తాలిబన్ చేతికి “Kill List” ఇచ్చింది అమెరికానే!
అప్ఘానిస్తాన్ వ్యవహారంలో అమెరికా తీసుకుంటున్న నిర్ణయాలన్నీ బెడిసి కొడుతున్నాయి.

Biden (1)
Kill List అప్ఘానిస్తాన్ వ్యవహారంలో అమెరికా తీసుకుంటున్న నిర్ణయాలన్నీ బెడిసి కొడుతున్నాయి. ప్రస్తుతం కాబూల్ నుంచి హడావుడిగా తమ దళాలు మరియు తమకు సహాయం చేసిన అప్ఘాన్ లను తరలించే పనిలో ఉన్న అమెరికా..అప్ఘానిస్తాన్ లో రెండు దశాబ్దాలుగా తమకు సహాయం చేసిన అప్ఘాన్ ల పేర్లతో కూడిన ఓ జాబితాను స్వయంగా తాలిబన్ చేతికి ఇచ్చినట్టు సంచలన విషయాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. అమెరికా అధికారులు అందించిన ఈ జాబితాను తాలిబన్లు ‘కిల్ లిస్ట్’గా పరిగణించే ప్రమాదం ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
రాజధాని కాబుల్ తాలిబన్ల వశమైన అనంతరం వారికి అమెరికా ఓ లిస్ట్ ఇచ్చిందని..అందులో అమెరికా పౌరులు, గ్రీన్‌కార్డ్ హోల్డర్లు, ఇన్నేళ్లు తమకు సహాయం చేసిన అప్ఘాన్ ప్రజల వివరాలు ఉన్నాయని సమాచారం. అయితే ఈ జాబితాను తాలిబన్లకు అందిస్తే, ప్రజల తరలింపు ప్రక్రియ త్వరగా పూర్తవుతుందని అగ్రరాజ్యం భావించింది. కానీ ఇక్కడే కథ అడ్డం తిరిగింది. ఇన్నేళ్లు అమెరికాకు సహాయం చేసిన అప్ఘాన్ లను వెంటాడి వేటాడుతున్నారు తాలిబన్లు. అందరినీ క్షమిస్తున్నామని బయటకు చెబుతూనే.. ఇళ్లు, కార్యాలయాలను తనిఖీ చేసి, ఇన్నేళ్లు తమకు వ్యతిరేకంగా చర్యలు చేపట్టిన వారిని పట్టుకుంటున్నారు. ఇంత జరుగుతున్నప్పుడు.. స్వయంగా అమెరికానే వెళ్లి తాలిబన్లకు జాబితా ఇవ్వడం గమనార్హం. అయితే ఈ లిస్ట్ వ్యవహారాన్ని అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఖండించకపోవడం గమనార్హం. తనకు ఎలాంటి సమాచారం లేదని మాత్రామే ఆయన వ్యాఖ్యానించారు.
అమెరికా నిర్ణయంపై ఆందోళన
అమెరికా నిర్ణయంపై ఆ దేశ చట్టసభ్యులు, మిలిటరీ అధికారులు తీవ్రంగా మండిపడుతున్నారు. జాబితాలో ఉన్న అప్ఘాన్ ల ప్రాణాలకు ముప్పుపొంచి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే అమెరికా పౌరులకు.. ప్రమాదం తలపెట్టకూడదన్న అభిప్రాయంతోనే జాబితా తాలిబన్లకు ఇచ్చామని అమెరికా అధికారులు తమ చర్యలను సమర్థించుకుంటున్నారు. ఇప్పటికే అప్ఘాన్ లను వేటాడి వెంటాడుతున్న తాలిబన్లు ఈ జాబితాలోని ప్రజలను ఏం చేస్తారనే ఆందోళన నెలకొంది.
ఆత్మాహుతి దాడులకు బాధ్యత తమదేన్న ఐసిస్-కే
మరోవైపు, కాబుల్‌లో గురువారం జరిగిన ఆత్మహుతి దాడుల్లో 100 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో అమెరికా సైనికులు కూడా ఉన్నారు. పెద్ద సంఖ్యలో ప్రజలు గాయాలపాలయ్యారు. కాబుల్ విమానాశ్రయం వద్ద జంట ఆత్మాహుతి పేలుళ్లకు పాల్పడింది తామే అని ఐసిస్-కే ఉగ్రసంస్థ ప్రకటించుకుంది.
వేటాడి మరీ ప్రతీకారం తీర్చుకుంటామన్న బైడెన్
ఇక,కాబూల్ ఆత్మహుతి దాడులను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీవ్రంగా ఖండించారు. ఐఎస్‌ఐఎస్-కే (ISIS-K) ఉగ్రవాదుల దాడుల్లో.. 12 మంది అమెరికా సైనికులు మృతిచెందడంపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన బైడెన్..ఉగ్రమూకలను వేటాడి మరీ ప్రతీకారం తీర్చుకుంటామని స్పష్టం చేశారు. ఈ ఘటనను తాము మరచిపోమని.. దారుణానికి కారణమైన వారిని క్షమించేది లేదన్నారు. బాంబు దాడులు జరిగినా కాబుల్ నుంచి తరలింపు ప్రక్రియ ఆగదని స్పష్టం చేశారు.
కాబూల్ లో రెండు ఆత్మాహుతి దాడులు
కాబూల్ లోని హమీద్ కర్జాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ పశ్చిమ గేటు దగ్గర గురువారం సాయంత్రం 7 గంటల సమయంలో మొదటి పేలుడు జరిగింది. బరోన్ హోటల్ దగ్గర రాత్రి 8 గంటల 3 నిమిషాలకు రెండో పేలుడు జరిగింది. జనం మధ్యలోకి వెళ్లి ఉగ్రవాదులు తమను తాము పేల్చుకున్నారు. దీంతో పక్కనున్న వారంతా తునాతునకలయ్యారు. ఆ రోడ్డంతా రక్తసిక్తమయింది. కాళ్లు, నడుం భాగాలు చెల్లాచెదురుగా పడిఉన్నాయి. ఎయిర్ పోర్ట్ దగ్గర పరిస్థితి హృదయవిదారకంగా మారింది.