భారత్ దెబ్బతో మాల్దీవులకు దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తోందా? అందుకే ఇలా..

Maldives: ప్రస్తుత అధ్యక్షుడు మయిజ్జు వైఖరిలో మాత్రం మార్పురావడం లేదు. దేశం ఏమయిపోయినా పర్లేదు కానీ..

భారత్ దెబ్బతో మాల్దీవులకు దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తోందా? అందుకే ఇలా..

India Maldives Controversy

Updated On : March 10, 2024 / 9:47 PM IST

భారత్ దెబ్బతో మాల్దీవులకు దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తోందా..? భారత్ ఇచ్చిన బాయ్‌ కాట్ పిలుపుతో పర్యాటక రంగం కుదేలై మాల్దీవులు అల్లాడుతోందా…? రానున్న రోజుల్లో మాల్దీవుల పరిస్థితి మరింత దిగజారనుందా..? చైనాను చూసుకుని…భారత్‌తో మాల్దీవుల సంబంధాలను దెబ్బతీసేందుకు శక్తివంచన లేకుండా శ్రమిస్తున్న మహ్మద్ మయిజ్జు తగిన మూల్యం చెల్లించుకోబోతున్నారా..?

మబ్బుల్లో నీళ్లుచూసి ముంత ఒలకపోసుకన్న చందంగా మారిన మయిజ్జు చర్యలతో మాల్దీవుల ఆర్థిక వ్యవస్థ పతనావస్థకు చేరబోతోందా..? మాజీ అధ్యక్షుడు, ఇతర నిపుణుల మాట విని ఇప్పటికైనా మయిజ్జు జాగ్రత్తపడకపోతే…మాల్దీవులు మరో శ్రీలంక అయ్యే ప్రమాదం ఉందా.?..అవుననే అనిపిస్తోంది తాజా పరిస్థితులు చూస్తుంటే.

ఒకప్పుడు భారత్‌కు మిత్రదేశం
అద్భుతమైన బీచ్‌లు, ప్రకృతి అందాలకు నిలయంగా ఉండే మాల్దీవులు ఒకప్పుడు భారత్‌కు మిత్రదేశం. మన పర్యాటకులు ఎక్కువగా వెళ్లే దేశం. అసలు కొన్నేళ్లుగా సినిమా సెలబ్రిటీలకు బెస్ట్ డెస్టినేషన్ స్పాట్‌గా ఉంది. హీరోలు, హీరోయిన్లు… మాల్దీవుల రిసార్టులు, బీచ్‌ల్లో దిగిన ఫొటోలతో సోషల్ మీడియా నిండిపోయేది.

మాల్దీవుల పర్యాటకం ప్రమోషన్‌కు మన దేశమే కేరాఫ్ అడ్రస్‌గా ఉండేది. 2023 డిసెంబరు వరకు ఇదే పరిస్థితి ఉంది. ఆ దేశ టూరిజం మార్కెట్‌లో 11శాతం వాటాతో భారత్ అగ్రస్థానంలో ఉండేది. ఆర్థిక, రక్షణ రంగాల్లో భారత్‌ మాల్దీవులకు పెద్దన్నలా సాయం చేసేది. అన్ని విధాలా అండగా నిలిచేది. మాల్దీవుల మనుగడలో ఇంతలా భాగం అవుతున్న భారత్ విషయంలో ఆ దేశం ఎలా వ్యవహరించాలి…? ఎంత కృతజ్ఞతతో నడుచుకోవాలి..? ఇంకెంతలా గౌరవించాలి…?

గతంలో మనకు, మాల్దీవులకు మధ్య అంతా బాగానే ఉండేది. పొరుగుదేశంగా, పెద్దదేశంగా, మిత్రదేశంగా ఉన్న భారత్‌తో మాల్దీవులు ఎంతో స్నేహంగా, జాగ్రత్తగా ఉండేది. ఆ దేశానికి కొత్తగా అధ్యక్షులు అయిన వాళ్లెవరైనా ముందుగా భారత్‌లోనే పర్యటించేవారంటే రెండు దేశాల మధ్య బంధం ఎంత బలంగా ఉండేదో అర్ధంచేసుకోవచ్చు. కానీ మహ్మద్ మయిజ్జు మాల్దీవుల అధ్యక్షుడయిన తర్వాత అంతా మారిపోయింది. భారత్‌ను వ్యతిరేకించడం, మనతో నిరంతరం గొడవలు పెట్టుకునే చైనాకు విశ్వాసంగా ఉండడం, చైనాకు వీలయినంత దగ్గరగా ఉండడాన్ని మాల్దీవుల విదేశాంగ విధానంగా మార్చేందుకు మయిజ్జు ప్రయత్నాలు ప్రారంభించారు. అన్నలా అండగా ఉంటున్న భారత్‌ను రెచ్చగొట్టడం, మనకు దూరం జరగడం ద్వారా దేశంలోనూ, ప్రపంచస్థాయిలోనూ గుర్తింపు పొందడమే మయిజ్జు లక్ష్యాలుగా మారిపోయాయి.

భారత సైనికులు వెళ్లిపోవాలని
మాల్దీవుల్లో ఉన్న భారత సైనికులు మే 10లోపు వెళ్లిపోవాలని మయిజ్జు ఆదేశించారు. రెండు నెలలు పాటు జరిగే ఈ కార్యక్రమం ఇప్పటికే మొదలయింది. సైనికులు యూనిఫాం రూపంలోనూ, సాధారణ దుస్తుల్లోనూ భారతీయులు మాల్దీవుల్లో ఉండరాదని స్పష్టమైన ఆదేశాలిచ్చారు. చైనాలో పర్యటించారు. ఆ దేశంతో ఆయుధ ఒప్పందాలూ కుదుర్చుకుంటున్నారు.

ఇంతవరకూ భారత పర్యటనకూ రాలేదు. అంటే చైనాతో స్నేహమే తమకు ప్రధానమన్న సంకేతాలు పంపిస్తున్నారు. పర్యాటకంతో పాటు అన్ని విషయాల్లోనూ మనపై ఆధారపడే మాల్దీవుల వైఖరి గమనించిన తర్వాత ప్రధాని ఆ దేశానికి ఓ ఝలక్ ఇచ్చారు. ఈ ఏడాది జనవరిలో లక్షద్వీప్‌లో ప్రధాని పర్యటించారు. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఇక్కడినుంచే మాల్దీవుల పతనం ప్రారంభమయింది. ప్రధాని లక్షద్వీప్ పర్యటన ఉద్దేశం అందరికన్నా ముందుగా అర్ధమైంది మాల్దీవుల ప్రభుత్వానికే. అందుకే ఆ దేశ ప్రభుత్వం ఉలిక్కిపడింది. ప్రధానిపై అక్కసు వెళ్లగక్కింది. లక్షద్వీప్ పర్యటనపై అవాకులూ చవాకులూ మాట్లాడారు మంత్రులు. నోటికి పనిచెప్పిన మంత్రులపై ప్రభుత్వం చర్యలు తీసుకున్నప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇంకా జరుగుతూనే ఉంది.

ప్రధాని మోదీపై మాల్దీవుల నేతలు చేసిన విమర్శలను భారతీయులు సీరియస్‌గా తీసుకున్నారు. బాయ్‌కాట్ మాల్దీవుల నినాదంతో సోషల్ మీడియా ఊగిపోయింది. వ్యక్తుల నుంచి పర్యాటక సంస్థలదాకా అందరూ మాల్దీవుల తిక్క కుదిర్చేందుకు పోటీ పడ్డారు. అప్పటికే తలపెట్టిన పర్యటనలను కూడా రద్దుచేసుకున్నారు. దీంతో మాల్దీవుల పర్యాటక రంగం పెను కుదుపునకు లోనయింది.

పర్యాటకుల సంఖ్య ఢమాల్
భారత్ అమలుచేస్తున్న బాయ్‌కాట్ పిలుపుతో ఆ దేశానికి వెళ్లే మన పర్యాటకుల సంఖ్య భారీగా పడిపోయింది. ఒకప్పుడు మాల్దీవుల పర్యాటక మార్కెట్‌లో అగ్రస్థానంలో ఉన్న భారత్.. వివాదం మొదలయిన మూడు వారాలకే ఐదోస్థానంలో నిలిచింది. 28వేల మంది పర్యాటకులతో ఈ నెల ప్రారంభంలో ఆరోస్థానంలో ఉంది.

భారత్ నుంచి వచ్చే ఆదాయాన్ని మాల్దీవులు ఎంతగా కోల్పోయిందో ఈ లెక్కలనుబట్టి అర్ధంచేసుకోవచ్చు. మాల్దీవుల మాజీ అధ్యక్షుడు మహ్మద్ నషీద్ అదే అంటున్నారు. భారత్ పిలుపునిచ్చిన బాయ్‌కాట్ దెబ్బ మాల్దీవులకు గట్టిగా తగిలిందని, పర్యాటకరంగంపై తీవ్ర ప్రభావం చూపిందని ఆందోళన వ్యక్తంచేశారు.

భారత్‌కు మహ్మద్ నషీద్ క్షమాపణలు చెప్పారు. తమ ఆతిథ్యంలో ఎలాంటి తేడాలుండవని, భారత పర్యాటకులంతా మాల్దీవులకు రావాలని కోరారు. భారత్, మాల్దీవుల సంబంధాలు సాధారణస్థితికి రావాలని ఆకాంక్షించారు. మాజీ అధ్యక్షులు, ఇతర నేతలంతా ఇలా దేశానికి కలిగిన నష్టాన్ని వీలయినంత తగ్గించేందుకు ప్రయత్నిస్తోంటే….. ప్రస్తుత అధ్యక్షుడు మయిజ్జు వైఖరిలో మాత్రం మార్పురావడం లేదు.

దేశం ఏమయిపోయినా పర్లేదు కానీ..తన వ్యక్తిగత అజెండా అమలే ముఖ్యమన్న తరహాలో ముందుకెళ్తున్నారు. మబ్బులో నీళ్లు చూసి ముంత ఒలకబోసుకుంటూ….మాల్దీవులు మరో శ్రీలంకలా మారడానికి వేగంగా పడుతున్న అడుగులను అర్ధం చేసుకోలేకపోతున్నారు.

BJP: అప్పట్లో బీజేపీ ఎలా ఉండేది? ఇప్పుడు ఎలా మారిందో తెలుసా?