Israeli Airstrikes : గజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు.. 20 మంది దుర్మరణం
ఇజ్రాయెల్-పాలస్తీనాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. నార్త్ గజాపై ఇజ్రాయెల్ దళం వైమానిక దాడులకు దిగింది. ఈ దాడుల్లో హమాస్ కమాండర్‌తోపాటు 20 మంది మృతిచెందారు. జెరూసలెంలోని అల్-ఆక్సా మసీదు ప్రాంగణంలో తీవ్ర ఉద్రిక్తతలు పరిస్థితులు నెలకొన్నాయి.

Israeli Airstrikes In Response To Gaza Rocket Barrage Leave 20 Dead
Israeli airstrikes to Gaza rocket : ఇజ్రాయెల్-పాలస్తీనాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. నార్త్ గజాపై ఇజ్రాయెల్ దళం వైమానిక దాడులకు దిగింది. ఈ దాడుల్లో హమాస్ కమాండర్‌తోపాటు 20 మంది మృతిచెందారు. ఇజ్రాయెల్ రాజధాని నగరం జెరూసలెంలోని అల్-ఆక్సా మసీదు ప్రాంగణంలో తీవ్ర ఉద్రిక్తతలు పరిస్థితులు నెలకొన్నాయి. ఇజ్రాయెల్ పోలీసులు, పాలస్తీన పౌరుల మధ్య తీవ్ర ఘర్షణలకు దారితీసింది. ఇజ్రాయెల్ పోలీసులపై పాలస్తీనావాసులు రాళ్ల దాడులతో విరుచుకుపడ్డారు.
ఈ క్రమంలో వారిని చెదరగొట్టేందుకు ఇజ్రాయెల్ పోలీసులు టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్లు, స్టన్ గ్రెనేడ్లను ప్రయోగించారు. జెరూసలేంలో కొన్ని వారాలుగా పాలస్తీనావాసులు, ఇజ్రాయెల్ భద్రతా దళాల మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో గజా నుంచి ఇజ్రాయెల్‌పై హమాస్, పాలస్తీనా మిలిటెంట్లు రాకెట్లతో దాడులకు దిగారు. దాంతో ఇజ్రాయెల్ కూడా ప్రతిదాడిగా వైమానిక దాడులకు దిగింది. ఈ దాడుల్లో 20 మంది వరకు మరణించారు.
మృతుల్లో 9 మంది చిన్నారులతోపాటు ఓ సీనియర్ హమాస్ కమాండర్ కూడా ఉన్నారు. జెరూసలెంలో జరిగిన ఘర్షణల్లో 305 మంది పాలస్తీనియన్లు గాయపడ్డారు. 228 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. పాలస్తీనియన్ల రాళ్ల దాడుల్లో 21 మంది పోలీసులు గాయపడినట్లు ఇజ్రాయెల్ అధికారులు తెలిపారు. ఏడుగురు ఇజ్రాయెల్ పౌరులు గాయపడ్డారు. గాజా స్ట్రిప్ నుంచి ఇజ్రాయెల్ వైపు ఉగ్రవాద పాలస్తీనా గ్రూపులు 150కి పైగా రాకెట్లతో దాడిచేసినట్టు ఇజ్రాయెల్ మిలటరీ పేర్కొంది. ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో మరణించిన 20 మందిలో తొమ్మిది మంది పిల్లలు ఉన్నారని, 65 మందికి పైగా గాయపడ్డారని పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.