డేంజర్ గేమ్ : పబ్‌జి ఆడుతూ హంతకుడయ్యాడు

జపాన్ : పబ్‌జి.. ఇతర మొబైల్ గేమ్స్‌లానే ఇది కూడా ఓ ఆన్‌లైన్ గేమ్‌గా స్టార్ట్ అయ్యింది. కానీ క్రమంగా చాలా డేంజర్‌గా మారుతోంది. మ్యాటర్ ప్రాణాలు తీసే వరకు వెళుతోంది. ఈ గేమ్ ఆడుతూ కొందరు పిచ్చోళ్లు అయిపోతే మరికొందరు ఏకంగా హంతకులుగా మారుతున్నారు. పిల్లలు, యువత పబ్‌జి గేమ్‌కు బాగా అడిక్ట్ అవుతున్నారు. ఈ గేమ్‌లో ఎంతగా మునిగిపోతున్నారంటే.. మర్డర్లు చేయడానికి కూడా వెనుకాడటం లేదు.
జపాన్‌లో దారుణం చోటు చేసుకుంది. పబ్‌జి గేమ్‌కు బానిసగా మారిన ఓ వ్యక్తి తన స్నేహితుడిని హత్య చేశాడు. గేమ్‌లో 6ఎక్స్ స్కోప్ ఇవ్వలేదనే కోపంతో అతడి ప్రాణాలు తీశాడు. ప్రస్తుతం అతడు కటకటాల్లో ఉన్నాడు. మర్డర్ చేసిన నేరంలో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ఓ గేమ్ కోసం హంతకుడిగా మారిన వైనం అందరిని షాక్‌కు గురి చేసింది. సోషల్ మీడియాలో పబ్‌జి గేమ్ మరోసారి హాట్ టాపిక్‌గా మారింది.
పబ్‌జి మొబైల్ గేమ్ ఇతర గేమ్స్‌లా కాదు. అందులో మునిగిపోయారంటే గంటల తరబడి గేమ్ ఆడతారు. ఇక గేమ్ ఫినిష్ చేయకపోతే ఏదో కోల్పోయామన్న భావన ప్లేయర్లలో కలుగుతుంది. దీంతో గేమ్‌కు చాలా మంది అడిక్ట్ అయిపోయారు. ఇలా ఈ గేమ్‌కు అడిక్ట్ అయిన ఓ వ్యక్తి మతి స్థిమితం కోల్పోయి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఘటన ఇటీవలే జమ్మూకాశ్మీర్‌లో వెలుగులోకి వచ్చింది. కాశ్మీర్‌కు చెందిన ఓ ఫిట్‌నెస్ ట్రైనర్ 10 రోజులుగా పబ్‌జి మొబైల్ గేమ్ ఆడుతూ పిచ్చోడయ్యాడు. గేమ్ ప్రభావంతో తనను తానే గాయ పరుచుకుంటూ, చిత్రహింసలు పెట్టుకోవడం ప్రారంభించాడు. అతడిని చూసిన చుట్టుపక్కల వాళ్లు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ వ్యక్తి హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు.
ఏ గేమ్ అయినా దానికి వ్యసనపరులుగా మారితే గేమింగ్ డిజార్డర్ వ్యాధి వస్తుందని, అలాంటి స్థితికి చేరుకున్న వారు పిచ్చోళ్లుగా, హంతకులుగా మారతారని సైకియాట్రిస్టులు అంటున్నారు. నిత్యం అరగంట లేదా గంట సేపు కంప్యూటర్ లేదా మొబైల్ గేమ్స్ ఆడితే పర్లేదు, కానీ అది శృతి మించితే ఇలాంటి అనర్థాలే సంభవిస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పబ్‌జి మొబైల్ గేమ్ వల్ల పిల్లలు, యువతలో హింసాత్మక ప్రవృత్తి పెరుగుతోంది. ఇది ఆందోళన కలిగించే విషయం. మానసిక ప్రవర్తనలో మార్పులు తెస్తన్న గేమ్‌ను బ్యాన్ చేయాలనే డిమాండ్లు పెరుగతున్నాయి.