World End 2026 : నవంబర్ 13, శుక్రవారం.. ప్రపంచం అంతమవుతుందా.. వెలుగులోకి 1960 నాటి పరిశోధన పత్రాలు
World End 2026 : 2026, నవంబర్ 13న ప్రపంచం అంతం కాబోతుందా.. అసలిప్పుడీ ప్రస్తావన ఎందుకు తెర మీదకు వచ్చిందంటే..
Scientists in 1960 thought that this world will end on 2026 13th november
World End 2026 : త్వరలోనే భూమి అంతమవుతుందంటూ ఇప్పటికే చాలా సార్లు వార్తలు వచ్చాయి. ఎన్నో ఏళ్లుగా ఇలాంటి వాదనలు అనేకసార్లు తెర మీదకు వచ్చాయి. ఫలానా సంవత్సరంలో భూమి అంతం కాబోతుంది అంటూ ఇప్పటికే అనేక వార్తలు వచ్చాయి. అయితే అవన్నీ ఊహజనిత వార్తలే.. నిజం కావని ఇప్పటికే నిరూపణ అయ్యింది. ఈ క్రమంలో తాజాగా మరోసారి భూమి అంతం గురించి వార్తలు తెర మీదకు వచ్చాయి. 2026, నవంబర్ 13, శుక్రవారం నాడు భూమి మీద జనాభా నశిస్తుందనే కొత్త వాదన వినిపిస్తోంది. ఇందుకు మూల కారణంగా 1960 నాటి పరిశోధనా పత్రాలు తాజాగా వెలుగులోకి రావడమే.
1960వ సంవత్సరంలో చేసిన ఒక వింత జోస్యం ఇప్పుడు ఇంటర్నెట్లో మళ్ళీ వైరల్ అవుతోంది. జనాభా పెరుగుదల కారణంగా 2026 నవంబర్ 13 నాటికి మనుషులు ఒకరినొకరు “నలిపేసుకుని చనిపోయే” పరిస్థితి వస్తుందని అప్పట్లో ఒక పరిశోధన పత్రం పేర్కొంది. ప్రపంచ జనాభా విస్ఫోటనం చెందే ఈ భయానక దినం నవంబర్ 13, 2026 (శుక్రవారం) అని ఆ నివేదిక అంచనా వేసింది.
భౌతిక శాస్త్రవేత్త హీంజ్ వోన్ ఫోయెర్స్టర్ (Heinz von Foerster), తన బృందంతో కలిసి ‘సైన్స్’ అనే పత్రికలో ఒక పరిశోధన పత్రాన్ని ప్రచురించారు. ఈ పరిశోధన పత్రంలో వారు.. గత రెండు వేల సంవత్సరాల జనాభా గణాంకాలను విశ్లేషించి, ఒక గణిత సూత్రాన్ని (Formula) రూపొందించారు. ఈ క్రమంలో ఒక అసాధారణ విషయం వెలుగులోకి వచ్చింది.
అది ఏంటంటే ప్రపంచ జనాభా స్థిరంగా పెరగడం లేదని.. వృద్ధి రేటు కాలక్రమేణా విపరీతంగా వేగవంతమవుతోందని వారు గుర్తించారు. దీనిని వారు “హైపర్బోలిక్ గ్రోత్” (Hyperbolic growth) అని పిలిచారు. ఈ లెక్కల ప్రకారం భవిష్యత్తును అంచనా వేయగా.. నవంబర్ 13, 2026 నాటికి ప్రపంచ జనాభా అనంతం అవుతుందని వారి పరిశోధన తేల్చింది. దీంతో నవంబర్ 13న మనుషులు నశిస్తారనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు.
అయితే ఈ ప్రతిపాదనను అక్షరాలా నమ్మాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. అందుకు గల కారణాలను వివరిస్తున్నారు. అవేంటంటే..
గణితం మాత్రమే.. వాస్తవం కాదు:
జనాభా అంతం అవ్వడం అన్నది ఎన్నటికీ సాధ్యం కాదు. అదుపులేని జనాభా వృద్ధి రేటు వల్ల భవిష్యత్తులో ఎదురయ్యే ముప్పును హెచ్చరించడానికి మాత్రమే ఆ శాస్త్రవేత్తలు ఈ గణిత నమూనాను వాడారు.
పుట్టినరోజు సరదా:
నవంబర్ 13 అనే తేదీని సీరియస్గా చెప్పలేదు. అది వోన్ ఫోయెర్స్టర్ పుట్టినరోజు కావడంతో ఆ తేదీని సరదాగా వాడి ఉంటారని అభిప్రాయపడుతున్నారు.
మారిన పరిస్థితులు:
1960వ దశకం తర్వాత ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు మారిపోయాయి. సంతానోత్పత్తి రేటు తగ్గడం, సమాజంలో వచ్చిన మార్పుల వల్ల జనాభా వృద్ధి నెమ్మదించింది. ప్రస్తుతం చాలా దేశాలు జనాభా పెరుగుదల కంటే, జనాభా తగ్గడంతో పాటు వృద్ధుల సంఖ్య పెరగడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నాయి.
వాస్తవం ఏంటంటే..
ఇటీవల జరిగిన కొన్ని పరిశోధనల ప్రకారం, ప్రపంచ జనాభా వృద్ధి స్థిరీకరించబడుతోంది. 2030వ దశకం ప్రారంభంలో ప్రపంచ జనాభా గరిష్ట స్థాయికి చేరుకుని.. ఆ తర్వాత క్రమంగా తగ్గే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
2026 ప్రళయం గురించి వస్తున్న వార్తలు కేవలం ఒక గణిత నమూనాలోని పరిమితులే తప్ప, అవి నిజమైన ప్రపంచ వినాశనానికి సంకేతాలు కావు. వృద్ధి ఎప్పుడూ ఒకే వేగంతో సాగదని, ఏదో ఒక సమయంలో అది మారుతుందని చెప్పడమే ఆ పాత అధ్యయనం యొక్క అసలు ఉద్దేశం. కాబట్టి, 2026లో జనాభా వల్ల ప్రపంచం అంతమైపోతుందనే భయం అక్కర్లేదంటున్నారు శాస్త్రవేత్తలు.
