Russia-Ukraine Crisis : ఏ క్షణంలోనైనా దాడి? యుక్రెయిన్‌లో రాయబార కార్యాలయాన్ని ఖాళీ చేయిస్తున్న రష్యా

యుక్రెయిన్ లో తమ రాయబార కార్యాలయాన్ని ఖాళీ చేయించే పనిలో రష్యా నిమగ్నమైంది. యుక్రెయిన్‌లోని తన దౌత్య కేంద్రం నుండి తమ దేశ సిబ్బందిని ఖాళీ చేయించడం రష్యా ప్రారంభించిందని..

Russia-Ukraine Crisis : ఏ క్షణంలోనైనా దాడి? యుక్రెయిన్‌లో రాయబార కార్యాలయాన్ని ఖాళీ చేయిస్తున్న రష్యా

Russia

Updated On : February 23, 2022 / 10:48 PM IST

Russia-Ukraine Crisis : రష్యా-యుక్రెయిన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచ దేశాల్లో ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. యుక్రెయిన్ సరిహద్దుల్లోకి రష్యా తన బలగాలు తరలించడం ఉద్రిక్తతలను మరింత పెంచింది. కాగా, రష్యాకు వ్యతిరేకంగా, యుక్రెయిన్‌కు మద్దతుగా కొన్ని దేశాలు అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే అమెరికా, బ్రిటన్ లు రష్యాకు వ్యతిరేకంగా ముందుకు సాగుతూ ఆంక్షలు విధిస్తున్నాయి. అయినప్పటికి పుతిన్ తగ్గేదేలే అంటున్నారు. తాజాగా మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.

యుక్రెయిన్ లో తమ రాయబార కార్యాలయాన్ని ఖాళీ చేయించే పనిలో రష్యా నిమగ్నమైంది. యుక్రెయిన్‌లోని తన దౌత్య కేంద్రం నుండి తమ దేశ సిబ్బందిని ఖాళీ చేయించడం రష్యా ప్రారంభించిందని రష్యా ప్రభుత్వ వార్తా సంస్థ టాస్ నివేదించింది. యుక్రెయిన్‌లోని కైవ్‌లో రష్యా తన రాయబార కార్యాలయం, ఎల్వివ్‌లలో కాన్సులేట్‌ కలిగుంది. కైవ్‌లోని రాయబార కార్యాలయం నుంచి సిబ్బంది తరలింపు ప్రారంభమైనట్లు టాస్ నివేదిక పేర్కొంది.

Russia-Ukraine War : రష్యా-యుక్రెయిన్ మధ్య యుద్ధం వస్తే.. భారత్‌లో ఏయే వస్తువుల ధరలు పెరగొచ్చుంటే?

మరోవైపు కీవ్ లోని రష్యా రాయబార కార్యాలయాన్ని యుక్రెయిన్ పోలీసులు చుట్టుముట్టారు. రాయబార కార్యాలయంపై రష్యా జాతీయ జెండాను ఎగురవేయలేదు. ప్రస్తుతం అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. యుక్రెయిన్ పై రష్యా ఏ క్షణంలోనైనా పూర్తి స్థాయిలో దాడి చేసే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి.

రష్యా ఇన్నాళ్లుగా తాను పరోక్షంగా మద్దతిస్తూ వస్తున్న యుక్రెయిన్‌లోని డొనెట్‌స్క్, లుహాన్‌స్క్‌ వేర్పాటువాద ప్రాంతాలను నేరుగా తన అధీనంలోకి తీసుకుంది. రష్యా అనుకూల రెబెల్స్‌ అధీనంలో ఉన్న ఆ ప్రాంతాలకు స్వతంత్ర హోదా ఇస్తున్నట్టు అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ సోమవారం అర్ధరాత్రి ప్రకటించారు. ఈ మేరకు డిక్రీ జారీ చేశారు. యుక్రెయిన్‌ అధీనంలోని రెబెల్స్‌ ప్రాంతాలకు కూడా తమ ప్రకటన వర్తిస్తుందని తెలిపారు. అక్కడికి సైన్యాన్ని పంపేందుకు వీలు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రష్యా వెలుపల సైన్యాన్ని వాడేందుకు అనుమతించాల్సిందిగా కోరుతూ పార్లమెంటుకు లేఖ రాశారు. ఆ వెంటనే రష్యా సైన్యం శరవేగంగా కదిలింది.

Russia : యుక్రెయిన్‌పై పంజా విసురుతున్న రష్యా.. ఆర్థిక ఆంక్షలను పట్టించుకోని పుతిన్

డోన్బాస్‌గా పిలిచే ఆ రెండు ప్రాంతాల్లోకి ‘శాంతి పరిరక్షణ’ పేరిట భారీ సంఖ్యలో చొచ్చుకెళ్లి వాటిని తన అధీనంలోకి తీసుకుంది. అక్కడి నుంచి ఉక్రెయిన్‌ దిశగా ముందుకు కదులుతోంది. యుక్రెయిన్‌కు మూడు దిక్కుల్లో ఇప్పటికే రెండు లక్షల దాకా సైన్యం మోహరించి ఉండగా, బెలారుస్‌లో 30 వేలకు పైగా రష్యా దళాలు సంయుక్త విన్యాసాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇది యుక్రెయిన్‌ సార్వభౌమాధికారంపై దాడేనని యుక్రెయిన్, అమెరికా, పశ్చిమ దేశాలు దుయ్యబట్టాయి. 2015 నాటి మిన్‌స్క్‌ శాంతి ఒప్పందాన్ని రష్యా తుంగలో తొక్కిందని మండిపడ్డాయి. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని యుక్రెయిన్‌ అధ్యక్షుడు వొలోదిమిర్‌ ప్రకటించారు. ‘దేనికీ భయపడబోం. మా భూభాగంలో అంగుళం కూడా వదులుకోం’ అన్నారు.