Putins Dinner Menu: జోల్ మోమో, తందూరీ భర్వాన్ ఆలూ, ములక్కాయ చారు, బాదం హల్వా ఇంకా.. పుతిన్ రుచి చూసిన భారతీయ వంటకాలు ఇవే..

గోంగూర పచ్చడి, మామిడి పచ్చళ్లను సైతం పుతిన్‌ టేస్ట్ చేశారు. డ్రై ఫ్రూట్స్‌ వేసిన సాఫ్రాన్‌ పులావ్‌ను రుచి చూశారు.

Putins Dinner Menu: జోల్ మోమో, తందూరీ భర్వాన్ ఆలూ, ములక్కాయ చారు, బాదం హల్వా ఇంకా.. పుతిన్ రుచి చూసిన భారతీయ వంటకాలు ఇవే..

Updated On : December 6, 2025 / 4:43 PM IST

Putins Dinner Menu: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ కు దగ్గరి మిత్రుడిగా గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పుతిన్ ఇండియాకు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. భారత్-రష్యా శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడానికి ఆయన ఇక్కడికి వచ్చారు. 2 రోజుల పాటు భారత్ లో ఉన్నారు. ఈ పర్యటనలో భారత్ తో పలు కీలక ఒప్పందాలు చేసుకున్నారు. ఈ టూర్ లో పుతిన్ పలు రకాల భారతీయ వంటకాలను రుచి చూశారు. అందులో తెలుగు ప్రజలు అమితంగా ఇష్టపడే ఐటెమ్స్ కూడా ఉన్నాయి. ఆయన ఏయే వంటకాలను టేస్ట్ చేశారో, ఆయన ముందు ఉంచిన ఫుడ్ మెనూలో ఏయే ఆహార పదార్ధాలు ఉన్నాయో తెలుసుకుందాం..

రెండు రోజుల పర్యటన సందర్భంగా పుతిన్‌కు గౌరవార్థం రాష్ట్రపతి ముర్ము శుక్రవారం రాత్రి రాష్ట్రపతిభవన్‌లో రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు విలాసవంతమైన శాఖాహార విందును ఇచ్చారు. ఈ విందులో పలు భారతీయ వంటకాలను ఆయనకు వడ్డించారు.

జోల్ మోమో, గుచ్చి డూన్ చెటిన్ నుండి తందూరి భర్వాన్ ఆలూ వరకు.. ఇంకా జఫ్రానీ పనీర్ రోల్, పాలక్ మేథీ మత్తర్ కా సాగ్, ఎల్లో దాల్ తడ్కా పులావ్, రొట్టెలు.. ఇలా వివిధ రకాల భారతీయ వంటకాలు మెనూలో ఉన్నాయి. ఇక డిజర్ట్స్ విషయానికి వస్తే.. బాదం కా హల్వా, కేసర్-పిస్తా కుల్ఫీ, గుర్ సందేశ్, తాజా పండ్లు, రిఫ్రెష్ ఫ్రూట్, అల్లం రసాలు మెనూలో ఉన్నాయి.

అంతేకాదు.. ఏపీ, తెలంగాణ ప్రజలు అమితంగా ఇష్టపడే ములక్కాయ చారును కూడా పుతిన్ టేస్ట్ చేశారు. సూప్‌ల కేటగిరీలో మెనూ కార్డులో తొలుత ములక్కాయ చారు పేరును చేర్చారు. కశ్మీరీ స్టైల్‌లో వాల్‌నట్లను కలిపిన గుచ్చీ డూన్‌ చెటిన్, మినప వడలు, కూరగాయలతో నింపిన జోల్‌ మోమోలును పుతిన్‌కు వడ్డించారు. మెయిన్‌ కోర్స్‌లో జాఫ్రానీ పనీర్, పాలకూర మెంతికూర, పచ్చిబఠానీల కూరలతోపాటు పెరుగు, మసాలా దట్టించిన తందూరీ భార్వాన్‌ ఆలూ, చిన్న వంకాయలతో చేసిన ఆఛారీ బైగన్‌లనూ పుతిన్‌కు వడ్డించారు.

టమాట, ఉల్లిగడ్డ కలబోతగా వండిన కందిపప్పు కూర సైతం వడ్డించారు. గోంగూర పచ్చడి, మామిడి పచ్చళ్లను సైతం పుతిన్‌ టేస్ట్ చేశారు. డ్రై ఫ్రూట్స్‌ వేసిన సాఫ్రాన్‌ పులావ్‌ను రుచి చూశారు. లచ్ఛా పరంఠా, మగజ్‌ నాన్, సతనాజ్‌ రోటీ, మిస్సీ రోటీ, బిస్కటీ రోటీలను ప్రత్యేకంగా వడ్డించారు. బాదం హల్వా, కేసర్‌ పిస్తా కుల్ఫీలనూ అందించారు.

అంతేకాదు తెలుగు ప్రజలు ఇష్టంగా తినే మురుకులతోపాటు బెంగాళీ గురు సందేశ్‌ మిఠాయిని పుతిన్‌కు ఇచ్చారు. దానిమ్మ, బత్తాయి, క్యారట్‌ జ్యూస్‌లు అందించారు. నాలుగేళ్ల తర్వాత తొలిసారిగా పుతిన్ ఇండియాకు వచ్చారు. పుతిన్ భారత పర్యటన యావత్ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది.

Also Read: మోదీ, పుతిన్ భేటీలో ప్రత్యేక ఆకర్షణగా ఓ మొక్క.. దీనికి గురించి తెలుసా..? అక్కడ ఎందుకు ఉంచారంటే?