వామ్మో.. అతడి గొంతులో జలగలు: నాన్‌స్టాప్ దగ్గు.. ఒకటే రక్తం!

జలగలు.. నొప్పి లేకుండా రక్తాన్ని పీల్చేస్తాయి. 60ఏళ్ల వ్యక్తి గొంతులో దూరిన రెండు జలగలు అతడి రక్తాన్నీ పీల్చేస్తున్నాయి. రెండు నెలలుగా గ్యాప్ లేకుండా దగ్గుతూనే ఉన్నాడు. దీంతో అతడి నోట్లో నుంచి తెవడ, రక్తం పడుతోంది. అసలు తన శరీరంలోకి జలగలు ఎలా వచ్చాయో తెలియదని అంటున్నాడు. రోజురోజుకీ భరించలేనంతగా దగ్గు తీవ్రత పెరగడంతో చైనాకు చెందిన బాధిత వ్యక్తి చికిత్స కోసం జింగ్ వెన్ కౌంటీలోని ఆస్పత్రికి వెళ్లాడు.
బాధితుడికి వైద్య పరీక్షలు నిర్వహించగా అతడి గొంతు, ముక్కు రంధ్రంలో రెండు జలగలు ఉన్నట్టు నిర్ధారించారు. అతడిని పరీక్షించిన లంగ్యాన్ నగరంలోని వ్యూపింగ్ కౌంటీ ఆస్పత్రి వైద్యులు.. దగ్గిన సమయంలో రక్తంతో కూడిన తెమడ పడుతున్నట్టు గుర్తించినట్టు తెలిపారు. చికిత్స ప్రారంభంలో బాధితుడికి CT స్కాన్ చేశారు. అయినా ఏం కనిపించలేదు. ఆ తర్వాత వైద్యులు bronchoscopy (శ్వాసనాళం) ద్వారా పరీక్షించారు. అతడి గొంతులో ఒక జలగ ఉండగా, కుడి నాసిక రంధ్రం చివరి భాగమైన కొండనాలుకలో మరో జలగ ఉన్నట్టు వైద్యులు గుర్తించారు.
ముందుకు బాధితుడికి అనాస్తేసియా ఇచ్చిన తర్వాత 10 సెంటీమీటర్ల పొడవైన జత చిమటలను గొంతులోపలికి పంపించారు. ఆ రెండు జలగలను బయటకు లాగి తొలగించారు. బాధిత వ్యక్తి ప్రతిరోజు అడవిలో తిరగడం అలవాటు. పర్వతప్రాంతాల్లోని కొలనులో నీటిని తాగుతుంటాడు. తనకు తెలియకుండానే నీటి ద్వారా రెండు జలగలు అతడి శరీరంలోకి ప్రవేశించి ఉండొచ్చునని అంటున్నాడు. అతడు నీరు తాగిన సమయంలో జలగలు చాలా చిన్న పరిమాణంలో ఉండటంతో గ్రహించలేకపోయానని అన్నాడు. గత రెండు నెలలుగా జలగలు అతడి శరీరంలోనే ఉంటూ నెమ్మదిగా రక్తాన్ని పీలుస్తూ పెరుగుతున్నాయి.
నొప్పి లేకుండా జలగలు రక్తాన్ని పీలుస్తాయని అందరికి తెలుసు. అందుకే అతడికి నొప్పి తెలియలేదు. అప్పటినుంచి తీవ్రమైన దగ్గు వస్తోంది. అతడు దగ్గినప్పడుల్లా నోట్లో నుంచి రక్తం పడటంతో ఆస్పత్రికి వచ్చినట్టు వైద్యుడు రావు తెలిపారు. ప్రస్తుతం.. బాధిత వ్యక్తి కోలుకుంటున్నాడని ఆయన చెప్పారు. కొన్ని రోజుల క్రితం చైనాలోని ఒక వ్యక్తి చెవిలో భారీ సంఖ్యలో బొద్దింకలు ఉన్నట్టు తెలిసి షాక్ అయ్యాడు. ఎన్నోరోజులుగా అతడి చెవిలోనే బొద్దింకలు జీవిస్తున్నట్టు కుటుంబ సభ్యులు మీడియాకు వివరించారు.