భయంతో వణికిపోతున్న పాక్.. హఫీజ్ సయీద్‌ను రక్షించడానికి ఏం చేస్తోందంటే?
లాహోర్‌లోని మొహల్లా జొహార్‌లో ఉన్న హఫీజ్ ఇంటితో పాటు అతడికి ఉన్న మరిన్ని ఇళ్ల వద్ద కూడా సెక్యూరిటీ ఉంది.

జమ్మూకశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో కోవర్ట్ ఆపరేషన్ జరుగుతుందని భయపడుతున్న పాకిస్థాన్ ప్రభుత్వం, ఐఎస్‌ఐ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. ఉగ్రవాద నేతలను రక్షించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. లష్కరే, జమాత్-దావా చీఫ్ హఫీజ్ సయీద్‌కు పాకిస్థాన్ ప్రభుత్వం, ఐఎస్‌ఐ భద్రతను పెంచాయని తెలుస్తోంది.
పాక్ స్పెషల్ సర్వీస్ గ్రూపునకు చెందిన మాజీ కమాండోలను హఫీజ్ సయీద్ భద్రత కోసం నియమించారు. లాహోర్‌లోని మొహల్లా జొహార్‌లో ఉన్న హఫీజ్ ఇంటితో పాటు అతడికి ఉన్న మరిన్ని ఇళ్ల వద్ద కూడా సెక్యూరిటీ ఉంది.
Also Read: ఏపీలో మోదీ ఏయే కార్యక్రమాల్లో పాల్గొంటారో తెలుసా?
జనాలు ఉండే ప్రాంతంలోనే హఫీజ్ సయీద్‌ను ఉంచారు. అక్కడ పాకిస్థాన్ పౌరుల ఇళ్లు, మసీదు, మదర్సా ఉన్నాయి. పాక్ సర్కారు ఉద్దేశపూర్వకంగా జనాలు ఉండే ప్రాంతంలో అతడిని ఉంచింది. హఫీజ్ సయీద్ లక్ష్యంగా భారత్ దాడి చేయొచ్చని భావిస్తున్న పాక్.. అదే జరిగితే జనాలను రక్షణ కవచాల్లా ఉపయోగించుకోవచ్చని భావిస్తున్నట్లు సమాచారం.
అతడు ఉన్న ప్రాంతంలోని పరిస్థితులను పర్యవేక్షించడానికి పాక్ ప్రభుత్వం నిఘా కూడా పెట్టింది. పాక్ ఆర్మీ మినహా ఇతర డ్రోన్లపై ఆ ప్రాంతంలో నిషేధం విధించినట్లు తెలుస్తోంది. అలాగే, అక్కడికి కిలోమీటరు దూరం మేర సీసీటీవీలతో పరిస్థితులను పర్యవేక్షించడానికి కంట్రోల్ రూమ్‌ను కూడా ఏర్పాటు చేసింది పాక్.
హఫీజ్ సయీదవ్ వయసు 77 ఏళ్లు. 2008 ముంబై దాడుల తర్వాత అమెరికా, భారత్ “వాంటెడ్” లిస్టులో అతడు ఉన్నాడు. పహల్గాం దాడి నేపథ్యంలో అతడిపై ప్రతీకారం తీర్చుకుంటామని లారెన్స్ బిష్ణోయి సిండికేట్ కూడా బుధవారం పేర్కొంది.
ఏప్రిల్ 22న పహల్గాం సమీపంలోని బైసారన్ లోయలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి లష్కరే తోయిబా అనుబంధ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ బాధ్యత వహించింది.
దీంతో హఫీజ్ సయీద్‌పై దాడులు జరగొచ్చని పాకిస్థాన్ భావిస్తోంది. పహల్గాం దాడితో భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. దాడికి బాధ్యులైన వారిని శిక్షించేందుకు భారత్ ప్రణాళికలు వేసుకుంటున్నట్లు పాక్ భావిస్తోంది.