“నమో” మంత్రం జపిస్తున్న ట్రంప్…ఎన్నికల ప్రచార వీడియోలో మోడీ

  • Published By: venkaiahnaidu ,Published On : August 23, 2020 / 07:53 PM IST
“నమో” మంత్రం జపిస్తున్న ట్రంప్…ఎన్నికల ప్రచార వీడియోలో మోడీ

Updated On : August 24, 2020 / 6:33 AM IST

అగ్రరాజ్యంలో అధ్యక్ష ఎన్నికల ప్రచారం జోరందుకుంది. యూఎస్ లో నివసిస్తున్న దాదాపు 20 లక్షల మంది భారతీయ అమెరికన్ ఓటర్లను తమ వైపునకు తిప్పుకునేందుకు ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీ, అధికార రిపబ్లికన్ పార్టీలు పోటాపోటీపడుతున్నాయి. నవంబర్ లో జరగనున్న ఎన్నికల్లో వీరి ఓట్లు కీలకం కావడంతో వారిని ఆకట్టుకునే దిశగా అమెరికాలోని రెండు ప్రధాన పార్టీలూ ముమ్మర ప్రయత్నం చేస్తున్నాయి.



భారతీయ అమెరికన్ ఓటర్లను ఆకట్టుకునేందుకు ట్రంప్ ఎన్నికల ప్రచార బృందం…భారత ప్రధాని నరేంద్ర మోడీ వీడియోతో కూడిన కమర్షికల్ వీడియోను విడుదల చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి మాసంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌లో పర్యటించినప్పుడు…అమ్మదాబాద్‌లో ట్రంప్, ప్రధాని మోదీ సంయుక్తంగా నిర్వహించిన సభలోని వీడియో క్లిప్పింగ్స్‌తో రిపబ్లికన్ పార్టీ ఈ ప్రచార వీడియోను రూపొందించింది.

ట్రంప్ విక్టరీ ఫైనాన్స్ కమిటీ జాతీయ ఛైర్ కిమ్‌బెర్లీ గ్విల్‌ఫైల్ ఈ వీడియోను ట్వీట్ చేశారు. భారత్‌తో అద్భుత సంబంధాలను అమెరికా ఎంజాయ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. భారతీయ అమెరికన్ల నుంచి తమకు మద్ధతు ఉన్నట్లు పేర్కొన్నారు. డొనాల్డ్ ట్రంప్ తనయుడు జూనియర్ ట్రంప్ కూడా ఈ వీడియోను రీట్వీట్ చేయడంతో ..ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.



అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారతీయ అమెరికన్లు ఎవరివైపు నిలవనున్నారన్న అంశం ఆసక్తికరంగా మారింది. డెమోక్రటిక్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థిగా భారత సంతతికి చెందిన కమలా హారిస్‌ను ప్రకటించి…ఆ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జోసఫ్ బైడెన్ ట్రంప్‌ను డిఫెన్స్‌లోకి నెట్టాడు. అయితే భారతీయుల మద్ధతు కమలా హారిస్ కంటే తనకే ఎక్కువగా ఉన్నట్లు డొనాల్డ్ ట్రంప్ చెబుతున్నారు. చూడాలి మరి మరోసారి ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపడతాడా లేక జో బైడెన్ అధ్యక్ష స్థానంలో కూర్చుంటారా అన్నది.