సెనేట్‌లో ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్’కు ఆమోదముద్ర పడడంపై అంబరాన్నంటే ఆనందంలో ట్రంప్ ఏం చెప్పారో తెలుసా?

అమెరికా ప్రజలు దీనితో ఎన్నో ప్రయోజనాలు పొందుతారంటూ..

సెనేట్‌లో ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్’కు ఆమోదముద్ర పడడంపై అంబరాన్నంటే ఆనందంలో ట్రంప్ ఏం చెప్పారో తెలుసా?

Donald Trump

Updated On : July 2, 2025 / 2:17 PM IST

అమెరికా సెనేట్‌లో ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్’కు ఆమోద ముద్ర పడడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. దీన్ని ‘‘మేజర్ పాలసీ విజయం’’గా ట్రంప్ అభివర్ణించారు. అమెరికా ప్రజలు దీనితో ఎన్నో ప్రయోజనాలు పొందుతారని తెలిపారు.

‘‘ఇది అందరికీ సంబంధించిన బిల్లు’’ అని ట్రంప్ చెప్పారు. ఈ బిల్లులో తమ ప్రధాన హామీలైన పన్నుల కోత, పెరిగిన వేతనాలు, సరిహద్దు భద్రతను మరింత పటిష్ఠం చేయడం, మరింత శక్తిమంతమైన సైన్యాన్ని తయారు చేసుకోవడం వంటివాటి అమలు అంశాలు ఉన్నాయని వెల్లడించారు.

‘‘సెనేట్‌లోని మా గ్రేట్ రిపబ్లికన్‌లు ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్’ ఆమోదించారు. ఇది ఇక హౌస్ బిల్ కాదు, సెనేట్ బిల్ కాదు, ఇది అందరికి సంబంధించిన బిల్. అందరూ గర్వపడే అవకాశం వచ్చింది. ఈ పాలసీ విజయం అందరిదీ. ఇకపై శాశ్వతంగా తక్కువ పన్నులు, ఎక్కువ వేతనాలు, భద్రతతో కూడిన సరిహద్దులు, శక్తిమంతమైన సైన్యం ఉంటాయి.

మెడికేర్, సోషియల్ సెక్యూరిటీ ప్రయోజనాలు తగ్గించకుండా మరింత బలపర్చారు. డెమొక్రాట్లు చేసిన అవినీతి, వృథా ఖర్చులు, దుర్వినియోగాన్ని తొలగిస్తున్నాం’’ అని ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్ సోషల్‌లో పేర్కొన్నారు.

ఈ బిల్లు హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో ప్రవేశపెట్టేందుకు సిద్ధంగా ఉంది. జూలై 4లోపు తన టేబుల్‌కి పంపాలని ట్రంప్ పిలుపునిచ్చారు. ప్లాన్ ప్రకారం ముందుకెళ్తున్నామని తెలిపారు. ప్రజలకు ఇది అవసరమని, వాళ్లు తమను ఎన్నుకున్నది వారి పనులను పూర్తి చేయటానికేనని ట్రంప్ అన్నారు.

ఈ బిల్లుతో అమెరికా ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతుందని ట్రంప్ అన్నారు. ‘‘నేను తిరిగి ఎన్నికైన తర్వాత దేశం ఇప్పటికే అభివృద్ధి చెందుతోంది. ఈ బిల్లు, టారిఫ్‌లు, ఇతర చర్యలతో అమెరికా భారీ వృద్ధి దిశగా వెళ్తుంది. ఫెడరల్ లోటు తగ్గుతుంది. అమెరికా కొత్త స్వర్ణయుగం వైపు ముందుకెళ్తుంది’’ అని చెప్పారు. కాగా, సెనేట్‌లో ఈ బిల్లు 51-50 ఓట్లతో ఆమోదం పొందింది.