Russia Ukraine War : పుతిన్ మరో సంచలనం.. అణ్వాయుధ బలగాలను సన్నద్ధం చేయాలని ఆదేశం
యుక్రెయిన్ పై సైనిక చర్య నేపథ్యంలో, నాటో దేశాలు ప్రతీకార చర్యలకు దిగే అవకాశం ఉందని పుతిన్ అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో వాటి నుంచి ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొనేందుకు అణ్వాయుధ..

Putin
Russia Ukraine War : ప్రపంచ దేశాలు హెచ్చరిస్తున్నా లెక్క చేయకుండా యుక్రెయిన్‌పై యుద్ధానికి దిగిన రష్యా అధ్యక్షుడు పుతిన్.. మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అణ్వాయుధ బలగాలను సన్నద్ధం చేయాలని ఆర్మీ చీఫ్‌లను ఆదేశించారు పుతిన్. యుక్రెయిన్‌పై దాడి నేపథ్యంలో పశ్చిమ దేశాలు, నాటో దళాలు రష్యాకు వ్యతిరేకంగా చర్యలు చేపడుతున్నాయి. మరోవైపు స్విఫ్ట్ నుంచి రష్యాను తొలగించడం, ఆర్థిక ఆంక్షల కఠినతరం, రష్యా విమానాలకు గగనతల నిషేధం.. ఈ క్రమంలో పుతిన్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.
యుక్రెయిన్ పై సైనిక చర్య నేపథ్యంలో, నాటో దేశాలు ప్రతీకార చర్యలకు దిగే అవకాశం ఉందని పుతిన్ అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో వాటి నుంచి ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొనేందుకు అణ్వాయుధ బలగాలను అప్రమత్తంగా ఉంచాలని సైనిక చీఫ్‌లను పుతిన్ ఆదేశించినట్టు తెలుస్తోంది.
Russia Ukraine war: సైనికుల ప్రాణాలు గాల్లో వదిలేసిన రష్యా, మెడికల్ ఎమర్జెన్సీ విధింపు
పశ్చిమ దేశాలు మనతో సఖ్యతగా లేకపోగా చట్ట విరుద్ధమైన ఆర్థిక ఆంక్షలు విధించడాన్ని మనం చూస్తున్నామని ఆర్మీ చీఫ్ లతో పుతిన్ అన్నారు. అలాగే నాటో దేశాల సీనియర్ అధికారులు కూడా రష్యాకు వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తున్నారని చెప్పారు. ఈ పరిణామాల నేపథ్యంలో ‘ అణ్వాయుధ దళాలను ప్రత్యేక పోరాటానికి సిద్ధంగా ఉంచాలని రక్షణ మంత్రి, రష్యన్ సాయుధ దళాల జనరల్ స్టాఫ్ చీఫ్‌ను ఆదేశిస్తున్నా’ అని పుతిన్ చెప్పారు.
Russia Ukraine War : తగ్గేదే లే…అంటున్న యుక్రెయిన్ ప్రజలు
యుక్రెయిన్‌పై రష్యా దండయాత్ర నేపథ్యంలో ఇప్పటికే అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు పెరిగాయి. తాజాగా అణ్వాయుధ దళాలను హై అలెర్ట్‌గా ఉంచాలని ఆర్మీ చీఫ్‌లను పుతిన్ ఆదేశించడం మరింత ఆందోళన పెంచింది. ప్రపంచంలో అమెరికా తర్వాత భారీగా అణ్వాయుధాలు, బాలిస్టిక్ క్షిపణులు కలిగి ఉన్న దేశం రష్యా. ఇప్పుడీ అంశం కూడా ప్రపంచదేశాలను ఆందోళనకు గురి చేస్తోంది. యుక్రెయిన్‌పై రష్యా దాడి.. అణ్వాయుధాల వినియోగానికి దారితీస్తుందనే ప్రపంచ దేశాల ఆందోళనలను పుతిన్ ప్రకటన మరింత పెంచినట్లైంది.
అయితే, పుతిన్ ఆదేశాలు ఆమోదయోగ్యం కాదని యూఎన్ఓ అమెరికా రాయబారి లిండా థామస్ గ్రీన్‌ఫీల్డ్ స్పష్టం చేశారు. అణ్వాయుద దళాలను అప్రమత్తం చేయాలంటూ పుతిన్ చేసిన వ్యాఖ్యలను నాటో తప్పుబట్టింది. అలాంటి వ్యాఖ్యలు ప్రమాదకరమని, బాధ్యతారాహిత్యంతో కూడుకున్నవని నాటో కూటమి సెక్రటరీ జనరల్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ అన్నారు.
యుక్రెయిన్, రష్యా మధ్య భీకర పోరు నడుస్తోంది. నాలుగో రోజూ (ఫిబ్రవరి 27) యుక్రెయిన్‌పై బాంబులు, మిస్సైళ్లతో రష్యా బలగాలు విరుచుకుపడుతున్నాయి. రాజధాని నగరం కీవ్‌లోకి ప్రవేశించేందుకు రష్యా సైన్యం యత్నిస్తోంది. యుక్రెయిన్ గ్యాస్, చమురు నిక్షేపాలు టార్గెట్ గా రష్యా సేనలు దాడులు చేస్తున్నాయి. కార్కివ్‌లోని గ్యాస్ పైప్‌లైన్‌ను రష్యా బలగాలు పేల్చేశాయి. కాగా, యుక్రెయిన్ సైనికులు తగ్గేదేలే అన‍్నట్టుగా తమ పోరాట పటిమను చూపిస్తున్నారు. శక్తివంచన లేకుండా రష్యా దళాలను తిప్పికొడుతున్నారు.