టిక్‌టాక్‌ నిషేధం దిశగా.. భారత్ దారిలోనే అమెరికా?

  • Published By: vamsi ,Published On : July 7, 2020 / 01:12 PM IST
టిక్‌టాక్‌ నిషేధం దిశగా.. భారత్ దారిలోనే అమెరికా?

Updated On : July 7, 2020 / 3:30 PM IST

టిక్‌టాక్‌తో సహా 59 చైనా యాప్‌లను భారత ప్రభుత్వం నిషేధించిన తరువాత, ప్రపంచవ్యాప్తంగా మిగిలిన దేశాలు కూడా చైనాపై చర్యలు ప్రారంభించాయి. టిక్‌టాక్‌తో సహా ఇతర చైనా యాప్‌లపై నిషేధం విధించాలని అమెరికా ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ మేరకు అమెరికా విదేశాంగ కార్యదర్శి మైక్ పాంపీ మంగళవారం ట్వీట్ చేశారు.

గతంలో, టిక్‌టాక్‌తో సహా పలు చైనీస్ యాప్‌లను నిషేధించడం గురించి ఆస్ట్రేలియా కూడా మాట్లాడింది. టిక్‌టాక్‌లో ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది వినియోగదారులు ఉన్నారు. భారతదేశంలోనే టిక్‌టాక్‌లో 200 మిలియన్ల మంది వినియోగదారులు ఉన్నారు. అయితే నిషేధం తర్వాత టిక్‌టాక్‌తో సహా మొత్తం 59 చైనీస్ యాప్‌లు భారతదేశంలో తమ కార్యకలాపాలను మూసివేసాయి. దీనివల్ల ఈ కంపెనీలకు వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతుందని భావిస్తున్నారు.

ఆస్ట్రేలియాలో కూడా టిక్‌టాక్ నిషేధం?
ఆస్ట్రేలియాలో సోషల్ మీడియా యాప్ టిక్‌టాక్‌ను నిషేధించడం గురించి చర్చ జరుగుతోంది. టిక్‌టాక్‌ వంటి చైనా సోషల్ మీడియా యాప్స్ జాతీయ భద్రతకు ముప్పు అని ఆస్ట్రేలియా ప్రభుత్వం అభిప్రాయపడింది. వినియోగదారులు చైనాతో డేటాను పంచుకుంటే ఇబ్బందులు తప్పవని ప్రభుత్వం భావిస్తుంది. టిక్‌టాక్‌కు ఆస్ట్రేలియాలో 1.6 మిలియన్ల వినియోగదారులు ఉన్నారు.

చైనాకు చెందిన బైట్‌డాన్స్ యాజమాన్యంలోని టిక్‌టాక్ ఆస్ట్రేలియా ప్రజల నుంచి డేటాను సేకరిస్తోందని, మొత్తం సమాచారం చైనాలోని సర్వర్‌లో నిల్వ చేయబడుతోందని, ఇది ఆస్ట్రేలియా జాతీయ భద్రతకు పెద్ద ముప్పుగా మారనుందని ఆస్ట్రేలియా అభిప్రాయపడింది.

Read Here>>విదేశీ విద్యార్థులకు అమెరికా బిగ్ షాక్