వలస పౌరసత్వానికి చెక్: ట్రంప్ మరో కీలక నిర్ణయం

వలస పౌరసత్వానికి చెక్: ట్రంప్ మరో కీలక నిర్ణయం

Updated On : August 23, 2019 / 2:58 AM IST

అమెరికా ప్రెసిడెంట్ మరో సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. వలసల రాజ్యానికి ప్రెసిడెంట్ అయిన ట్రంప్.. స్థానికులకే ఉద్యోగాలు అని ‘అమెరికా ఉద్యోగాలు అమెరికన్‌లకే’ నినాదంతో కఠిన నిర్ణయాలను అమలు చేశారు. దీని తర్వాత మరో సంచలనం వైపుగా అడుగులు వేస్తుంది. పుట్టుకతో పౌరసత్వం (బర్త్‌రైట్‌ సిటిజన్‌ షిప్‌)ను రద్దు చేసే చేయాలనుకుంటున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వెల్లడించారు. 

2016లో అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారాల్లో దీన్ని కూడా వాడుకున్న ట్రంప్‌.. త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రకటించడంతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. తాజాగా మీడియా అడిగిన ప్రశ్నకు బదులిస్తూ, ‘అవును! ‘జన్మతః పౌరసత్వం’ రద్దు చేసే విషయాన్ని తీవ్రంగా ఆలోచిస్తున్నాం. అది నిజంగా హాస్యాస్పదం. దేశాలు, సరిహద్దులు దాటి మా దేశంలో బిడ్డలను కంటున్నారు. దాంతో వారికి అమెరికా పౌరసత్వం వస్తోంది. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం’ అని ట్రంప్‌ పేర్కొన్నారు. 

ట్రంప్‌ గెలిచినప్పటి నుంచి వలస విధానంలో మార్పులకై ప్రయత్నిస్తూనే ఉన్నారు. అమెరికా కాంగ్రెస్‌ పెద్దగా స్పందించకపోవటంతో ట్రంప్ అధ్యక్ష విచక్షణాధికారం ఉపయోగించి రూల్స్‌ను కఠినం చేయడం ప్రారంభించారు. పద్నాలుగో రాజ్యాంగ సవరణను అక్రమ వలసదారులు దుర్వినియోగపరుస్తున్నారనేది ట్రంప్‌ ఉద్దేశ్యం.

గర్భిణీ స్త్రీలను అక్రమంగా అమెరికాకు పంపి అక్కడ ప్రసవం అయ్యేలా చేస్తున్నారని, వారికి పుట్టిన బిడ్డలు అమెరికా పౌరులవుతున్నారనేది ట్రంప్ వాదన. ఈ విధంగా జన్మతః పౌరసత్వ హక్కుతో అక్రమ వలసదారులు పెరిగిపోతున్నారని, చివరకు వలస ఓ హక్కుగా మారుతోందన్నది ఆయన అభియోగం. అందుకే 14వ రాజ్యాంగ సవరణ దుర్వినియోగం కాకుండా కొన్ని వివరణలతో ‘కార్యనిర్వాహక ఉత్తర్వు’ ఇవ్వొచ్చని చెబుతున్నారు.