వయనాడ్ ఘటనలో కుటుంబం మొత్తాన్ని కోల్పోయిన విద్యార్థి.. 18ఏళ్ల జ్ఞాపకాలను తొలగించాడు
అభిజిత్ తన తండ్రి, సోదరి అంత్యక్రియలను మరియమ్మ ఆలయ అంత్యక్రియల మైదానంలో నిర్వహించాడు. ఈ క్రమంలో తన చెల్లెలి మొహం చూసి కన్నీరు పెట్టుకున్నాడు.
Wayanad landslides : కేరళ రాష్ట్రంలోని వయనాడ్ లో సంభవించిన ప్రకృతి విలయం వందలాది కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడిన ఘటనలో 350కిపైగా మంది మరణించారు. మరో రెండు వందల మంది ఆచూకీ లభించలేదు. పుంచిరిమట్టం గ్రామానికి చెందిన అభిజిత్ కల్లింగల్ వయస్సు 18ఏళ్లు. అతను హోటల్ మేనేజ్ మెంట్ విద్యార్థి. కొండచరియలు విరిగిపడిన ఘటన జరిగిన రోజు ఆ యువకుడు చదువు నిమిత్తం తిరువనంతపురంలో ఉన్నాడు. దీంతో ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదంలో తన కుటుంబానికి చెందిన ఎనిమిది మంది మరణించారు. అతని తల్లిదండ్రులు, తోబుట్టువులు, అమ్మమ్మ, మామ, అత్త, కోడలు, అతని ఇంటిలో ఆశ్రయం పొందిన నలుగురు స్నేహితులతో సహా మొత్తం ఎనిమిది మంది మరణించారు.
Also Read : Wayanad landslides : లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో వయనాడ్ సహాయక చర్యల్లో మోహన్‌లాల్..
వయనాడ్ విపత్తు ఘటన అభిజిత్ కు తీరని విషాదాన్ని నింపింది. అతని ఇల్లు ఎత్తులో ఉండటంతో సురక్షితమైనదిగా భావించాడు. కానీ, ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. ఆ సమయంలో అందులో ఉన్న 12 మంది చనిపోయారు. అతని తండ్రి, సోదరి, మామ, అత్త మృతదేహాలు శిథిలాల నుంచి బయటపడ్డాయి. అయితే, అతని తల్లి, సోదరుడు, అమ్మమ్మ, బంధువులు ఆచూకీ ఇంకా లభించలేదు. అభిజిత్ ఒంటిరిగా మిగిలిపోయాడు. అభిజిత్ మేనమామ నారాయణన్ కుటుంబం నుంచి ప్రాణాలతో అతని బంధువు ప్రణవ్ మాత్రమే ఉన్నాడు. అతనికి తీవ్ర గాయాలయ్యాయి.
Also Read : Nagababu : మాట నిలబెట్టుకున్న మెగా బ్రదర్.. వాళ్ళ కోసం సాయం..
అభిజిత్ తన తండ్రి, సోదరి అంత్యక్రియలను మరియమ్మ ఆలయ అంత్యక్రియల మైదానంలో నిర్వహించాడు. ఈ క్రమంలో తన చెల్లెలి మొహం చూసి కన్నీరు మున్నీరయ్యాడు. ప్రస్తుతం అతను జీహెచ్ఎస్ఎస్ మెప్పాడిలోని రిలీఫ్ క్యాంపులో ఉన్నాడు. మా ఊరు చాలా అందంగా ఉండేది.. నేను చాలా చిత్రాలను నా మొబైల్ ఫోన్లో తీశాను. వాటిని చూస్తుంటే గత జ్ఞాపకాలు గుర్తుకొచ్చి తట్టుకోలేక పోతున్నాను. ఇప్పుడు చాలా వరకు వాటిని తొలగించాను. అన్నీ పొగొట్టుకున్నప్పుడు వాటిని ఉంచడం వల్ల ప్రయోజనం ఏమిటి అంటూ అభిజిత్ మొబైల్ లోని చిత్రాలను ఒక్కొక్కటిగా తొలగిస్తున్నాడు. ఇలా.. వయనాడ్ విపత్తులో ఎవరిని కదిలించినా తమ కుటుంబ సభ్యులను కోల్పోయి కన్నీరు మున్నీరవుతున్నారు.