మరో విమాన ప్రమాదం.. టేకాఫ్ అయిన క్షణాల్లోనే ఢమాల్ అని కుప్పకూలిన ఫ్లైట్.. వీడియో వైరల్

లండన్‌లో విమాన ప్రమాదం చోటు చేసుకుంది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలిపోయింది.

మరో విమాన ప్రమాదం.. టేకాఫ్ అయిన క్షణాల్లోనే ఢమాల్ అని కుప్పకూలిన ఫ్లైట్.. వీడియో వైరల్

jet crashes at london

Updated On : July 14, 2025 / 2:19 PM IST

Plane Crash at London: లండన్‌లో విమాన ప్రమాదం చోటు చేసుకుంది. టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే కుప్పకూలిపోయింది. పెద్ద శబ్దంతోపాటు మంటలు వ్యాపించాయి. సౌత్ఎండ్ ఎయిర్ పోర్టులో ఈ ఘటన జరిగింది.

ఆదివారం సాయంత్రం లండన్‌కు తూర్పున 56కిలో మీటర్ల దూరంలో ఉన్న ఎసెక్స్‌లోని సౌత్ఎండ్ విమానాశ్రయం నుండి టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే ఈ ప్రమాదం జరిగింది. బీచ్‌క్రాఫ్ట్ సూపర్ కింగ్ ఎయిర్ లైట్‌ విమానం ఏథెన్స్ నుండి క్రొయేషియాకు ప్రయాణించి నెదర్లాండ్స్‌లోని లెలిస్టాడ్‌కు వెళుతుండగా ప్రమాదం జరిగింది.


విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం గాల్లోనే తిరగబడి నేలపై పడిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే భారీ పేలుడు శబ్ధంతో మంటలు ఎగిసిపడ్డాయి. దట్టమైన నల్లటి పొగలు కమ్ముకున్నాయి. వెంటనే అప్రమత్తమైన విమానాశ్రయ సిబ్బంది వెంటనే మంటలను అదుపు చేసేందుకు చర్యలు చేపట్టారు. ప్రమాద స్థలానికి దగ్గర ఉండటంతో భద్రతా చర్యగా సమీపంలోని గోల్ఫ్ క్లబ్, రగ్బీ క్లబ్ లను ఖాళీ చేయించారు.

విమానాశ్రయం వెబ్ సైట్ ప్రకారం.. సౌత్ఎండ్ విమానాశ్రయంలో తాత్కాలికంగా విమాన రాకపోకలను నిలిపివేశారు. పలువిమానాలను రద్దు చేశారు. అయితే, ప్రమాద సమయంలో ఈ విమానంలో ఎంత మంది ఉన్నారు.. వారి పరిస్థితి ఎలా ఉందనే విషయాలపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతోంది.