NASA : అంతరిక్షంలో పండించిన టమాటాలను భూమికి తీసుకొస్తున్న నాసా
ఆకాశంలో పండి భూమి మీదకు దిగుతున్నాయి టమాటాలు. అంతరిక్షంలో పండించిన టమాటాలను నాసా భూమ్మీదకు తీసుకొస్తోంది.

NASA Tomatoes grown in space
NASA Tomatoes grown in space : అసాధ్యాలు సుసాధ్యాలు చేస్తున్నారు శాస్త్రవేత్తలు తమ మేథాశక్తితో. మట్టిలేకుండానే పంటలు పండించేటయం కాదు ఏకంగా అంతరిక్షంలోనే పంటలు పండించేస్తున్నారు. తాజాగా అంతరిక్షంలో టమాటాలను పండించారు. వాటిని భూమి మీదకు తీసుకొచ్చారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ISS)లో పండించిన టమోటాలను ఈరోజు అంటే ఏప్రిల్ 15(2023)న తీసుకొచ్చారు. స్పేస్ ఎక్స్ సీఆర్ఎస్-27 కార్గో ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా రవాణా చేస్తున్నామని తెలిపింది నాసా. భారత కాలమాన ప్రకారం రాత్రి 8.15 గంటలకు ISS బయలుదేరుతుందని తెలిపింది.
మొత్తంగా స్పేస్‌క్రాఫ్ట్ ద్వారా సుమారు 2,000 కిలోల బరువు ఉన్న వస్తువుల్ని అంతరిక్షం నుంచి భూమి పైకి తీసుకురానున్నారు. వ్యోమగాములు అంతరిక్ష కేంద్రంలోని మీనియేచర్ గ్రీన్ హౌస్ ల్యాబ్(Miniature greenhouse lab)లో టమాటాలను పండించారు. 90, 97, 104 రోజుల పాటు మూడు రకాలుగా టమాటాలను హార్వెస్ట్ చేసినట్లు నాసా తన బ్లాగ్‌లో చెప్పింది. పండిన టమాటాలను ఫ్రీజ్ చేసి, వాటి పోషక విలువలను టెస్టు చేసినట్లు వివరించింది.
అంతరిక్షంలో పంటల్ని పండించి వ్యోమగాముల ఖర్చుల్ని తగ్గించే ఉద్దేశంతో నాసా పలు యత్నాలు చేస్తోంది. ఎలాంటి గార్డెన్ లేకుండా ల్యాబ్‌లలోనే పంటల్ని పండించే ఈ ప్రయోగాన్ని భూమిపై కూడా ఉపయోగించవచ్చని నాసా చెబుతోంది. తాజా ఆహారం కోసం అంతరిక్షంలో మొక్కలను పెంచే సామర్థ్యం భవిష్యత్తులో ఉపయోగపడుతుందంటోంది.
మరోవైపు జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ ప్లోరేషన్ ఏజెన్సీ (Japan Aerospace Exploration Agency (JAXA) తయారు చేసిన క్రిస్టల్స్‌ను కూడా ఐఎస్ఎస్ నుంచి తీసుకురానున్నారు. సోలార్ సెల్స్, సెమీకండక్టర్ ఆధారిత అధ్యయనం కోసం ఆ క్రిస్టల్స్‌ను వాడనున్నారు. మైక్రోగ్రావిటీలో సేకరించిన రక్త నమోనాలను కూడా తీసుకురానున్నారు. ఇవన్నీ ఫ్లోరిడాలోని కెనడియన్ స్పేస్ ఏజెన్సీకి చేరనున్నాయి.