Fort Knox: అమెరికా బంగారం నిజంగానే మాయమైతే దాని ప్రభావం మనపై ఎలా పడుతుంది? ఫోర్ట్ నాక్స్ ఆడిట్ జరిగితే ఏమవుతుంది?

ఫోర్ట్ నాక్స్ బంగారం నిల్వలపై జరగబోయే ఆడిట్ అమెరికా ఆర్థిక వ్యవస్థకి చాలా కీలకమైనది.

Fort Knox: అమెరికా బంగారం నిజంగానే మాయమైతే దాని ప్రభావం మనపై ఎలా పడుతుంది? ఫోర్ట్ నాక్స్ ఆడిట్ జరిగితే ఏమవుతుంది?

Updated On : February 27, 2025 / 8:50 PM IST

అసలు అమెరికా వద్ద ఇప్పుడు ఎంత బంగారం ఉంది? ఫోర్ట్ నాక్స్ ఆడిట్ ఎందుకు చేయాలనుకుంటున్నారు? అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, డోజ్ చీఫ్ ఎలాన్ మస్క్ ఫోర్ట్ నాక్స్ బంగారంపై ఎందుకు ఆసక్తి చూపుతున్నారో తెలుసుకుందాం.

ఫోర్ట్ నాక్స్ ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు నిల్వలను కలిగి ఉందనే విషయం తెలిసిందే. సుమారు ఇక్కడ $428 బిలియన్ల బంగారం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ నిల్వలను పూర్తిస్థాయిలో అధికారంగా ఆడిట్ చేస్తే లెక్కల ప్రకారం బంగారం ఉంటే ‘అమెరికా ఆర్థిక వ్యవస్థ’ బలంగా ఉంటుందని, అయితే, నిల్వలు తక్కువగా ఉన్నట్లు తేలితే ప్రపంచ ఆర్థిక మార్కెట్లపై తీవ్రమైన ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

అమెరికా వద్ద భారీగా బంగారం నిల్వలు
బంగారాన్ని శతాబ్దాలుగా ఆ దేశ సంపదకు చిహ్నంగా పరిగణిస్తున్నారు. శతాబ్దాల నుంచి పాలకులు బంగారాన్ని సమకూర్చడమే కాకుండా తరాల తరబడి రక్షించారు. ఫోర్ట్ నాక్స్ లో ఉన్న టన్నుల కొద్దీ బంగారం వల్ల ప్రపంచంలోనే అత్యధిక బంగారం నిల్వలు ఉన్న దేశంగా అమెరికా ఉంది.

గత కొన్ని రోజులుగా అమెరికా బంగారం నిల్వలపైనే ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, డోజ్ చీఫ్ ఎలాన్ మస్క్ ఫోర్ట్ నాక్స్‌లో ఉన్న బంగారం నిల్వలపై అనుమానాలను వ్యక్తం చేస్తూ ఫోర్ట్ నాక్స్‌ను సందర్శించాలని, అధికారికంగా ఆడిట్ చేయాలని నిర్ణయించారు.

ఫోర్ట్ నాక్స్ ఎందుకు వార్తల్లోకి వచ్చింది?
దాదాపు 425 బిలియన్ డాలర్ల విలువైన బంగారం ఇంకా ‘ఫోర్ట్ నాక్స్‌’లోనే ఉందా? ఎక్స్ లో ట్వీట్ చేశారు ఎలాన్ మస్క్. అప్పటినుండి ఇది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అంతేగాక అర్జెంటీనా అధ్యక్షుడు ‘జేవియర్ మైలీ’ 5,000 టన్నుల బంగారం ఉందని, ఇది అమెరికా ప్రజల సంపదని, మనం ఎందుకు తలుపులు తెరచి లోపల ఏముందో తెలుసుకోకూడదని ఎలాన్ మస్క్ కు ట్యాగ్ చేస్తూ ఎక్స్ లో ట్వీట్ చేశారు.

ఇలా ప్రతి డెబిట్ లో అమెరికా గోల్డ్ నిల్వలపై చర్చ జరుగుతుండడంతో నాలుగు రోజుల క్రితం జరిగిన అమెరికా గవర్నర్ల మీటింగ్ లో ఫోర్ట్ నాక్స్ బంగారంపై ఆడిట్ చేస్తామని నాతో పాటు మస్క్ కూడా పాల్గొంటారని అధికారికంగా చెప్పారు. ప్రస్తుతం ఫోర్ట్ నాక్స్‌లో సుమారు 4,580 టన్నులు బంగారం ఉంది. ఇది అమెరికా ఖజానాకు చెందిన మొత్తం బంగారంలో సగం ఉంటుంది. అంతేగాక వెస్ట్ పోయింట్, డెన్వర్, న్యూయార్క్ ఫెడరల్ రిజర్వ్ వంటి ప్రాంతాల్లో కూడా అమెరికా బంగారం నిల్వలు ఉన్నాయి.

ఫోర్ట్ నాక్స్‌లో ఆడిట్ జరిగితే ఏమవుతుంది?
1. అధికారికంగా అమెరికా ప్రజలకు, అలాగే పెట్టుబడిదారులకు బంగారం ఎంత ఉందో తెలుస్తుంది.
2. ప్రస్తుత బంగారానికి ఉన్న రేటు ప్రకారం లెక్కిస్తే దాదాపు 760 బిలియన్ డాలర్ల విలువ ఉంటుంది. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థను బలపరుస్తుంది.

బంగారం నిల్వలు తక్కువగా ఉన్నట్లు తేలితే?
1. అమెరికా బంగారం నిల్వలు తక్కువగా ఉంటే, అమెరికా ఆర్థిక వ్యవస్థపై అనిశ్చితి పెరుగుతుంది.
2. డాలర్ విలువ తగ్గిపోవచ్చు.. దాని ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పడుతుంది.
3. చైనా, రష్యా వంటి దేశాలు బంగారం నిల్వలు పెంచుకుంటాయి, తద్వారా వివిధ దేశాల్లో బంగారం ధరలు పెరిగే అవకాశముంది.
4. అమెరికా బంగారం నిల్వలు తక్కువగా ఉంటే, ప్రపంచ మార్కెట్లు కుదేలవుతాయని చరిత్ర చెబుతుంది.

ఫోర్ట్ నాక్స్ బంగారం నిల్వలపై జరగబోయే ఆడిట్ అమెరికా ఆర్థిక వ్యవస్థకే చాలా కీలకమైనది. అమెరికా డాలర్ విలువలో మార్పును నిర్ణయిస్తుంది. కానీ, నిల్వలు తక్కువగా ఉన్నట్లు తేలితే, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. ఆడిట్‌ గురించి ప్రపంచ వ్యాప్తంగా బంగారం మార్కెట్‌కు సంబంధించిన వారు, అలాగే ఆర్థిక నిపుణులు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.