ఓట్లు లెక్కబెడుతూ 272మంది మృతి

ఇండోనేషియాలో ఏప్రిల్ 17వ తేదీన జరిగిన దేశం మొత్తం ఒకే విడతలో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో తొలిసారి 260 మిలియన్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఎన్నికల ఫలితాలు వెల్లడించేందుకు చేసిన ప్రయత్నంలో 270 మందికిపైగా ఎన్నికల సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. కోట్లాది బ్యాలెట్ పేపర్లను చేతులతో గంటల తరబడి లెక్కించడంతో అలసిపోయిన 272మంది సిబ్బంది చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు.
ఎన్నికల ఖర్చును భారీగా తగ్గించే ఉద్దేశంతో అధ్యక్ష, జాతీయ, ప్రాంతీయ పార్లమెంటరీ స్థానాలకు ఒకేసారి ఎన్నికలు జరిపారు. దేశవ్యాప్తంగా మొత్తం 80 శాతం ఓటింగ్ నమోదవగా.. పోలింగ్ ముగిసిన తర్వాత కోట్లాది బ్యాలెట్ పేపర్లను లెక్కించే క్రమంలో ఎన్నికల సిబ్బంది చనిపోయినట్లు ఎలక్షన్ కమీషన్ తెలిపింది. విరామం లేకుండా అత్యధిక పనిగంటలు పనిచేసి అలసిపోవడంతో సిబ్బంది చనిపోయినట్లు చెబుతున్నారు. వీరితోపాటు 1,878 మంది సిబ్బంది అస్వస్థతకు గురైనట్టు చెబుతున్నారు అధికారులు.
అనారోగ్యం పాలైన ఎన్నికల సిబ్బందికి వెంటనే చికిత్స సదుపాయాలు కల్పించాలని అక్కడి హెల్త్ మినిస్టర్ ఆదేశించారు. మృతి చెందిన వారికి పరిహారం ఇచ్చేందుకు ఆర్థిక శాఖ కసరత్తు చేస్తుంది. కాగా మే 22వ తేదీన అధ్యక్ష, పార్లమెంటరీ విజేతలను ప్రకటించనున్నారు.