బైడెన్ కు సీక్రెట్ సర్వీస్ భద్రత!

  • Published By: madhu ,Published On : November 7, 2020 / 01:42 PM IST
బైడెన్ కు సీక్రెట్ సర్వీస్ భద్రత!

Updated On : November 7, 2020 / 2:27 PM IST

Secret service security for Biden! : అమెరికా అధ్యక్ష ఎన్నికలు ముగిసి మూడు రోజులు గడిచింది. అయినా అధ్యక్ష పీఠం ఎక్కేది ఎవరో ఇంకా తేలట్లేదు. చాలా రాష్ట్రాల్లో ఫలితం వచ్చేసినా.. జార్జియా, పెన్సిల్వేనియా, నార్త్‌ కరోలినా, అలస్కా, నెవాడాల్లో మాత్రం ఇంకా లెక్కింపు కొనసాగుతోంది. ఇవి తేలితే గానీ తదుపరి అధ్యక్షుడు ఎవరనేదానిపై స్పష్టత రాదు. అయితే ఈ ఫలితాలు ఇప్పట్లో వచ్చేలా కనిపించడం లేదు.



కౌంటింగ్ ఆలస్యం : – 
నార్త్‌ కరోలినా, నెవాడాలో ఇంకా బ్యాలెట్‌ ఓట్లను స్వీకరిస్తుండగా.. అలస్కాలో ఇంతవరకూ ఎర్లీ ఓటింగ్‌ లెక్కింపు ప్రారంభించ లేదు. ఈ సారి ఎన్నికల్లో పోస్టల్‌ బ్యాలెట్స్‌ భారీగా పోలవడమే ఆలస్యానికి కారణమైంది. గత ఎన్నికల్లో పోస్టల్‌ బ్యాలెట్లు మొత్తం పోలైన ఓట్లలో 34 శాతమే ఉన్నాయి. దీంతో అప్పటి ఎన్నికల్లో ట్రంప్‌ గెలుపు ఎన్నికలు జరిగిన మరుసటి రోజుకు తేలిపోయింది. అయితే కొవిడ్‌ కారణంగా చాలా మంది ఎర్లీ ఓటింగ్‌కు మొగ్గుచూపగా.. ఈ సారి పోస్టల్‌ బ్యాలెట్ల సంఖ్య 68 శాతానికి పెరిగింది. దీంతో కౌంటింగ్‌ ఆలస్యమవుతోంది.



https://10tv.in/joe-biden-is-on-the-cusp-of-becoming-us-president-as-key-states-carry-on-counting-votes/
జార్జియాలో మార్పులు : – 
ఒకప్పుడు రిపబ్లికన్లకు మంచి పట్టున్న జార్జియాలో ఇటీవల పరిస్థితులు మారుతూ వచ్చాయి. తాజా ఎన్నికల్లో అది స్పష్టంగా కనబడింది. ప్రస్తుతం వెలువడుతున్న ఫలితాల్లో తొలుత ట్రంప్‌ ఆధిక్యం కనబర్చినప్పటికీ క్రమంగా అది తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం ట్రంప్‌ను దాటి బైడెన్‌ ముందంజలో కొనసాగుతున్నారు. ఈ రాష్ట్రంలో 16 ఎలక్టోరల్‌ ఓట్లు ఉన్నాయి. బైడెన్‌ గెలిస్తే ఈ ఓట్లన్నీ ఆయనకే పడతాయి. దీంతో ట్రంప్‌ అధ్యక్ష ఆశలు ఇక గల్లంతైనట్లే.



బైడెన్ విజయం ఖాయం : – 
జార్జియాలో ఓడిపోయి మిగతా నాలుగింటిలో గెలిచినా ట్రంప్‌ మ్యాజిక్‌ ఫిగర్‌ను అందుకోలేరు. 2016లోనూ ట్రంప్‌.. అప్పటి డెమొక్రటిక్‌ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌పై కేవలం 5శాతం ఓట్ల తేడాతో విజయం సాధించారు. అమెరికా అధ్యక్ష మ్యాజిక్‌ ఫిగర్‌కి చేరువగా వచ్చిన డెమొక్రాటిక్‌ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్‌ విజయం ఖాయమని ఆయన ప్రచార వర్గం ధీమా వ్యక్తం చేస్తోంది. అందుకు తగ్గట్లు బైడెన్‌కు భద్రతను పెంచుతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. బైడెన్‌ భద్రతను పెంచేందుకు అమెరికా సీక్రెట్ సర్వీసు సంస్థ అధికారులను పంపించినట్లు వాషింగ్టన్‌ పోస్టు పత్రిక పేర్కొంది.



అమెరికా సీక్రెట్ సర్వీసెస్ : – 
ప్రస్తుత పరిణామాలను అంచనా వేసిన అమెరికా నిఘా విభాగం అధికారుల బృందాలు జో బైడెన్‌కు రక్షణ కల్పించేందుకు విల్మింగ్టన్, డెలావర్‌కు తరలివెళ్లినట్లు సమాచారం. అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందే వారికి అమెరికా సీక్రెట్‌ సర్వీస్‌ భారీగా భద్రత కల్పిస్తుంది. కాబోయే అధ్యక్షుడికి విమాన ప్రయాణాల సమయాల్లో కూడా ఈ విభాగం అదనపు రక్షణ చర్యలు తీసుకుంటుంది. గత వారం నుంచే బైడెన్‌ వెంట సీక్రెట్‌ సర్వీస్‌ బృందం ఒకటి రక్షణగా ఉంటున్నట్లు అమెరికా మీడియా చెతుతోంది.



వాహన కాన్వాయ్ కి భద్రత : – 
ఎన్నికల రోజున బైడెన్‌ వాహన కాన్వాయ్‌కి కూడా భద్రత కల్పించినట్లు తెలుస్తోంది. భద్రతా విభాగం స్పందించడం కాస్త ఆలస్యమైనా ఈ పరిణామాన్ని తాము ముందుగానే ఊహించామని ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఎన్నికల ఫలితాల్లో ప్రత్యర్థి జో బైడెన్‌ ముందంజలో ఉన్నప్పటికీ వెంటనే ట్రంప్‌ ఓటమిని అంగీకరించేందుకు సిద్ధంగా లేరని పరిశీలకులు అంటున్నారు.