Dubai Tragedy: దుబాయ్‌లో పెను విషాదం.. వాటి ఫోటోలు తీస్తూ కేరళ యువకుడు దుర్మరణం..
మునీర్, ఆయేషా దంపతుల ఏకైక కుమారుడు మిషాల్. అతడికి ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు.
Dubai Tragedy: దుబాయ్ లో విషాదం నెలకొంది. ఓ ప్రమాదంలో భారత్ కు చెందిన యువకుడు మృతి చెందాడు. అతడి పేరు మహమ్మద్ మిషాల్ (19). కేరళకు చెందిన మిషాల్ కు ఫోటోగ్రఫీ అంటే ఇష్టం. ఈ ప్యాషన్ అతడి ప్రాణం తీస్తుందని ఎవరూ ఊహించలేదు. అనుకోని ప్రమాదంలో అతడు మరణించాడు.
కేరళలోని కోజికోడ్‌కు చెందిన యువ ఫోటోగ్రఫీ ఔత్సాహికుడు మహమ్మద్ మిషాల్.. దుబాయ్‌లోని డీరాలో ఒక భవనం టెర్రస్ నుండి పడి ప్రాణాలు కోల్పోయాడు. ఎంతమాత్రం సేఫ్ కాని రూఫ్ టాప్స్ (పైకప్పులు) వల్ల కలిగే నష్టాలను హైలైట్ చేస్తూ, విమానాల క్లోజప్ షాట్‌లను తీయడానికి ప్రయత్నిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. యూఏఈలో ఇలాంటి ప్రమాదంలో ఓ భారతీయ యువకుడు మరణించాడు. అది జరిగిన కొన్ని నెలలకే మిషాల్ అకాల మరణం సంభవించింది.
మిషాల్ దాదాపు రెండు వారాల పాటు దుబాయ్‌లో విజిట్ వీసాపై ఉన్నాడు. అతడు తన బంధువులతో ఉన్నాడు. ఫోటోగ్రఫీ అంటే అతడికి ఎంతో ప్రేమ. దీంతో సమీపంలోని విమానాశ్రయం నుండి విమానాల చిత్రాలను తీయడానికి భవనం 3వ అంతస్తులోని టెర్రస్‌కు వెళ్లాడు. అక్కడ ప్రమాదం జరిగింది. మిషాల్ కాలు రెండు పైపుల మధ్య చిక్కుకుంది. ఫలితంగా అతను బ్యాలెన్స్ కోల్పోయి కింద పడిపోయాడు. ఈ క్రమంలో అతనికి తీవ్రమైన అంతర్గత గాయాలయ్యాయి. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. ఆ కాసేపటికే అతడు మరణించాడు.
మునీర్, ఆయేషా దంపతుల ఏకైక కుమారుడు మిషాల్. అతడికి ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు. కోజికోడ్ లో సివిల్ ఇంజనీరింగ్ లో డిప్లొమా చదువుతున్నాడు. అతని తండ్రి కోజికోడ్‌లో ఒక రెస్టారెంట్ నడుపుతున్నాడు. మిషాల్ ప్రతిభావంతుడు అని, చాలా చురుగ్గా ఉండే వాడని స్నేహితులు గుర్తు చేసుకున్నారు. అతడికి ఎంతో ఉజ్వలమైన భవిష్యత్తు ఉందన్నారు. ఇలా అర్ధాంతరంగా తమను విడిచి వెళ్లిపోతాడని ఊహించలేదని తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు, స్నేహితులు కన్నీటిపర్యంతం అయ్యారు.
మిషాల్ మృతదేహాన్ని కోజికోడ్‌కు తరలించే లాంఛనాలు దాదాపు పూర్తయ్యాయి. అంత్యక్రియల కోసం మృతదేహాన్ని విమానంలో తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాద ఘటనతో స్థానిక అధికారులు అలర్ట్ అయ్యారు. భద్రత దృష్ట్యా నివాసితులు కానీ, సందర్శకులు కానీ పైకప్పులపై లేదా అసురక్షిత టెర్రస్‌లపైకి వెళ్లకుండా ఉండాలని సూచించారు. కాగా, ఏప్రిల్‌లో అబుదాబి ఇండియన్ స్కూల్‌లో చదువుతున్న 17 ఏళ్ల అలెక్స్ బినోయ్ 12వ తరగతి పరీక్ష ఫలితాల కోసం ఎదురుచూస్తున్నాడు. అతడు తన అపార్ట్‌మెంట్ బాల్కనీ నుండి పడి మరణించాడు.
Also Read: భారత్‌తో యుద్ధానికి రెడీ- రెచ్చిపోయిన పాకిస్తాన్ మంత్రి..
