ఇజ్రాయెల్ పై ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధమైన ఇరాన్.. ఏక్షణమైనా దాడి చేయొచ్చు.. అప్రమత్తమైన అమెరికా

ఇజ్రాయెల్ పై ఇరాన్, హెజ్బొల్లా భీకర దాడులకు పాల్పడే అవకాశం ఉందని యునైటెడ్ స్టేట్స్ విశ్వసిస్తోందని ఆక్సియోస్ నివేదించింది.

Israel Hamas War

Israel Hamas War : ఇజ్రాయెల్ పై ఇరాన్, హెజ్బొల్లా భీకర దాడులకు పాల్పడే అవకాశం ఉందని యునైటెడ్ స్టేట్స్ విశ్వసిస్తోందని ఆక్సియోస్ నివేదించింది. యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆంటోనీ బ్లింకెన్ జీ7లో తన సహచరులను కూడా హెచ్చరించినట్లు నివేదిక పేర్కొంది. యూఎస్ మిత్ర దేశాలతో సమన్వయం చేసుకోవడానికి, పెద్దెత్తున దాడులను అడ్డుకొని శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు ఇరాన్, హెజ్బుల్లాపై చివరి నిమిషం వరకు దౌత్యపరమైన ఒత్తిడిని తీసుకొచ్చేందుకు బ్లింకెన్ కాన్ఫరెన్స్ కాల్ ని ఏర్పాటు చేసినట్లు నివేదిక వెల్లడించింది. ఇటీవల హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హనియా ఇరాన్ రాజధాని టెహ్రాన్ లో హత్యకు గురైన విషయం తెలిసిందే. మరోవైపు ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో హెజ్బొల్లా సీనియర్ మిలిటరీ కమాండర్ ఫాద్ షుక్ర్ మృతిచెందాడు. హమాస్, హెజ్బొల్లా గ్రూపులకు ఇరాన్ మద్దతు ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ రెండు పరిణామాల తరువాత పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు భగ్గుమన్నాయి.

Also Read: వయనాడ్ ఘటనలో కుటుంబం మొత్తాన్ని కోల్పోయిన విద్యార్థి.. 18ఏళ్ల జ్ఞాపకాలను తొలగించాడు

హమాస్ – ఇజ్రాయెల్ యుద్ధంతో ఇప్పటికే ఆ ప్రాంతం అల్లకల్లోలంగా మారింది. తాజా పరిణామాలతో ఇరాన్, హెజ్బొల్లా దాడులకు దిగితే పరిస్థితి మరింత దారుణంగా తయారుయ్యే అవకాశం ఉంది. ఇరాన్ ఏక్షణంలో ఎక్కడి నుంచి దాడులు జరుపుతుందో తెలియని పరిస్థితి. 24గంటల నుంచి 48గంటల్లో ఎప్పుడైనా దాడులకు పాల్పడవచ్చని అమెరికా భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఉధ్రిక్తతలను చల్లార్చేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నామని అమెరికా వెల్లడించింది. పశ్చిమాసియాలో తాజా పరిస్థితులపై సమీక్షించేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ జాతీయ భద్రతా మండలితో సమావేశం అవుతున్నారని శ్వేతసౌధం తెలింది. జోర్దాన్ రాజు అబ్దుల్లాతోనూ ఆయన చర్చించనున్నట్లు శ్వేతసౌదం వెల్లడించింది.

Also Read : అలాచేస్తే ఎవర్నీ వదిలిపెట్టను.. కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

అయితే, ఇజ్రాయెల్ లోని ప్రముఖ వార్తాపత్రిక ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహు తన సీనియర్ సైనిక అధికారులతో సమావేశం అయినట్లు పేర్కొంది. ఇరాన్ దాడులకు సిద్ధమవుతున్నట్లు సాక్ష్యాలు లభిస్తే ఇరాన్ ను ఎదుర్కోవటానికి ముందస్తు దాడిని యోచిస్తున్నట్లు తెలిపింది. మొత్తంగా పశ్చిమాసియాలో నెలకొన్న ఘర్షణపూరిత పరిస్థితులను శాంతింపజేయాలని ప్రయత్నిస్తున్నామని, అలా జరగని పక్షంలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ఇజ్రాయెల్ తో కలిసి సిద్ధమవుతున్నామని శ్వేతసౌధం ప్రతినిధి ఒకరు తెలిపారు.

 

 

ట్రెండింగ్ వార్తలు