Tamil nadu Elections : తమిళనాడులో ఎన్డీయే కూటమి సీట్ల సర్దుబాటు కొలిక్కి.. బీజేపీకి ఎన్ని సీట్లు దక్కాయంటే?
Tamil Nadu Elections : ఎన్డీయే కూటమిలోని భాజపా సహా కీలక భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల పంపకం ఒప్పందాన్ని అన్నాడీఎంకే ఖరారు చేసింది. భాజపాకు 27 సీట్లు ఇచ్చేందుకు అంగీకారం తెలిపింది.
Tamil Nadu Elections
- తమిళనాట ఎన్డీయే సీట్ల సర్దుబాటు ఖరారు
- బీజేపీకి 27 సీట్లు, పీఎంకేకి 18, ఏఎంఎంకేకు 11
- అన్నాడీఎంకే అత్యధికంగా 178 స్థానాల్లో పోటీ
Tamil nadu Elections : తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల కోలాహలం నెలకొంది. ఏప్రిల్ 23న పోలింగ్ జరగనుండగా.. మరో వారంరోజుల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ క్రమంలోనే ఎన్డీయే కూటమిలోని బీజేపీ సహా కీలక భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల పంపకం ఒప్పందాన్ని అన్నాడీఎంకే ఖరారు చేసింది.
తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 234 స్థానాలు ఉన్నాయి. ఎన్డీయే కూటమిలో పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై పలు దఫాలుగా చర్చలు జరిగాయి. అయితే, తాజాగా.. చెన్నైలోని అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలో ఎన్డీయే పక్షాలు భేటీ అయ్యాయి. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, పీఎంకే అధ్యక్షుడు అన్బుమణి రామ్‌దాస్, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి, ఏఎంఎంకే ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ పాల్గొన్నారు. వీరి చర్చల్లో సీట్ల పంపంకాలపై అన్ని పార్టీలు ఓ కొలిక్కి రావడవంతో.. ఈమేరకు సోమవారం మీడియా వేదికగా ప్రకటించారు.
ఎన్టీయే కూటమిలోని అన్నాడీఎంకే అత్యధికంగా 178 స్థానాల్లో పోటీ చేయనుంది. బీజేపీ 27, పీఎంకే 18, ఏఎంఎంకే 11 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు 20 స్థానాల్లో పోటీ చేయగా.. ఈసారి ఏడు స్థానాలు ఎక్కువ దక్కాయి. పీఎంకే రెండుగా చీలిపోయిన విషయం తెలిసిందే. అయితే, తండ్రి రామదాసు శశికళతో చేతులు కలిపారు. కొడుకు అన్బుమణి రామదాసు ఎన్డీయేలో ఉన్నారు.
ఈ సందర్భంగా బీజేపీ వ్యవహారాల ఇంఛార్జ్, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ.. మేమంతా ఒకే కుటుంబం. కలిసికట్టుగా ఎన్నికల్లో పోటీచేసి విజయం సాధిస్తామని, రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
