BJP: అప్పట్లో బీజేపీ ఎలా ఉండేది? ఇప్పుడు ఎలా మారిందో తెలుసా?

ఏపీలో టీడీపీ, బీజేపీది పాత మిత్రత్వమే. ఇప్పుడు మళ్లీ ఎన్డీయేలో చేరింది టీడీపీ.

BJP: అప్పట్లో బీజేపీ ఎలా ఉండేది? ఇప్పుడు ఎలా మారిందో తెలుసా?

BJP

ఆశించేస్థాయి నుంచి శాసించే స్థాయికి ఎదిగింది బీజేపీ. ఒకప్పుడు ప్రాంతీయ పార్టీలతో కలిపి..కూటమిని ఏర్పాటు చేసిన బీజేపీ.. ఆ ప్రాంతీయ పార్టీలు చెప్పినట్లు నడుచుకునేది. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. బీజేపీ చెప్పినట్లే ఎన్డీయే కూటమి పార్టీలు నడుచుకునే పరిస్థితి వచ్చింది.

తాము చెప్పిన షరతులకు ఒప్పుకుంటేనే ఎన్డీయేలో చేర్చుకుంటున్నారు కమలనాథులు. వాజ్ పేయ్, అద్వానీ హయాంలో ప్రాంతీయ పార్టీలను కలుపుకుని అధికారంలోకి వచ్చారు. అప్పట్లో ఎన్డీయేలో ప్రాంతీయ పార్టీల హవా నడిచేది. తమ రాష్ట్రాలకు కావాల్సిన నిధులు, పదవులను పట్టుబట్టి తీసుకునేవి.

నార్త్, సౌత్ అని తేడా లేకుండా కూటమిలోని ప్రాంతీయ పార్టీలన్నీ ఎన్డీఏను తమకు అనుకూలంగా ఉండేలా చేసుకున్నారు.. వాజ్‌పేయ్, అద్వానీ ఆధ్వర్యంలోని బీజేపీ కూడా నాడు కూటమి పక్షాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. వాళ్లు చెప్పిన సలహాలు, సూచనలు పాటించేది..

2014కు ముందు.. తర్వాత..
అయితే ఇప్పుడున్న బీజేపీని రకరకాలుగా పోలుస్తారు పొలిటికల్ ఎనలిస్టులు. 2014కు ముందు బీజేపీ.. తర్వాత బీజేపీ అని విశ్లేషిస్తుంటారు. అంటే వాజ్‌పేయ్, అద్వానీ ఉన్నప్పుడు ఒకలెక్క. ఇప్పుడు మరో లెక్క అన్నట్లు. 2014లోనూ మోదీ మిత్రపక్షాలను కలిసి ఎన్నికలకు వెళ్లారు. 2019లోనూ కొన్ని మిత్రపక్షాలతో కలసి పోటీచేశారు. పొత్తు అవసరం మాకే కాదు.. మీకు కూడా అవసరం అనేది మోదీ, అమిత్ షా మాట. కలసి పోటీ చేస్తే అధికారాన్ని షేర్ చేసుకోవచ్చు.

కానీ అన్నీ మీరనుకున్నట్లు కుదరవని తేల్చి చెబుతున్నారు. ఇది నచ్చక కొన్ని పార్టీలు ఎన్డీయే కూటమి నుంచి బైటకొచ్చాయి.. కానీ క్యాలెండర్‌ తిరిగే సరికి క్యాలిక్యులేషన్స్‌ మళ్లీ మారిపోయాయి.. ఎన్డీఏ కూటమికే జైకొడ్తూ బీజేపీతో దోస్తీ కడుతున్నాయి పార్టీలు.. అంతలా ఈక్వేషన్స్‌ సెట్‌ చేసుకున్న బీజేపీ వచ్చే పార్టీలకు కండీషన్స్‌ అప్లై అని ముందే ఖరాకండీగా తేల్చి చెబుతోంది..

ఒకప్పుడు ఎన్డీయేలోని మిత్రపక్షాలు ఇచ్చిన సీట్లలో మాత్రమే పోటీ చేసింది బీజేపీ. తమకు పట్టులేదు కాబట్టి.. కూటమిలో ఉండి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే చాలనుకునే వారు. మోదీ, అమిత్ షా ద్వయం లెక్కవేరు. మిత్రపక్షాలతో పొత్తు ఉంటుంది. అలా అని సీట్ల త్యాగం ఉండదు. మేం కోరినన్ని సీట్లు ఇచ్చి పొత్తు పెట్టుకోవాల్సిందేనని పట్టుబడుతున్నారు. ప్రాబల్యం అంతగా లేని చోట్ల మెజార్టీ ఎంపీ సీట్లు తీసుకొని మిత్రపక్షాలను కలుపుకుపోతోంది.

పటిష్ఠత అంతే ముఖ్యం
ఐతే పొత్తులెంత ముఖ్యమో.. ఆయా రాష్ట్రాల్లో పార్టీ పటిష్ఠత అంతే ముఖ్యమని భావిస్తున్నారు మోదీ, అమిత్ షా. ఎప్పుడూ పొత్తులతో వెళ్తే పలు రాష్ట్రాల్లో గతానికి ఇప్పటికి తమ ఓటు బ్యాంకు పడిపోయిందని లెక్కలు వేసుకుంటున్నారు. ఇలా అయితే బీజేపీ సొంతంగా ఎదిగేదెప్పుడు. బలం లేదనుకుని వదిలేస్తే.. ఎన్నాళ్లనీ మిత్రపక్షాలను బతిమిలాడుకుంటాం. ఇప్పటివరకు గెలవలేని చోట గెలిచి చూపించాలని పట్టుదలతో ఉన్నారు. అందుకే ఎన్డీయే మిత్రపక్షాలను కూటమిలో చేర్చుకుంటూనే షరతులు వర్తిస్తాయంటున్నారు కమలనాథులు.

ఎన్డీయే కూటమిలో ప్రధాన భాగస్వామిగా ఉన్నా.. గతంలో ప్రాంతీయ పార్టీల మద్దతును ఆశించేస్థాయిలో ఉండేది బీజేపీ. ఇప్పుడు ప్రాంతీయ పార్టీలను నడిపించే స్థాయికి ఎదిగింది. బీజేపీ సారధ్యంలోని ఎన్డీయే కూటమిలో చేరాలంటే మోదీ, అమిత్ షా పెట్టే షరతులకు ఒప్పుకుంటేనే సాధ్యమవుతోంది. ఏ ప్రాంతీయ పార్టీ నాయకుడు అయినా.. మోదీ, అమిత్ షా ద్వయం అనుగ్రహం కోసం పాటు పడాల్సిందే. అంతలా బీజేపీని పటిష్టం చేశారు కమలనాథులు.

ఈ ఎన్నికల్లో సాధ్యమైనన్ని ఎక్కువ ఎంపీ సీట్లు సాధించాలనే లక్ష్యంతో ఉంది బీజేపీ. అందుకోసం పాత మిత్రులను మళ్లీ కలుపుకుని వెళ్తుంది. సొంతంగా 370 సీట్లు, ఎన్డీయే కూటమిగా 4వందల సీట్లు సాధించాలని టార్గెట్ గా పెట్టుకున్నారు ప్రధాని మోదీ. అందుకు తగ్గట్లుగా బీజేపీని పటిష్టం చేయడంతో పాటు.. ఆయా రాష్ట్రాల్లో బలంగా ఉన్న పార్టీలపైనే ఫోకస్ పెట్టింది. నార్త్ లో ఇప్పటికే చాలా పటిష్టంగా ఉంది బీజేపీ. ఎటొచ్చి బీజేపీకి వచ్చిన ఇబ్బందల్లా సౌత్ లోనే ఉంటుంది.

మొదటి నుంచి బీజేపీకి సౌత్ లో పెద్దగా స్ట్రాంగ్ ఓటు బ్యాంకు లేదు. సంస్థాగతంగా పార్టీ పటిష్టంగా లేకపోవడంతో దక్షిణాదిలో మొదటినుంచి పెద్దగా ప్రభావం చూపలేకపోయింది కమలం పార్టీ. ఒక్క కర్నాటకలో మాత్రం పలుమార్లు అధికారం చేపట్టింది. తమిళనాడు, కేరళ, ఏపీ, తెలంగాణలో బీజేపీకి అంత పట్టులేదు. అందుకే దక్షిణాది రాష్ట్రాల్లో ఈ సారి మంచి ఫలితాలను సాధించాలని భావిస్తోంది బీజేపీ. 130 సీట్లున్న సౌత్ లో మిత్రపక్షాలతో కలిసి కనీసం వంద సీట్లు సాధిస్తేనే..ఎన్డీయే కూటమిగా 4వందల సీట్లు గెలుచుకోగలుగుతామని అనుకుంటోంది బీజేపీ.

ఏపీలో టీడీపీ, జనసేన
ఏపీలో టీడీపీ.. బీజేపీకి పాత మిత్రువే. ఇప్పుడు మళ్లీ ఎన్డీయేలో చేరింది టీడీపీ. జనసేన ఇప్పటికే ఎన్డీయేలో ఉంది. 2019లో బీజేపీతో విభేదించి ఒంటరిగా పోటీ చేశారు చంద్రబాబు. ఆ ఎన్నికల్లో టీడీపీ ఘోర ఓటమి పాలైంది. ఆ తర్వాత నుంచి మళ్లీ ఎన్డీయేలో చేరేందుకు ప్రయత్నించారు చంద్రబాబు. ఒకప్పుడు ఎన్డీయే కన్వీనర్‌గా స్టీరింగ్‌ తిప్పిన ఆయన అప్పట్లో రాష్ట్రపతి పదవికి అబ్దుల్‌ కలామ్‌ పేరును ప్రతిపాదించి వాజపేయి, అద్వానీలను ఒప్పించింది తానేనని అంటారు చంద్రబాబు.

ఇక వాజపేయి అప్పట్లో ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికి కూడా చంద్రబాబు సలహాయే కారణం అని చెబుతారు. అయితే ఇప్పుడు అదే ఎన్డీయేలో చేరేందుకు చంద్రబాబు చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కాదు. బాబుతో కలిసేందుకు బీజేపీ ఒప్పుకోవడం లేదని పలుమార్లు పవన్ కల్యాణే చెప్పారు. ఒకప్పుడు ఎన్డీయే శాసించే స్థాయిలో ఉన్న చంద్రబాబు..ఇప్పుడు బీజేపీ నేతలు అడిగినన్ని ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి ఎన్డీయేలో చేరాల్సి వచ్చింది. దీన్నిబట్టే ఎన్డీయేను బీజేపీ ఎలా శాసిస్తుందో.. ఎన్డీయేలో చేరేందుకు పార్టీలు ఎంతలా ఆరాటపడుతున్నాయో అర్థం చేసుకోవచ్చు.

ఒంటరిగా వెళ్తే..
దక్షిణాదిలో ఒంటరిగా ఎదగడానికి..ఇప్పటికిప్పుడు బీజేపీ తగినంత బలం లేదు. ఒంటరిగా వెళ్తే.. కర్నాకట, తెలంగాణలో ఆశించిన ఫలితాలు సాధించలేకపోయింది బీజేపీ. సౌత్ లో రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పాగా వేయడంతో కమలం పార్టీ తన రూట్ ను మార్చింది. దక్షిణాదిలో పాత మిత్రులను కలుపుకెళ్తే.. కాంగ్రెస్ ను నిలువరించొచ్చని భావిస్తోంది. అందుకోసం టీడీపీ, జనసేనతో పొత్తుకుంది. ఒడిషాలో బిజూ జనతా దళ్ తో చర్చలు కొనసాగుతున్నాయి. టిడిపి, బీజేడీ గతంలో ఎన్డీయే భాగస్వాములు.

బీజేపీ సొంతంగా 370 సీట్లు సాధించాలని టార్గెట్ గా పెట్టుకుంది. అంటే 2019లో వచ్చిన సీట్ల కంటే ఇప్పుడు మరో 67 సీట్లు ఎక్కువ రావాలి. ఒకరకంగా ఇది పెద్ద టార్గెటే అని చెప్పాలి. హిందీ బెల్ట్ లో పార్టీ మంచి ఫలితాలనే సాధించే అవకాశాలున్నాయి. ఒడిశా, పశ్చిమ బెంగాల్, నార్త్ ఈస్ట్ స్టేట్స్ లో కూడా ఈసారి బీజేపీ పర్ఫామెన్స్ పెరగొచ్చు. సౌత్ స్టేట్స్ లో మాత్రమే పరిస్థితులు బీజేపీకి అనుకూలంగా లేవు. దక్షిణాది రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల ప్రభావం ఎక్కువగా ఉండటం.. బీజేపీకి పలురాష్ట్రాల్లో ఒంటరి పోరు తప్పడం లేదు.

కేరళలో భారత్ ధర్మ జనసేన పార్టీతో ఎన్డీఏ కూటమి పొత్తు కుదుర్చుకుంది. భారత్‌ ధర్మ జనసేన పార్టీతో పొత్తుకుంటుది. తమిళనాడులోనూ పీఎంకే, డీఎండీకే, పుతియా తమిళగం వంటి పార్టీలను, టీటీవీ నేతృత్వంలోని ఏఐఏడీఎంకే వర్గాలను ఒప్పించే ప్రయత్నాలు సాగుతున్నాయి. మహారాష్ట్రలో షిండే ఆధ్వర్యంలోని శివసేన, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీని కలుపుకుని వెళ్తుంది.

Also Read: అందుకే బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరాం: సీతారాం నాయక్, జలగం, సైదిరెడ్డి