కారు స్పీడ్‌గా డ్రైవ్ చేసినా అమెరికా నుంచి పంపించేస్తున్న ట్రంప్‌.. భారత స్టూడెంట్స్‌కి వచ్చిన ఈ-మెయిల్స్‌లో ఏముంది?

మిస్సౌరీ, టెక్సాస్, నెబ్రాస్కా సహా పలు రాష్ట్రాల్లోని విశ్వవిద్యాలయాలలో చదువుకుంటున్న భారతీయ విద్యార్థులకు ఈ-మెయిల్స్ అందాయి.

కారు స్పీడ్‌గా డ్రైవ్ చేసినా అమెరికా నుంచి పంపించేస్తున్న ట్రంప్‌.. భారత స్టూడెంట్స్‌కి వచ్చిన ఈ-మెయిల్స్‌లో ఏముంది?

Donald Trump

Updated On : April 8, 2025 / 1:21 PM IST

అమెరికాలోని కాలేజీ ప్రాంగణాల్లో నిరసనల్లో పాల్గొన్న భారతీయ విద్యార్థులు సహా అంతర్జాతీయ స్టూడెంట్ల వీసాలను అమెరికా ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. హమాస్‌కు మద్దతుగా విద్యార్థులు నిరసనల్లో పాల్గొన్నారన్న ఆరోపణలతో ఆ చర్యలు తీసుకుంది. ఇప్పుడు అమెరికా ప్రభుత్వం మరింత ముందుకు వెళ్లింది. చిన్న చిన్న నేరాలకు కూడా దేశం వదిలి వెళ్లిపోవాలంటోంది.

చివరకు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినా విదేశీ విద్యార్థులు దేశం వదిలి వెళ్లిపోవాలని అమెరికా అధికారులు ఆదేశిస్తున్నారు. కొన్ని రోజుల వ్యవధిలోనే అమెరికాలోని పదులకొద్దీ భారతీయ విద్యార్థులు అధికారుల (డీఎస్‌ఓ) నుంచి ఈ-మెయిల్‌లను అందుకున్నారు. ఆయా విద్యార్థుల ఎఫ్-1 స్టూడెంట్ వీసా ఇకపై చెల్లుబాటు కాదని, వెంటనే దేశం విడిచి వెళ్లాలని అందులో ఆదేశించారు.

Also Read: గుడ్‌న్యూస్‌.. తగ్గిన బంగారం ధరలు.. 5 రోజుల నుంచి ఇదే వరస.. ఇప్పుడే కొనేస్తే..

విద్యార్థులు గతంలో పాల్పడిన చిన్న చిన్న నేరాలను సాకుగా చూపారు అధికారులు. రోడ్డుపై వాహనాల్లో వెళ్తున్నప్పుడు నిబంధనలకు విరుద్ధంగా కారును స్పీడ్‌గా డ్రైవ్ చేస్తూ షిఫ్టింగ్‌ లైన్లను దాటారని, డ్రంకెన్ డ్రైవింగ్ చేశారని, దుకాణాల్లో చోరీ చేశారని విద్యార్థులకు అందిన ఈ-మెయిల్స్‌లో ఉంది.

ఎఫ్‌1 వీసా చెల్లదని, ఇక చట్టపరంగా అమెరికాలో ఉండడానికి వీల్లేదని అందులో పేర్కొన్నారు. “మీ సెవిస్‌ రద్దయింది. మీ I-20 ఫామ్‌ కూడా ఇక చెల్లదు. అలాగే, మీ ఎంప్లాయ్‌మెంట్‌ అథరైజేషన్ డాక్యుమెంట్‌ కూడా చెల్లదు. మీరు అమెరికాలో పనిచేసే వీలు కూడాలేదు” అని అందులో పేర్కొన్నారు. “మీ ఇప్పటికీ అమెరికాలో ఉంటే వెంటనే ఈ దేశం నుంచి వెళ్లిపోవడానికి ప్లాన్ చేసుకోండి” అని చెప్పారు.

మిస్సౌరీ, టెక్సాస్, నెబ్రాస్కా సహా పలు రాష్ట్రాల్లోని విశ్వవిద్యాలయాలలో చదువుకుంటున్న భారతీయ విద్యార్థులకు ఈ-మెయిల్స్ అందాయి. డ్రంకెన్ డ్రైవ్, షిఫ్టింగ్ లైన్స్, ఓవర్‌ స్పీడింగ్ వంటి నేరాలకు సెవిస్‌ (స్టూడెంట్ అండ్ ఎక్స్‌చేంజ్‌ విజిటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్‌)ను రద్దు చేయడం చాలా అరుదని టెక్సాస్‌కు చెందిన ఇమ్మిగ్రేషన్ లాయర్‌ చంద్ పరవతనేని అన్నారు. ఆయన ప్రస్తుతం ఇటువంటి 30 కేసులను వాదిస్తున్నారు.