Pakistan Supreme Court : మిస్టర్ పీఎం..హంతకులతో చర్చలా ?

మిస్టర్‌ పీఎం.. హంతకులతో చర్చలా అంటూ నిలదీసింది. 2014లో పెషావర్‌ ఆర్మీ స్కూల్‌లో జరిగిన మారణకాండపై ఇమ్రాన్‌ఖాన్‌ను కడిగి పారేసింది.

Pakistan Supreme Court : మిస్టర్ పీఎం..హంతకులతో చర్చలా ?

Pak Pm

Updated On : November 11, 2021 / 7:09 AM IST

Pakistan Imran Khan : పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ను సుప్రీంకోర్టు ఏకిపారేసింది. మిస్టర్‌ పీఎం.. హంతకులతో చర్చలా అంటూ నిలదీసింది. 2014లో పెషావర్‌ ఆర్మీ స్కూల్‌లో జరిగిన మారణకాండపై ఇమ్రాన్‌ఖాన్‌ను కడిగి పారేసింది. ఇప్పటిదాకా టెర్రరిస్టుల్ని ఎందుకు పట్టుకోలేకపోయారంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. పెషావర్‌లోని ఆర్మీ స్కూల్‌లో 2014లో మారణహోమం జరిగింది. తెహ్రీక్-ఏ-తాలిబన్ పాకిస్థాన్‌ ముష్కరులు మారణాయుధాలతో విద్యార్థులపై విరుచుకుపడ్డారు. ఆరుగురు టెర్రరిస్టులు స్కూల్లోకి చొరబడి విచ్చలవిడిగా కాల్పులు జరిపారు. ఈ మారణకాండలో 147మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 132 మంది చిన్నారులే. ఈ దాడితో యావత్‌ ప్రపంచం నివ్వెరపోయింది.

Read More : Telangana : త్వరలో తెలంగాణ కేబినెట్ మీటింగ్, 70 వేల ఉద్యోగాల నోటిఫికేషన్లు!

147మందిని హత్య చేసి ఏడేళ్లు దాటుతున్నా… ఈ కేసు దర్యాప్తులో అతీగతీ లేదు. అసలు దాడి చేసింది ఎవరో కూడా పాక్‌ ప్రభుత్వం కనిపెట్టలేకపోయింది. దీంతో బాధిత కుటుంబాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి.. ప్రధానమంత్రే స్వయంగా కోర్టుకు వచ్చి సమాధానమివ్వాలని సమన్లు జారీ చేశారు. దీంతో కొన్ని గంటల్లోనే ఇమ్రాన్‌ఖాన్‌ కోర్టుకు హాజరయ్యారు. అప్పటి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన చిన్నారుల కుటుంబాలకు ఇప్పటికే పరిహారం అందించామని.. అప్పటి మారణకాండ తర్వాత నేషనల్‌ యాక్షన్‌ ప్లాన్‌ను కూడా తీసుకువచ్చామని కోర్టుకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.

Read More : SCCL : బొగ్గు గనిలో విషాదం…కార్మికుల ఆందోళన, ఒకరికి ఉద్యోగం ఇస్తాం

దీనిపై స్పందించిన చీఫ్‌ జస్టిస్‌.. బాధిత తల్లిదండ్రులు ప్రభుత్వం నుంచి కోరుకుంటోంది పరిహారం కాదన్నారు. భద్రతా వ్యవస్థ గురించి తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారని గుర్తు చేశారు. 147మందిని చంపేసిన ఉగ్రమూకలతో ఎందుకు సంప్రదింపులు జరుపుతున్నారని ప్రధానమంత్రిని నిలదీశారు. దారుణ ఘటన జరిగి ఏడేళ్లు గడుస్తున్నా పురోగతి శూన్యమని ఆవేదన వ్యక్తం చేశారు. పెషావర్‌ దారుణ ఘటనలో అలసత్వానికి కారణమైన మిలటరీ అధికారులపై కనీసం ఎఫ్‌ఐఆర్‌ కూడా నమోదు చేయలేదని సుప్రీంకోర్టు మండిపడింది. నిఘా వ్యవస్థల కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నప్పటికీ.. ఫలితం శూన్యమని ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రభుత్వంపై చీఫ్‌ జస్టిస్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.