Young People To Drink More Alcohol : ‘యువతీ యువకుల్లారా..రండీ..మద్యం తాగండీ అంటూ బతిమాలుతున్న ఆ దేశ ప్రభుత్వం
‘యువతీ యువకుల్లారా..రండీ..మద్యం తాగండీ అంటూ బతిమాలుతోంది జపాన్ ప్రభుత్వం. ఎందుకంటే..

young people to drink more alcohol say Japan Govt
young people to drink more alcohol say Japan Govt : బీరు బాటిల్ చూస్తే యువతకు గుండె బేజారవుతుంది. ఓ పట్టు పట్టాలనిపిస్తుంది. ఎత్తిన సీసా దించకుండా తాగేయటానికి పందాలు కూడా వేసుకుంటారు. అటువంటి యువత మద్యం తాగకపోతే..హమ్మా…ఇంకేమన్నా ఉందా? ప్రభుత్వానికి ఆదాయం పడిపోదూ..? అటువంటి కష్టమే వచ్చింది జపాన్ ప్రభుత్వానికి. దీంతో యువతీ యువకుల్లారా..మద్యం తాగండీ..మీకు నచ్చిన బ్రాండ్ తాగండీ అంటూ ప్రోత్సహిస్తోంది. అంతేకాదు యువత నచ్చినంత మద్యం తాగేలా ప్రోత్సహించేందుకు కొత్త ఆలోచనలు చెప్పమంటోంది జపాన్ ప్రభుత్వం. అందుకోసం జాతీయ స్థాయిలో పోటీలు నిర్వహిస్తోంది…! గత 31 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా మద్యం ఆదాయం పడిపోవడంతో వినియోగాన్ని పెంచేందుకు నేషనల్ ట్యాక్స్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) ఆధ్వర్యంలో ‘Sake Viva!’ పేరిట ప్రచారం ప్రారంభించింది..!!
మద్యం తాగటం పెంచటానికి 20 నుంచి 39 ఏళ్ల మధ్య యువత రావాలని ఎన్‌టీఏ కోరింది. అలాగే ఇంట్లో మద్యపానం చేసే అలవాటును ప్రోత్సహించే ఆలోచనలు చెప్పాలంటోంది ప్రభుత్వం. ఈ పోటీల్లో పాల్గొనేవారికి ఎంట్రీ ఫీజుల కూడా లేదుని తెలిపింది. జపాన్ రాజధాని టోక్యోలో నవంబర్ 10న తుది విజేతలను ప్రకటిస్తామని తెలిపింది.
జపాన్ మీడియా తెలిపిన గణాంకాల ప్రకారం.. 1995లో సగటున ఒక వ్యక్తి ఏడాదికి 100 లీటర్ల మద్యాన్ని తాగగా..అది 2020కల్లా 75 లీటర్లకు పడిపోయింది. దాంతో 1980లో పన్ను ఆదాయంలో మద్యం వాటా 5 శాతంగా ఉండగా.. 2011లో అది 3 శాతానికి తగ్గింది. 2020 వచ్చే సరికి అదికాస్తా 1.7 శాతానికి పడింది. దీనికి జపాన్ యువత తమ తల్లిదండ్రుల కంటే తక్కువ మద్యాన్ని సేవించడమే కారణమని ఎన్‌టీఏ గుర్తించింది. దీంతో యువత మద్యం తాగటానికి ప్రోత్సహిస్తోంది. కరోనా మహమ్మారి రాకతో యువత జీవనశైలిలో మార్పులు చేసుకోవడం..కట్టడి ఆంక్షలతో జపనీస్ సేక్, శోచు, విస్కీ, బీర్, వైన్ వినియోగం మరింతగా తగ్గిపోయినట్లు జపాన్ మీడియాలు వెల్లడించాయి. కాగా జపాన్ లో జననాల శాతం తగ్గిపోయి..వృద్ధుల సంఖ్య పెరుగుతోంది. మద్యం తాగటం తగ్గిపోవటానికి వృద్ధ జనాభా పెరుగుదల కూడా ఓ కారణమంటూ తెలిపాయి.
‘‘సేక్ వివా’’ పేరుతో నేషనల్ ట్యాక్స్ ఏజెన్సీ దేశవ్యాప్త పోటీ నిర్వహిస్తోంది. 20 నుంచి 39 ఏళ్ల మధ్య వయస్కులు ఇందులో పాల్గొనవచ్చు. యూత్‌లో మందు కొట్టే అలవాటును పెంచేందుకు ఏం చేయాలో వారు సలహాలు సూచనలివ్వాలి. అందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెటావర్స్ తదితరాల సాయంతో వినూత్నం, ఆకర్షణీయం అయిన సేల్స్ టెక్నిక్స్ పద్ధతులను రూపొందించవచ్చు.ఈ పోటీ సెప్టెంబర్ 9 దాకా నడుస్తుంది. ఫైనలిస్టులను అక్టోబర్లో నిపుణుల కన్సల్టేషన్ కోసం ఆహ్వానిస్తారు. నవంబర్లో టోక్యోలో తుది రౌండ్ పోటీ ఉంటుంది. విజేత తన మద్యం అమ్మకాల పెంపు బ్లూప్రింట్‌ను అమలు చేసేందుకు ఏజెన్సీ పూర్తి సహాయ సహకారాలు అందజేస్తుందట! ‘‘మద్యం మార్కెట్ నానాటికీ కుంచించుకుపోతోంది. అందుకే యువత మందు అలవాటు చేసుకుని ఈ పరిశ్రమకు జీవం పోసేలా చేయడమే ఈ కాంపిటీషన్ లక్ష్యం’’ అని ఏజెన్సీ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.