Pakistan: భారత్‌తో యుద్ధానికి రెడీ- రెచ్చిపోయిన పాకిస్తాన్ మంత్రి..
పాకిస్తాన్‌కు ప్రతి స్పందించడానికి పూర్తి శక్తి ఉందన్న ఖవాజా... కాబూల్ పాలకులు ఈ యుద్ధాన్ని ఇస్లామాబాద్ వరకు తీసుకొచ్చారని చెప్పారు.
Pakistan: పాకిస్తాన్ తీరు మారలేదు. ఇంకా బుద్ధి కూడా రాలేదు. భారత్ ను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తోంది. భారత్ గురించి అవాకులు చెవాకులు పేలుతోంది. తాజాగా పాక్ డిఫెన్స్ మినిస్టర్ ఖవాజా ఆసిఫ్ రెచ్చిపోయారు. భారత్ తో యుద్ధానికి రెడీ అని ఆయన అన్నారు.
భారత్, అఫ్ఘానిస్థాన్‌లతో ప్రత్యక్ష యుద్ధానికి రెడీగా ఉన్నామని పాక్ డిఫెన్స్ మినిస్టర్ ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్యానించారు. ఇటీవల ఇస్లామాబాద్‌లో జరిగిన ఆత్మాహుతి బాంబు దాడిలో 12 మంది మరణించారు. 36 మంది గాయపడ్డారు. దాడి చేసింది తామేనని టీటీపీ ప్రకటించుకుంది. భారత మద్దతుతోనే ఇస్లామాబాద్ లో దాడి జరిగిందని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆరోపించారు. ఆయన అలా అన్న కొన్ని గంటల తర్వాత ఆ దేశ డిఫెన్స్ మినిస్టర్ నుంచి ఈ ప్రకటన వచ్చింది.
“మేము రెండు వైపులా యుద్ధానికి సిద్ధంగా ఉన్నాము. తూర్పు (భారత్), పశ్చిమ సరిహద్దు (ఆఫ్ఘనిస్తాన్) రెండింటినీ ఎదుర్కోవడానికి మేము రెడీగా ఉన్నాం. మొదటి రౌండ్‌లో అల్లాహ్ మాకు సాయం చేశాడు. రెండో రౌండ్‌లోనూ మాకు సాయం చేస్తాడు” అని ఆసిఫ్ ఒక బహిరంగ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు.
పాకిస్తాన్‌కు ప్రతి స్పందించడానికి పూర్తి శక్తి ఉందన్న ఖవాజా… కాబూల్ పాలకులు ఈ యుద్ధాన్ని ఇస్లామాబాద్ వరకు తీసుకొచ్చారని చెప్పారు. కాగా, శాంతి చర్చలు ఫలితాలను ఇవ్వకపోతే యుద్ధం తప్పదు అంటూ రెండు దేశాలు (పాక్, అఫ్ఘాన్) పదే పదే హెచ్చరించాయి.
Also Read: అలా చేస్తేనే.. బంగ్లాదేశ్‌కు తిరిగి వస్తా- షేక్ హసీనా కీలక షరతు..
