PoK Elections : పాక్ ఆక్రమిత కశ్మీర్ ఎన్నికల్లో ఇమ్రాన్ పార్టీ విజయం
పాక్ ఆక్రమిత కశ్మీర్(PoK)లో ఆదివారం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ పార్టీనే (పీటీఐ) మెజార్టీ స్థానాలు దక్కించుకున్నట్లు తెలుస్తోంది.

Pok
PoK Elections పాక్ ఆక్రమిత కశ్మీర్(PoK)లో ఆదివారం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ పార్టీనే (పీటీఐ) మెజార్టీ స్థానాలు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. పీటీఐ పార్టీ 25 స్థానాల్లో విజయం సాధించినట్లు సమాచారం. పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (PPP) 9 స్థానాలు, పాకిస్థాన్ ముస్లిం లీగ్- నవాజ్ (PML-N) 6 స్థానాలు, ముస్లిం కాన్ఫరెన్స్ (MC), జమ్ము కశ్మీర్ పీపుల్స్ పార్టీ (జేకేపీపీ)లు చెరో స్థానాన్ని దక్కించుకున్నట్లు స్థానిక మీడియా తెలిపింది.
మొత్తం 53 సభ్యుల పీఓకే అసెంబ్లీలో..45మంది మాత్రమే నేరుగా ఎన్నుకుంటారు. మిగతా స్థానాల్లో ఐదు మహిళలకు, మరో మూడు సాంకేతిక నిపుణులుకు రిజర్వ్ చేయబడ్డాయి. 45 స్థానాల్లో.. 33 స్థానాలకు స్థానికులు, 12 స్థానాలకు శరణార్థులు అభ్యర్థులుగా ఉంటారు. ఈ శరణార్థులందరూ కొన్నేళ్ల క్రితం కశ్మీర్ నుంచి పాకిస్తాన్ కి వలసవెళ్లి అక్కడ స్థిరపడిన వారే.
అయితే పాకిస్థాన్‌లో ఏ పార్టీ అధికారంలో ఉంటే అదే పార్టీ పీఓకేలో విజయం సాధిస్తుండటం ఆనవాయితీగా వస్తోంది. తాజాగా పాక్ ఆక్రమిత కశ్మీర్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఇమ్రాన్ ఖాన్ పార్టీ తగిన మెజార్టీని సంపాదించిందని తెలుస్తోంది. పీఓకే ప్రధానిగా సుల్తాన్ మహమ్మద్ చౌదరి ఎన్నికయ్యే అవకాశం ఉంది.
రిగ్గింగ్ జరిగిందన్న విపక్షాలు
మరోవైపు, ఈ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందంటూ ప్రతిపక్షాలు ఆరోపించాయి. అవినీతి, హింస వంటి ఆరోపణల మధ్య ఈ ఎన్నికలు జరిగినట్లు స్థానిక మీడియా పేర్కొంటోంది. అక్కడక్కడ జరిగిన హింసాత్మక ఘటనల్లో పలువురు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. కొట్లి జిల్లా ఛార్హోయ్లో జరిగిన కాల్పుల్లో ఇద్దరు తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ పార్టీ కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారు. అదే ప్రాంతంలో జరిగిన ప్రమాదంలో నలుగురు సైనికులు మృతిచెందగా, మరో ముగ్గురు సైనికులు గాయపడ్డారు. ఝేలం లోయలో జరిగిన మరో ఘటనలో ఐదుగురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు.
పీఓకే ఎన్నికల సందర్భంగా ఓ ప్రతిపక్ష నేత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు న్యాయం జరగకపోతే భారత్ సాయం కోరతాను అంటూ అక్కడి అధికారులను హెచ్చరించారు. పీఎంల్-ఎన్ నేత చౌదరి మహమ్మద్ ఇస్మాయల్ గుజ్జర్ చేసిన ఈ వ్యాఖ్యలతో అక్కడ కాసేపు గందరగోళం నెలకొంది. అయితే ఈ వివాదంపై గుజ్జర్ స్పష్టత ఇచ్చారు. పోలింగ్ కేంద్రాల్లో తమ ఏజెంట్ల తొలగింపునకు గల కారణంపై స్పష్టత కోసమే ఈ వ్యాఖ్యలు చేసినట్లు వివరణ ఇచ్చారు.
వ్యతిరేకించిన భారత్
కాగా, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని గిల్గిత్-బాల్టిస్తాన్‌లో ఎన్నికల నిర్వహణను వ్యతిరేకిస్తున్నట్లు భారత్ ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. ఎన్నికలు జరిపేందుకు చట్ట పరంగా పాకిస్తాన్ కు ఎలాంటి అనుమతులు లేవని పేర్కొంది. గిల్గిట్-బాల్టిస్థాన్‌తో పాటు మొత్తం జమ్ముకశ్మీర్, లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతాలు తమ దేశంలో అంతర్భాగమేనని భారత్ ఇప్పటికే స్పష్టం చేసింది.