Muhammad Yunus: ఆ ప్రచారానికి ఎండ్ కార్డ్.. బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా యూనస్‌ కంటిన్యూ..

తాత్కాలిక ప్రభుత్వంలోని సలహాదారులు ఎవరూ ఎక్కడికీ వెళ్లడం లేదు, వారికి అప్పగించిన బాధ్యత చాలా ముఖ్యమైంది, వారు తమ విధిని మధ్యలో వదులుకోలేరు..

Muhammad Yunus: ఆ ప్రచారానికి ఎండ్ కార్డ్.. బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా యూనస్‌ కంటిన్యూ..

Updated On : May 24, 2025 / 9:08 PM IST

Muhammad Yunus: బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్‌ యూనస్‌ తన పదవికి రాజీనామా చేస్తారన్న ప్రచారానికి ఎండ్ కార్డ్ పడింది. బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా మహమ్మద్‌ యూనస్‌ కొనసాగనున్నారు. దీనిపై యూనస్ మంత్రివర్గ సలహాదారు వహీదుద్దీన్ మహమూద్ కీలక ప్రకటన చేశారు.

యూనస్ తన పదవికి రాజీనామా చేస్తారన్న ప్రచారంలో నిజం లేదన్నారాయన. బంగ్లా ప్రభుత్వాధినేతగా యూనస్‌ కొనసాగుతారని ఆయన స్పష్టం చేశారు. ”ఆయన (యూనస్) రాజీనామా చేస్తానని చెప్పలేదు. మాకు అప్పగించిన పని, బాధ్యతలను నిర్వర్తించడంలో మేము అనేక అడ్డంకులను ఎదుర్కొంటున్నప్పటికీ, మేము వాటిని అధిగమిస్తున్నామని ఆయన అన్నారు” అని సలహా మండలి సమావేశం తర్వాత మీడియాతో చెప్పారు వహీదుద్దీన్ మహమూద్. దేశంలో నెలకొంటున్న ఉద్రిక్త పరిస్థితులకు భయపడి యూనస్‌ రాజీనామా చేస్తానని ఎక్కడా చెప్పలేదని వహీదుద్దీన్ అన్నారు.

తాత్కాలిక ప్రభుత్వంలోని సలహాదారులు ఎవరూ ఎక్కడికీ వెళ్లడం లేదు, వారికి అప్పగించిన బాధ్యత చాలా ముఖ్యమైంది, వారు తమ విధిని మధ్యలో వదులుకోలేరని వహీదుద్దీన్ పేర్కొన్నారు. దేశ భద్రత, భవిష్యత్ కోసం ప్రజల డిమాండ్లను తీర్చడానికి ప్రభుత్వానికి అధికారులంతా సహకరించాలని యూనస్‌ చర్చల్లో కోరారని వహీదుద్దీన్ తెలిపారు. 19 మంది సలహాదారులు, మంత్రులు, ఇతర అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు యూనస్. ఈ సమావేశం తర్వాత వహీదుద్దీన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

గత సంవత్సరం బంగ్లాదేశ్‌లో జరిగిన ప్రజా తిరుగుబాటు తర్వాత పదవీ బాధ్యతలు స్వీకరించిన యూనస్, రాజకీయ పార్టీలు తనకు మద్దతు ఇవ్వడంలో విఫలమైతే రాజీనామా చేస్తానని బెదిరించినట్లు సమాచారం.

Also Read: యాపిల్‌నే కాదు శాంసంగ్‌నూ వదలని ట్రంప్.. సీరియస్ వార్నింగ్ ఇచ్చేశాడుగా..

ఇటీవల బంగ్లాదేశ్ లో రాజకీయ సంక్షోభం తీవ్రమైంది. ప్రత్యర్థి పార్టీలు రాజధాని ఢాకా వీధుల్లో నిరసనకు దిగాయి. పోటాపోటీ డిమాండ్లతో హోరెత్తించాయి. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బిఎన్‌పి) మద్దతుదారులు ఢాకాలో కవాతు నిర్వహించారు. కచ్చితమైన ఎన్నికల తేదీ ప్రకటించాని డిమాండ్ చేశారు. జూన్ 2026 నాటికి బంగ్లాదేశ్‌లో ఎన్నికలు జరుగుతాయని యూనస్ హామీ ఇచ్చారు. కానీ బిఎన్‌పి మద్దతుదారులు ఆయన తేదీని నిర్ణయించాలని డిమాండ్ చేస్తున్నారు. డిసెంబర్ నాటికి ఎన్నికలు నిర్వహించాలని ఆర్మీ చీఫ్ జనరల్ వాకర్-ఉజ్-జమాన్ చెప్పడంతో, సైన్యంతో యూనస్ సంబంధం కూడా క్షీణించిందని వార్తలు వస్తున్నాయి.

రాజకీయ సంక్షోభం నేపథ్యంలో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్‌ యూనస్‌ రాజీనామా చేసేందుకు సిద్ధమైనట్టు వార్తలొచ్చాయి. రాజకీయ పార్టీల మధ్య సఖ్యత కుదరకపోవడంతోనే యూనస్‌ తన పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్టు తెలిసింది. కొన్ని రోజులుగా యూనస్‌ ప్రభుత్వం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. యూనస్, ఆర్మీ చీఫ్‌ జనరల్‌ మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి.

షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయాక ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వంలో మొదట్లో మిత్రులుగా ఉన్న వీరిద్దరూ ఇప్పుడు ఎన్నికల నిర్వహణ, సైనిక జోక్యం, యూనస్ తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాల కారణంగా ఇద్దరి మధ్య సఖ్యత లోపించినట్టు తెలిసింది. ఎన్నికల నిర్వహణలో జాప్యంపై యూనస్ సర్కార్‏పై సైన్యం తీవ్ర అసహనంగా ఉంది. ఎన్నికలు నిర్వహించకుండా అమెరికా మద్దతుతో పాలన కంటిన్యూ చేసేందుకు యూనస్ ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆయనపై ఆర్మీ ఆగ్రహంగా ఉంది. అంతేకాకుండా మయన్మార్ రఖైన్ ప్రాజెక్ట్ విషయంలో కూడా యూనస్ ప్రభుత్వానికి, ఆర్మీ జనరల్ కు మధ్య చీలికలు వచ్చాయి.

ఎన్నికల నిర్వహణపై రాజకీయ పార్టీల నుంచి ఏకాభిప్రాయం రాకపోవడం కూడా యూనస్‎కు తలనొప్పిగా మారింది. అటు ఆర్మీ, ఇటు పొలిటికల్ పార్టీల తీరుతో విసిగిపోయిన యూనస్.. తన పదవికి రిజైన్ చేసేందుకు సిద్ధపడ్డట్లు వార్తలొచ్చాయి.