PM Modi: భద్రతా వలయంలో అమరావతి.. ఏపీలో మోదీ ఏయే కార్యక్రమాల్లో పాల్గొంటారో తెలుసా?
రాజధాని అమరావతికి చేరుకుంటారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రానున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. ప్రధాని కార్యక్రమానికి ఏపీ సర్కారు భారీ ఏర్పాట్లు చేసింది. పాక్‌తో ప్రస్తుతం ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో మోదీ అమరావతిలో పర్యటిస్తున్నారు. దీంతో అమరావతి భద్రతా వలయంలో ఉంది.
మోదీ పర్యటన షెడ్యూల్ ఇలా..
- మే2 మధ్యాహ్నం 2.55 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకోనున్న ప్రధాని మోదీ
- గన్నవరం ఎయిర్ పోర్ట్ లో ప్రధాని మోదీకి స్వాగతం పలకనున్న మంత్రులు, కూటమి నేతలు
- గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి హెలికాఫ్టర్ ద్వారా మధ్యాహ్నం 3.15 గంటలకు వెలగపూడి సచివాలయం వద్ద ఉన్న హెలిప్యాడ్ కు చేరుకోనున్న పీఎం
- హెలిపాడ్ వద్ద ప్రధాని మోదీకి స్వాగతం పలకనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్
- మధ్యాహ్నం 3.30 గంటలకు సభాస్థలికి చేరుకుని అమరావతి పున:ప్రారంభ కార్యక్రమంలో పాల్గొననున్న ప్రధాని మోదీ
- రాజధాని అమరావతిలో పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలతో పాటు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో కేంద్రం చేపట్టిన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్న ప్రధాని నరేంద్ర మోదీ
- 1.15 నిమిషాల పాటు సభలో పాల్గొననున్న ప్రధాని మోదీ
- కార్యక్రమం అనంతరం సాయంత్రం 4.55 గంటలకు తిరిగి హెలికాఫ్టర్ ద్వారా గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుని… అక్కడి నుంచి విమానం ద్వారా ఢిల్లీకి వెళ్లనున్న ప్రధాని మోదీ
ఉద్యోగులంతా ప్రధాని సభకు హాజరుకావాలి: సీఎస్
వెలగపూడి లోని సచివాలయ ఉద్యోగులంతా ప్రధానమంత్రి సభకు హాజరుకావాలని ఏపీ సీఎస్ విజయానందర్ ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు సచివాలయ ఉద్యోగులకు సర్క్యులర్ జారీ చేశారు. అమరావతి రాజధాని పనుల పునః ప్రారంభోత్సవానికి ప్రధాని హాజరవుతున్న సభకు రావాల్సిందిగా సూచనలు చేశారు.
భద్రతా ఏర్పాట్లు ఇలా..
మోదీ పర్యటనపై మంత్రి నారాయణ మాట్లాడారు. భద్రత రీత్యా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హెలీకాప్టర్ దిగిన వెంటనే క్లోజ్డ్ వెహికల్ లో సభకు వస్తారని తెలిపారు. మోదీ వాహనం వెళ్లే దారికి ఇరువైపులా ప్రజలు నిలబడి స్వాగతం పలకుతారని అన్నారు. పాక్‌తో యుద్ధ మేఘాలు అలుముకున్న నేపథ్యంలో ప్రధానికి భద్రతా ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టినట్లు చెప్పారు. రేపు కూడా వర్షం పడే పరిస్థితులు ఉన్నందున ప్లాన్ బీతోనూ రెడీగా ఉన్నామని తెలిపారు. వర్షం కురిస్తే వాహనాల పార్కింగ్‌కు ఇబ్బంది కలగకుండా రోడ్లమీద వాహనాలు నిలుపుకునే ప్లాన్ చేశామని అన్నారు.