Saudi Arabia : ఐపీఎల్ పై సౌదీ క‌న్ను..! 30 బిలియన్ డాలర్ల పెట్టుబడులు..?

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. 2008లో ప్రారంభ‌మైన ఈ లీగ్ విజ‌య‌వంతంగా 16 సీజ‌న్లు పూర్తి చేసుకుంది.

Saudi Arabia : ఐపీఎల్ పై సౌదీ క‌న్ను..! 30 బిలియన్ డాలర్ల పెట్టుబడులు..?

Saudi Arabia eye on IPL

Updated On : November 3, 2023 / 6:55 PM IST

Saudi Arabia-IPL : ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. 2008లో ప్రారంభ‌మైన ఈ లీగ్ విజ‌య‌వంతంగా 16 సీజ‌న్లు పూర్తి చేసుకుంది. ప్ర‌పంచంలోనే అత్య‌ధిక ధ‌నిక లీగుల్లో ఒక‌టిగా నిలిచింది. ఏటా వేల కోట్ల రూపాయ‌లు ఐపీఎల్ ద్వారా భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఆర్జిస్తోంది. స్పాన్స‌ర్ షిప్స్‌, మీడియా హ‌క్కులు త‌దిత‌రాల ద్వారా బీసీసీఐకి ఆదాయం వ‌స్తుంది. ఇక క్రికెట్ ఆడే ప్ర‌తి ఒక్కరు ఒక్క‌సారైనా ఐపీఎల్‌లో ఆడితే చాలు అని అనుకుంటారు అన‌డంలో అతి శ‌యోక్తి లేదు. ఒక్క సారి ఐపీఎల్‌లో స‌త్తా చాటితే కోట్ల రూపాయ‌ల‌ను సంపాద‌న వ‌స్తుండ‌డమే అందుకు కార‌ణం.

ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ లీగ్ అయిన ఐపీఎల్ పై సౌదీ అరేబియా క‌న్నేసింది. మ‌ల్టీ బిలియన్ డాలర్లను పెట్టుబ‌డిగా పెట్టి వాటాను కొనుగోలు చేసేందుకు సిధ్ధంగా ఉన్న‌ట్లు బ్లూమ్‌బెర్గ్ న్యూస్ శుక్రవారం వెల్లడించింది. ఫుట్‌బాల్, గోల్ఫ్‌తో పాటు చాలా లీగుల్లో వాటాలు ద‌క్కించుకున్న సౌదీ తాజాగా క్రికెట్‌లోనూ పాగా వేయాల‌ని ప్ర‌ణాళిక‌లు ర‌చించింది. ఇప్ప‌టికే ఈ విష‌య‌మై సౌదీ అరేబియా ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ సలహాదారులు భార‌త ప్ర‌భుత్వ అధికారులతో చ‌ర్చించార‌ట‌.

ఐపీఎల్‌ను దాదాపు 30 బిలియన్ డాలర్ల విలువైన హోల్డింగ్ కంపెనీగా మార్చ‌డం గురించి చ‌ర్చించార‌ని నివేదిక తెలిపింది. సెప్టెంబరులో యువరాజు భారతదేశాన్ని సందర్శించినప్పుడు ఈ చర్చలు జరిగిన‌ట్లు వెల్ల‌డించారు. ఐపీఎల్ లీగ్‌లో 5 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టాలని, ఆ త‌రువాత క్ర‌మంగా దాన్ని ఇత‌ర దేశాల‌కు విస్త‌రించే ప్ర‌తిపాద‌న పై కూడా చ‌ర్చ‌లు జ‌రిగాయ‌ని, బీసీసీఐ అనుమ‌తి కోసం వెయిట్ చేస్తున్న‌ట్లుగా నివేదిక పేర్కొంది.

ఇదిలా ఉంటే.. గ‌త సంవ‌త్స‌రం ఐపీఎల్ ప్రసార హ‌క్కులు 6.2 బిలియ‌న్ డాల‌ర్ల‌కు అమ్ముడైన విష‌యం తెలిసిందే. అంటే ఒక్కో మ్యాచ్‌కు 15.1 మిలియ‌న్ డాల‌ర్లు . ఇది ఇంగ్లీష్ ప్రీమియ‌ర్ లీగ్ కంటే ఎక్కువ అయిన‌ప్ప‌టికీ యూఎస్ నేష‌న‌ల్ ఫుట్‌బాల్ లీగ్ కంటే కాస్త తక్కువ‌. అందుకే ఇప్పుడు సౌదీ క‌న్ను ఐపీఎల్ పై ప‌డిన‌ట్లు తెలుస్తోంది.