Afghanistan : తాలిబన్ల అరాచకం.. మృతదేహాలతో శృంగారం.
తాలిబన్ల అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఆఫ్ఘానిస్తాన్ నుంచి శరణార్థిగా భారత్ కు వచ్చిన ముస్కాన్ అనే మహిళ సంచలన విషయాలు బయటపెట్టింది.

Afghanistan
Afghanistan : ఆఫ్ఘానిస్తాన్ లో తాలిబన్ల అరాచకాలు అన్ని ఇన్ని కావని భారత్ కు శరణార్థిగా వచ్చిన ముస్కాన్ అనే మహిళ తెలిపారు. తాలిబన్ల దృష్టిలో మహిళలు అంటే సెక్స్ బానిసలని ఆమె తెలిపారు. గతంలో పోలీస్ శాఖలో పనిచేశారు ముస్కాన్.. ప్రాణభయంతో ఆమె ఇండియాకు వచ్చారు. తాజాగా జాతీయ మీడియాతో మాట్లాడుతూ సంచలన విషయాలు బయటపెట్టారు. 10 ఏళ్ల చిన్నారులను పెళ్లి చేసుకొని వారిని కూడా అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆఫ్ఘానిస్తాన్ లో మహిళలకు రక్షణ లేదని.. చిన్న పిల్లలను కూడా ఇంట్లోంచి తీసుకెళ్తున్నారని తెలిపారు. మృతదేహాలతో కూడా శృంగారం చేస్తున్నారని సంచలన విషయం బయటపెట్టారు ముస్కాన్.
ఆడవారిని తీసుకెళ్తుంటే అడ్డొచ్చిన వారిని కాల్చిచంపుతున్నారని కన్నీటిపర్యంతమయ్యారు. ఆఫ్ఘాన్ నుంచి పారిపోయేందుకు అనేకమంది కాలినడకన బయలుదేరారని, వారికి తాగేందుకు నీరు కూడా దొరకడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రవాణా వ్యవస్థ నిలిచిపోయింది. దుకాణాల్లో సరుకు నిండుకుంది. దిగుమతులు లేకపోవడంతో ఆహార పదార్ధాల కొరత ఏర్పడినట్లు తెలిపారు. ఆహారం కొనుక్కునేందుకు చాలామంది వద్ద డబ్బులు లేవని, డబ్బులు ఉన్నా అమ్మేవారు లేరని వాపోయారు. ఇక ఇళ్లలోకి వచ్చి అమ్మాయిలను తీసుకెళ్లి వారిని సెక్స్ వర్కర్లుగా, వంట మనుషులుగా మార్చుతున్నారని తెలిపారు. ప్రపంచ దేశాలు ఆఫ్ఘాన్ పరిస్థితిపై ఒకసారి ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు.
కాగా తాలిబన్లతో ప్రాణహాని ఉన్న అధికారుల్లో కొంతమందిని భారత్ తీసుకొచ్చింది. వీరిలో గతంలో పోలీసులుగా పనిచేసినవారితోపాటు.. అమెరికా సైన్యానికి సహకరించినవారు ఉన్నారు. ఇక క్రీడాకారులు కూడా ఆ దేశం విడిచి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. రవాణా సౌకర్యం లేకపోవడంతో ఎటు వెళ్లలేని స్థితిలో పడిపోయారు. ఇక ఇప్పటికే భారత పౌరులను తరలించే పని వేగం పెంచింది కేంద్రం. వాయుసేన విమానాల్లో భారత పౌరులను దేశానికి తీసుకొస్తున్నారు.