ఇది డొనాల్డ్ ట్రంప్ వర్షన్ “బిగ్ బాస్” షో.. టీవీ షోలో గెలిస్తే అమెరికా పౌరసత్వం
ఈ రియాలిటీ షోను నిర్వహిస్తే దీనికి ప్రపంచ వ్యాప్తంగా విపరీతంగా ఆదరణ వచ్చే అవకాశం ఉంటుంది.

Donald Trump
“బిగ్‌బాస్” వంటి రియాలిటీ షోలు ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్. అయితే, సొంత దేశాలు వదిలి అమెరికాకు వెళ్లిన వలసదారులకు బిగ్‌బాస్ షో పెడితే ఎలా ఉంటుంది? వలసదారులు ఒకే హౌస్‌లో ఉండి.. దేశ భక్తి, అమెరికా సంప్రదాయం, ఆచారాలకు సంబంధించిన టాస్క్‌లను పూర్తి చేయాల్సి వస్తే? ఇందులో గెలిచిన వ్యక్తికి అమెరికా పౌరసత్వం ఇస్తే?
ఇటువంటి షోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ ట్రంప్ వర్షన్ “బిగ్ బాస్” షోకు సంబంధించిన పలు వివరాలు బయటకు వచ్చాయి. “ది అమెరికన్” పేరిట ఈ షోను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.
అమెరికాలోని వలసదారులకు మాత్రమే ఈ షోలో పాల్గొనే అవకాశం ఉంటుంది. ఇప్పటికే అమెరికా నుంచి చాలా మంది వలసదారులను ఆ దేశ ప్రభుత్వం పంపించేసింది. అయినప్పటికీ, ఇప్పటికీ చాలా మంది వలసదారులు అక్రమంగా అమెరికాలోనే ఉంటున్నారు.
చాలా మంది వలసదారుల సొంత దేశాల్లో ఉన్న దుర్భర పరిస్థితుల వల్ల వారు అమెరికాను వదిలి వెళ్లడం లేదు. అటువంటి వారిని ఎంపిక చేసి “ది అమెరికన్” షోలో కంటెస్టెంట్లుగా అవకాశం ఇస్తారు. గెలిచిన వారికి అమెరికా పౌరసత్వం ఇస్తారు.
ఈ షోకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా బయటకు రాలేదు. ఈ షోను నిర్వహించేందుకు అమెరికా ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. ఈ రియాలిటీ షోను నిజంగానే నిర్వహిస్తే దీనికి ప్రపంచ వ్యాప్తంగా విపరీతంగా ఆదరణ వచ్చే అవకాశం ఉంటుంది.
కెనడియన్ – అమెరికన్ నిర్మాత రాబ్ వార్సాఫ్ ఈ రియాలిటీ షో ఐడియాను ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ షోను ఎలా నిర్వహించాలి? షోలో ఏయే రూల్స్ పాటించాలి? అన్న విషయాలతో 35 పేజీల్లో ఒక రిపోర్ట్‌ను అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖను ఇచ్చారు. ఈ టీవీ షో వలసదారుల్లో దేశభక్తిని పెంపొందించడం, బాధ్యతాయుత పౌరుడిగా ఉండడానికి కావాల్సిన అర్హతలు, లక్షణాలను వారికి గుర్తుకుతెచ్చేలా ఉంటుంది.