Cyber Espionage: ఇండియా దురంధర్.. కౌంటర్ గా పాకిస్తాన్ జూలియట్.. వలవేసి రహస్యాలు లాగేస్తున్నారు
పాకిస్తాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ డిజిటల్(Cyber Espionage) మాధ్యమాలను వేదికగా చేసుకుని హనీట్రాప్ వ్యూహాలను అమలు చేస్తోంది.
Isi digital honeytrap iaf officer arrested pakistan cyber espionage warning
- ఐఎస్ఐ డిజిటల్ హనీట్రాప్ సంచలనం.
- వింగ్ కమాండర్ అరెస్ట్ కలకలం.
- 42 యాప్‌లపై సీరియస్ హెచ్చరికలు.
Cyber Espionage: కోల్డ్ వార్ కాలంలో ప్రత్యర్థి దేశాల నుండి రహస్య సమాచారాన్ని రాబట్టేందుకు ఈస్ట్ జర్మనీ ‘రోమియో స్పైస్’లను, రష్యా ‘స్వాలోస్’లను ఉపయోగించిన తరహాలోనే, ప్రస్తుతం పాకిస్తాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ (ISI) డిజిటల్ మాధ్యమాలను వేదికగా చేసుకుని హనీట్రాప్ వ్యూహాలను అమలు చేస్తోంది. మునుపటిలా భౌతికంగా కలవాల్సిన అవసరం లేకుండా సోషల్ మీడియా, వీడియో కాల్స్, చాటింగ్ యాప్‌ల ద్వారా సైనిక అధికారులను లక్ష్యంగా చేసుకుని ఈ డిజిటల్ ఎస్పియోనేజ్ (Cyber Espionage) ఆపరేషన్లను నిర్వహిస్తోంది. ఇటీవల భారత వైమానిక దళానికి చెందిన ఒక వింగ్ కమాండర్ ఈ డిజిటల్ వలలో చిక్కి, సున్నితమైన సమాచారాన్ని లీక్ చేశారనే ఆరోపణలతో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.
మూడంచెల వ్యూహంతో వల విసురుతున్న ఐఎస్ఐ:
తప్పుడు పేర్లు, ప్రొఫైళ్లతో సోషల్ మీడియాలో ప్రొఫైళ్లు క్రియేట్ చేసి, సున్నితమైన సమాచారం కలిగిన రక్షణ రంగానికి చెందిన వారిని ఐఎస్ఐ టార్గెట్ చేస్తోంది. ఈ ఆపరేషన్లను మూడు దశల్లో నిర్వహిస్తారు. మొదట ఒక జూనియర్ ఏజెంట్ పరిచయం పెంచుకోగా, రెండో దశలో నిపుణులైన వారు సంభాషణను మరింత ముందుకు తీసుకెళ్తారు. ఆఖరి దశలో మూడో స్థాయి స్పెషలిస్టులు రంగంలోకి దిగి అధికారుల నుంచి రహస్య డేటాను, లొకేషన్ల సమాచారాన్ని సేకరిస్తారు. అంతేకాకుండా, రిమోట్ యాక్సెస్ మాల్వేర్ ఉన్న మొబైల్ యాప్‌లను ఫోన్లలో ఇన్స్టాల్ చేయించి పూర్తి డేటాను హ్యాక్ చేస్తున్నారు.
అప్రమత్తతతోనే డిజిటల్ గూఢచర్యానికి అడ్డుకట్ట:
గతంలో బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ అచ్యుతానంద్ మిశ్రా, ఐఎఎఫ్ గ్రూప్ కెప్టెన్‌తో సహా పలువురు సైనిక అధికారులు ఇలాంటి ఫేక్ ప్రొఫైళ్ల వలలో పడి రహస్య పత్రాలను లీక్ చేసిన సంఘటనలు వెలుగుచూశాయి. దీంతో భారత ప్రభుత్వం భద్రతా బలగాల ఫోన్లలో ఉన్న సుమారు 42 అనుమానాస్పద యాప్‌లను తొలగించాలని ఆదేశించింది. డిజిటల్ యుగంలో ఇటువంటి ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ను తిప్పికొట్టడానికి భద్రతా సంస్థలు జారీ చేసే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (SOP)లను కచ్చితంగా పాటించాలని, పొరపాటున ఏమైనా అనుమానాస్పద చర్యలు జరిగితే వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించి భద్రతా రంధ్రాలను పూడ్చాలని నిపుణులు సూచిస్తున్నారు.
