Compulsory Marriage: 18 ఏళ్లు నిండిన వెంటనే పెళ్లి చేయాలనే చట్టం తేవాలని డిమాండ్..
18 ఏళ్లకే యువతకు తప్పకుండా వివాహం చేయాలనే కొత్త డిమాండ్ ను అసెంబ్లీకి తీసుకొచ్చారో నేత. ఈ వింత ప్రతిపాదన..దానికి సదరు సభ్యుడు చెప్పే కారణాలు వివాదంగా మారాయి.

18 Years Compalsary Marriage
18 Years compalsary Marriage : 18 ఏళ్లు నిండగానే అమ్మాయిలైనా..అబ్బాయిలైనా సరే వెంటనే పెళ్లి చేసేయాలని అంటూ ఓ కొత్త డిమాండ్ ను తెరపైకి తీసుకొచ్చాడో రాజకీయ నేత. 18 ఏళ్లు నిండగానే పెళ్లి చేసేయాలనే చట్టాన్ని చేయాలని అసెంబ్లీకి డ్రాఫ్ట్ సమర్పించాడో చట్టసభ సభ్యుడు. పాకిస్థాన్‌లో ఓ ప్రజాపతినిధి తీసుకొచ్చిన ఈ వింత ప్రతిపాదనకు సంబంధించిన కారణాలు కూడా విచిత్రంగానే ఉన్నాయి.
ముత్తాహిదా మజ్లిస్-ఈ-అమల్ (ఎంఎంఏ) పార్టీకి చెందిన చట్టసభ సభ్యుడు సయ్యద్ అబ్దుల్ రషీద్ ఈ వింత అసెంబ్లీకి ఈ ప్రతిపాదన తెచ్చారు. ‘ది సింధ్ కంపల్సరీ మ్యారెజ్ యాక్ట్ 2021’ డ్రాఫ్ట్‌ను సింధ్ అసెంబ్లీ ముందుంచారు. దీన్ని చట్టం చేయాల్సిందేనని..18 సంవత్సరాల వయసు వచ్చిన వెంటనే పిల్లలకు తల్లిదండ్రులు కచ్చితంగా పెళ్లి చేసేలా ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. కానీ ఏవైనా కారణాలతో వారి తల్లిదండ్రులు వివాహం చేసయకపోయినా..చేయలేకపోయినా దానికి సంబంధించిన కారణాలకు ఆయా జిల్లాల డిప్యూటీ కమిషనర్‌కు వివరించాలని..అలా చేయకపోతే ఆ తల్లిదండ్రులకు రూ.500 జరిమానా విధించాలని అసెంబ్లీ ముందుకు తెచ్చిన డ్రాఫ్ట్‌లో పొందుపరిచారు. సమాజం శ్రేయస్సు కోసమే ఈ బిల్లును ప్రతిపాదిస్తున్నానని రషీద్ చెబుతున్నారు.
ఈ ప్రతిపాదన గురించి ఆయన ఏం చెప్పారంటే..18 ఏళ్లకే పెళ్లిళ్లు చేస్తే నేరాలు తగ్గుతాయని చెప్పుకొచ్చారు. దేశంలో నేరాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. చిన్నారులపై అత్యాచారాలు..హత్యలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో 18 ఏళ్లకే వివాహాలు చేసేస్తే నేరాలు తగ్గుతాయంటున్నారీయన. నేరాలను నియంత్రించాలంచే తప్పకుండా 18 సంవత్సరాలకే వివాహం చేయాలనే చట్టం తీసుకురావాల్సిన అవసరం చాలా ఉందని అన్నారు.
18 ఏళ్లకే వివాహం చేయాల్సిన బాధ్యతగా తల్లిదండ్రులు ఆలోచించాలని ఇది వారు తప్పకుండా నిర్వర్తించాల్సిన బాధ్యతవారిపై ఉందని అన్నారు. 18 ఏళ్లకు వివాహం చేసుకోవటం యువత హక్కు అని..ఇది మహ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి అలాగే ఇస్లామిక్ బోధనల ప్రకారం ఇది ముస్లిం యువత హక్కు అని చెప్పుకొచ్చారు. పెళ్లికి 18 ఏళ్ల వయస్సు సరైనదేనని నేను పక్కాగా నమ్ముతున్నానని అన్నారు. ఒకవేళ 18ఏళ్లకు పిల్లలకు పెళ్లి చేయలేకపోతే ఆ తల్లిదండ్రులు ఓ అఫిడవిడ్ సమర్పించాలనీ..త్వరలోనే మా పిల్లలకు వివాహం చేస్తామని అఫిడవిట్ తో పాటు హామీని జతపరిచి ఇవ్వాలని సయ్యద్ అబ్దుల్ డ్రాఫ్ట్‌లో పేర్కొన్నారు.
మరోవైపు పాకిస్థాన్‌లో బాల్య వివాహాలు ప్రధాన సమస్యగా మారాయని అధ్యయనాలు ఆందోళనకర విషయాలు వెల్లడిస్తున్నాయి. ఈక్రమంలో ముత్తాహిదా మజ్లిస్-ఈ-అమల్ పార్టీ నేత ఇటువంటి ప్రతిపాదన తీసుకురావటం వివాదాస్పదంగా మారింది. ఈ క్రమంలో 18 సంవత్సరాలకే కచ్చితంగా పెళ్లి చేయాలనే చట్టమే తీసుకురావాలని డిమాండ్ డ్రాఫ్టును సింధ్ అసెంబ్లీ ఆమోదిస్తుందా.. తిరస్కరిస్తుందా వేచి చూడాలి.