Benjamin Netanyahu: ఇజ్రాయెల్ ప్రధానికి షాకిచ్చిన ఐసీసీ.. తీవ్రంగా స్పందించిన బైడెన్
ఐసీసీ అరెస్టు వారెంట్ పై బెంజమిన్ నెతన్యాహు స్పందించాడు. గాజాలో ఇజ్రాయెల్ యుద్ధం చేస్తోంది తప్ప మరేమీ లేదని అన్నారు. ఐసీసీ పేర్కొన్నవన్నీ అసంబద్ధమైనవి..

Benjamin Netanyahu and joe biden
Benjamin Netanyahu : ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు (ఐసీసీ) షాకిచ్చింది. నెతన్యాహుపై అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఇజ్రాయెల్ రక్షణశాఖ మంత్రి యోఆవ్ గల్లాంట్ పైనా అరెంట్ వారెంట్ జారీ అయింది. అదేవిధంగా ఉగ్రసంస్థ హమాస్ నేతలు మహ్మద్ డెయిఫ్, యహ్యా సిన్వర్, ఇస్మాయిల్ హనియోహ్ లపైనా ఐసీసీ అరెస్టు వారెంట్ జారీ చేసింది. నేతన్యాహు, మాజీ మంత్రి గల్లాంట్ లు గాజాలో హత్యలు, హింస, అమానవీయ చర్యలతోపాటు ఆకలిచావుల వంటి యుద్ధ నేరాలకు పాల్పడినట్లు ఐసీసీ ఆరోపించింది. అక్కడి పౌరులకు ఆహారం, నీరు, ఔషదాల సరఫరాపై ఆంక్షలు విధించారని, అక్కడి పౌరులను లక్ష్యంగా చేసుకున్నారనేందుకు తగినన్ని ఆధారాలను గుర్తించినట్లు ఐసీసీ పేర్కొంది.
Also Read: Russia Ukraine War : యుక్రెయిన్ అంతు చూసేందుకే రష్యా డిసైడైపోయిందా?
ఐసీసీ అరెస్టు వారెంట్ పై బెంజమిన్ నెతన్యాహు స్పందించాడు. గాజాలో ఇజ్రాయెల్ యుద్ధం చేస్తోంది తప్ప మరేమీ లేదని అన్నారు. ఐసీసీ పేర్కొన్నవన్నీ అసంబద్ధమైనవి, తప్పుడు చర్యలు. వాటిని తిరస్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. తాజా పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. ఇది అతి దారుణమైన చర్య అని అభివర్ణించారు. ఇజ్రాయెల్, హమాస్ ను సమానంగా చూడటాన్ని తీవ్రంగా ఖండించారు. ఇజ్రాయెల్ కు ఎల్లప్పుడూ అండగా ఉంటామని బైడెన్ ప్రకటించాడు.
Also Read: ICC Arrest Warrants : ‘యుద్ధ నేరాలపై’ నెతన్యాహు, యోవ్ గ్యాలంట్‌లకు ఐసీసీ అరెస్ట్ వారెంట్లు జారీ!
ఇదిలాఉంటే.. లెబనాన్ పై ఇజ్రాయెల్ మరోసారి దాడికి పాల్పడింది. బాల్బెక్ జిల్లాను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్ సైన్యం దాడి చేసింది. ఈ దాడిలో 40 మంది చనిపోయారని, 52 మంది గాయపడ్డారని లెబనాన్ ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. వేరువేరుగా పది చోట్ల దాడులు జరగడంతో మరికొందరు చనిపోయారని లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇదిలాఉంటే.. ఇజ్రాయెల్ – హమాస్ మధ్య వివాదం గత ఏడాది అక్టోబర్ 7 నుంచి గాజాలో జరిగిన ఘర్షణలతో ప్రారంభమైంది. హమాస్ దక్షిణ ఇజ్రాయెల్ లోకి దూసుకెళ్లి దాదాపు 1200 మందిని హతమార్చడంతో యుద్ధం మొదలైంది. ఇప్పటి వరకు సుమారు 44వేల మందికిపైగా మరణించారని హమాస్ పాలనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.