అంగారక గ్రహంపై ఉప్పు నీటి సరస్సులు

300 కోట్ల సంవత్సరాల క్రితం అంగారక గ్రహంపై ఉప్పు నీటి సరస్సులు ఉండేవని ఓ అధ్యయనంలో వెల్లడైంది. మార్స్ గ్రహంపై ఉన్న వాతావరణం కారణంగా అని ఎండిపోయాయని తేలింది. అమెరికాలోని టెక్సాస్ ఏ అండ్ ఎం యూనివర్సిటీ పరిశోధకుల అధ్యయనం ప్రకారం 300 కోట్ల సంవత్సరాల క్రితం మార్స్ పై ఉన్న గేల్ క్రేటర్ ప్రాంతంలోని సరస్సు ఏర్పడినట్లు తెలిపారు. 95 మైళ్ల వెడల్సు గల రాతి పరివాహకంగా ఇది ఏర్పడిందన్నారు. 2012 నుంచి నాసా పంపిన క్యూరియాసిటీ రోవర్ తో అన్వేషణ జరుగుతోందని వివరించారు.
గతంలో నాసా రోవర్ చిత్రించిన ఫోటోల్లో కూడా అంగారకుడిపై నీటి జాడ కనిపించింది. అంగారకుడిపై వాతావరణం చల్లగా ఉండడంతో.. నీటి ఉపరితలం ఘనీభవించింది. ఆ మంచు పొరల కింద నీరు ద్రవ రూపంలో ఉంది.
ఇంతకముందు అంగారక గ్రహంపై ఓ నీటి సరస్సును పరిశోధకులు గుర్తించారు. అంగారకుడి దక్షిణ ధృవంలోని మంచు పొరల కింద, ఈ సరస్సు ఉంది. ఇది 20కి.మీ. మేర విస్తరించినట్లు భావిస్తున్నారు. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ(ఈఎస్ఏ)కి చెందిన మార్స్ ఎక్స్‌ప్రెస్ ఆర్బిటర్ ఈ నీటి జాడను కనుగొంది.
గతంలో జరిగిన పరిశోధనలు అంగారకుడిపై కొన్ని ‘తడి ప్రాంతాల’ను గుర్తించాయి. కానీ ద్రవరూపంలో, నీరు ఓ సరస్సులా ఏర్పడిన ప్రాంతాన్ని కనుగొనడం ఇదే ప్రథమం.