UK Health Crisis: క్రిస్మస్ వేళ యూకేలో కలకలం.. భారీ పెరిగిన ప్లూ కేసులు.. ఆందోళనలో ప్రజలు..

1968లో మొదటిసారిగా గుర్తించబడిన H3N2 అనే వైరస్ రకం వేగంగా పరిణామం చెందుతోంది.

UK Health Crisis: క్రిస్మస్ వేళ యూకేలో కలకలం.. భారీ పెరిగిన ప్లూ కేసులు.. ఆందోళనలో ప్రజలు..

Updated On : December 23, 2025 / 8:31 PM IST

UK Health Crisis: క్రిస్మస్ సీజన్‌కు ముందు యునైటెడ్ కింగ్‌డమ్‌లో తీవ్ర ఆరోగ్య సంక్షోభం తలెత్తింది. H3N2 ‘సూపర్ ఫ్లూ’ జాతి కారణంగా ఇన్‌ఫ్లుఎంజా కేసుల్లో పెరుగుదల ఆందోళనకు గురి చేస్తోంది. కరోనా మహమ్మారి తర్వాత ఇంతవరకు కనిపించని స్థాయిలో రోజుకు 3వేల 100 కంటే ఎక్కువ మంది ఫ్లూ సంబంధిత సమస్యలతో ఆసుపత్రిలో చేరినట్లు ఆరోగ్య అధికారులు నివేదించారు. ఇది సాధారణ సీజన్ల కంటే ముందుగానే బలంగా వచ్చింది. కేసుల సంఖ్య పెరుగుతుండటంతో అధికారులు అలర్ట్ అయ్యారు. టీకాలు వేయడం ప్రారంభించారు. అలానే, జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు.

‘సూపర్‌ఫ్లూ’ అని పిలవబడుతున్న వేగంగా వ్యాపించే ఇన్‌ఫ్లుయెంజా వేవ్.. యూకేలోని ఆసుపత్రులపై ఒత్తిడి పెంచుతోంది. ఫ్లూ సంబంధిత కేసుల్లో తీవ్ర పెరుగుదల ఉంది. గత వారం చివరి నాటికి సగటున ప్రతిరోజూ 3వేల 100 మందికి పైగా రోగులు ఆసుపత్రిలో చేరారు. ఇది అంతకు ముందు వారంతో పోలిస్తే 18 శాతం పెరుగుదల. కోవిడ్-19 మహమ్మారి తర్వాత ఇంతటి స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి.

నేషనల్ హెల్త్ సర్వీస్ (NHS) యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ (UKHSA) విడుదల చేసిన డేటా ప్రకారం ఈ వ్యాప్తి ప్రధానంగా ఇన్ ఫ్లూయంజా A (H3N2) వల్ల, ప్రత్యేకంగా కొత్తగా ఆధిపత్యం చెలాయిస్తున్న K అనే సబ్‌క్లేడ్ వల్ల జరుగుతోంది.

1968లో మొదటిసారిగా గుర్తించబడిన H3N2 అనే వైరస్ రకం వేగంగా పరిణామం చెందుతోంది. ఇది తీవ్రమైన ఫ్లూ కాలాలతో ముడిపడి ఉంటుంది. ఈ సంవత్సరం ఈ వ్యాప్తి సాధారణం కంటే ముందుగానే ప్రారంభమైంది. మరింత తీవ్రంగా ప్రభావం చూపుతోంది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, కాలానుగుణ ఇన్ ఫ్లూయంజా అనేది ఏడాది పొడవునా ప్రపంచవ్యాప్తంగా వ్యాపించే తీవ్రమైన శ్వాసకోశ ఇన్ఫెక్షన్, ఉత్తర అర్ధగోళంలో శీతాకాలంలో కార్యకలాపాలు సాధారణంగా పెరుగుతాయి. ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఇన్ ఫ్లూయంజా కేసులు పెరిగాయి. ఆగస్టు 2025 నుండి చాలా దేశాల్లో J.2.4.1 లేదా K సబ్‌క్లేడ్‌కు చెందిన H3N2 వైరస్‌లలో వేగవంతమైన పెరుగుదల ఉంది. ఈ వైరస్‌లు మునుపటి జాతులతో పోలిస్తే అనేక జన్యు మార్పులను కలిగి ఉంటాయి. ఈ జాతి గణనీయమైన పరిణామ మార్పును సూచిస్తున్నప్పటికీ, వ్యాధి తీవ్రత పెరుగుదలను సూచించడం లేదని WHO చెబుతోంది.

లక్షణాలు ఇవే..

యూకే నుండి వస్తున్న నివేదికల ప్రకారం H3N2 వైరస్‌తో సోకిన వారిలో తీవ్రమైన అలసట ఒక సాధారణ లక్షణంగా ఉంది. ఇది సాధారణ జలుబు నుండి దీన్ని వేరు చేస్తుంది. ఎందుకంటే సాధారణ జలుబు లక్షణాలు నెమ్మదిగా అభివృద్ధి చెందుతాయి. ఇతర లక్షణాలు ఎక్కువగా కాలానుగుణ ఫ్లూను ప్రతిబింబిస్తాయి. జ్వరం, దగ్గు, ముక్కు కారటం, ఒళ్లు నొప్పులు, కొన్ని సందర్భాల్లో వాంతులు లేదా విరేచనాలు ఉంటాయి. చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణిలు, ఉబ్బసం, మధుమేహం, గుండె జబ్బులు, బలహీనమైన రోగనిరోధక శక్తి లేదా నాడీ సంబంధిత రుగ్మతలు వంటి దీర్ఘకాలిక పరిస్థితులతో బాధపడుతున్న వ్యక్తులకు రిస్క్ ఎక్కువగా ఉందని వైద్య నిపుణులు తెలిపారు.

Also Read: మధుమేహ వ్యాధిగ్రస్తులకు గుడ్‌న్యూస్.. పీల్చుకునే ఇన్సులిన్ పౌడర్ వచ్చేసింది.. ఇంజక్షన్‌కు ఇక బైబై..