Russia Ukraine War : తగ్గేదే లే…అంటున్న యుక్రెయిన్ ప్రజలు

ఎన్ని బాంబులు వేసినా.. ఎన్ని మిస్సైళ్లు దూసుకువచ్చినా తగ్గేదే లేదంటున్నారు యుక్రెయిన్ ప్రజలు. ఓ వైపు రష్యా యుక్రెయిన్‌పై బాంబుల వర్షం కురిపిస్తోంది.

Russia Ukraine War : తగ్గేదే లే…అంటున్న యుక్రెయిన్ ప్రజలు

Ukraine war

Russia Ukraine War :  ఎన్ని బాంబులు వేసినా.. ఎన్ని మిస్సైళ్లు దూసుకువచ్చినా తగ్గేదే లేదంటున్నారు యుక్రెయిన్ ప్రజలు. ఓ వైపు రష్యా యుక్రెయిన్‌పై బాంబుల వర్షం కురిపిస్తోంది. ఎవరు అడ్డొచ్చినా తూటాల వర్షం కురిపిస్తున్నారు రష్యా బలగాలు. దీంతో తమ దేశాన్ని రక్షించుకునేందుకు ఏకంగా పౌరులే రంగంలోకి దిగారు. రష్యాతో యుద్ధంలో మేము సైతం అంటున్నారు యుక్రెయిన్‌ దేశస్తులు. ఏకంగా రష్యన్ బలగాల ట్యాంకులకు ఎదురొడ్డి నిలుస్తున్నారు.

తాజాగా యుక్రెయిన్‌ భూభాగంలోకి రోడ్డుపై వెళ్తున్న యుద్ధ ట్యాంకర్లకు ఓ వ్యక్తి చుక్కలు చూపించాడు. తమ దేశ భూభాగంలోకి ఎందుకు వస్తున్నారంటూ ప్రశ్నించాడు. పదే పదే యుద్ధ ట్యాంకర్లకు అడ్డు తగిలాడు. అంతటితో ఆగకుండా తనకు ఎదురుగా వస్తోన్న యుద్ధట్యాంకర్‌ పైకే ఎక్కేశాడు యుక్రెయిన్‌ దేశస్తుడు. అయినప్పటికీ రష్యా బలగాలు యుద్ధ ట్యాంకర్‌ను ముందుకు కదిలించాయి. దీంతో యుద్ధ ట్యాంకర్‌ పైనుంచి దిగిన ఆ వ్యక్తి… దాని ముందే నిరసన వ్యక్తం చేశాడు. ఆ తర్వాత కొంతమంది స్థానికులు సదరు వ్యక్తిని పక్కకు తీసుకెళ్లడంతో రష్యన్ బలగాలు ముందుకు కదిలాయి.

దేశం కోసం పోరాడేందుకు ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలన్న జెలెన్‌స్కీ ఇచ్చిన పిలుపు మేరకు యుక్రెయిన్ ప్రజలు కదన రంగంలోకి దిగుతున్నారు. వీధుల్లో దొరికిన తుపాకీని పట్టుకొని రష్యన్‌ ఆర్మీ పైకి దండెత్తుతున్నారు. ఒక్కొక్కరు ఒక్కో సైనికుడిలా మారుతున్నారు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకూ.. అందరిలోనూ దేశ భక్తి భావోద్వేగమే కనిపిస్తోంది. అందుకే ఆయుధాలు పట్టి తమ దేశం వైపు దూసుకొస్తున్న రష్యన్‌ ఆర్మీపైకి దూకుతున్నారు. మరికొంతమంది రష్యన్‌ బలగాల ముందు నిరసన ప్రదర్శనలు చేపడుతున్నారు.

యుక్రెయిన్‌ రాజధాని కీవ్‌పై దాడి చేసేందుకు రష్యన్‌ బలగాలు పదుల సంఖ్యలో రోడ్డుపై వెళ్తున్నాయి. ఈ క్రమంలో ఓ యుక్రెయిన్ దేశస్తుడు ట్యాంకులను అడ్డుకునే ప్రయత్నం చేశాడు. అది కూడా ఒంటరిగానే. ఆ వాహనాలపై పిడిగుద్దులు గుద్దాడు. అతడి ధైర్యానికి అందరూ హ్యాట్సాఫ్ అంటున్నారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అసలైన మగధీరుడు నువ్వే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరోవైపు రష్యా బలగాలకు చెక్‌ పెట్టేందుకు యుక్రెయిన్‌ సైనికులే కాకుండా… ఆ దేశ పౌరులు కూడా తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఓవైపు యుక్రెయిన్ సైనికులు తుపాకులు, ఆయుధాలతో పోరాటం చేస్తుంటే… పౌరులు శత్రుసేనలను అడ్డుకునేందుకు.. మోలటోవ్ మాక్‌టెయిల్‌ ప్రయోగిస్తున్నారు. శత్రువు మన వాకిట్లోకి వచ్చాడు.. జాగ్రత్త అంటూ యుక్రెయిన్‌ రక్షణశాఖ ప్రకటించింది.

రష్యా సైనికులకు బుద్ధి చెప్పేందుకు.. మోలటోవ్ మాక్‌టెయిల్‌ వాడాలని సూచించింది. దీంతో.. యుక్రెయిన్ పౌరులు వాటిని సిద్ధం చేసుకున్నారు. మోలటోవ్‌ మాక్‌టెయిల్‌ అంటే.. హోమ్ మేడ్ పెట్రోల్ బాంబ్ లాంటిది. ఇళ్లలో దాచిన పాత సీసాలను బయటకు తీసి.. పెట్రో బాంబులను సిద్ధం చేసుకున్నారు. రష్యన్ యుద్ధ ట్యాంకులు కనిపిస్తే.. వాటిపై వేస్తున్నారు.
Also Read : Like 9/11 Attack: రష్యా దాడులను 9/11 ఉగ్ర దాడితో పోల్చిన యుక్రెయిన్!

మాక్‌టెయిల్‌ను ఎలా తయారు చేయాలన్న వీడియోలు కూడా యుక్రెయిన్‌ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయ్. క్యాన్ల నిండా పెట్రోల్‌ తీసుకొచ్చి.. ఎవరికి వారు వందలాది బాటిళ్లల్లో వీటిని రెడీ చేసి పెట్టుకుంటున్నారు. రష్యా యుద్ధ ట్యాంకో, సైనిక వాహనమో కనపడితే చాలు.. నిప్పంటించి వాటిపైకి విసురుతున్నారు. రష్యా దండయాత్ర.. కీవ్‌ సిటీ సరిహద్దుల వరకు ఒకలా.. నగరం లోపల మరోలా అన్నట్లుగా తయారైంది.