలిటరీ చీఫ్ గా అమీర్ హతామీని నియమించినట్లు ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ తెలిపారు.