ఎన్నికల ముందు…108 కొబ్బరి కాయలు కొట్టమన్న కమలా హారిస్

  • Published By: venkaiahnaidu ,Published On : August 17, 2020 / 05:58 PM IST
ఎన్నికల ముందు…108 కొబ్బరి కాయలు కొట్టమన్న కమలా హారిస్

Updated On : August 18, 2020 / 9:43 AM IST

ఈ ఏడాది నవంబర్ లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాట్ల తరఫున ఉపాధ్యక్ష పదవికి భారత సంతతికి చెందిన కమలా హారిస్ బరిలో నిలవగా,ప్రస్తుతం కమలా హారిస్‌(55) భారత మూలాలకు సంబంధించి సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. తమిళనాడుకు చెందిన పీవీ గోపాలన్‌ మనుమరాలైన కమల అగ్రరాజ్యంలో ఇప్పటికే పలు కీలక బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే.



భారత్‌తో కమలకు ఉన్న బంధం, భారత సంస్కృతీ సంప్రదాయాల పట్ల ఆమెకున్న విశ్వాసం గురించి వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. 2010 కాలిఫోర్నియా అటార్నీ ఎన్నికల సమయంలో తన గెలుపును ఆకాంక్షిస్తూ, కొబ్బరికాయలు కొట్టాల్సిందిగా కమల తన చిన్నమ్మ సరళా గోపాలన్‌ను అడిగినట్లు న్యూయార్క్‌ టైమ్స్‌ ఓ కథనం ప్రచురించింది. కమల వ్యక్తిత్వాన్ని మలచడంలో ఆమె భారతీయ కుటుంబం కీలక పాత్ర పోషించిందంటూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.



కమలా హారిస్‌ తల్లి శ్యామలా గోపాలన్‌ చెన్నైకి చెందిన వారన్న సంగతి తెలిసిందే. వైద్య విద్య కోసం అమెరికా వెళ్లిన ఆమె అక్కడే జమైకాకు చెందిన డేవిడ్‌ హారిస్‌ను ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు కమలా హారిస్‌, మాయా హారిస్‌ ఉన్నారు. అయితే కమలకు ఏడేళ్ల వయస్సు ఉన్నప్పుడే తల్లిదండ్రులు విడిపోగా.. పిల్లల బాధ్యతను తల్లి శ్యామల స్వీకరించారు. తమిళనాడు సంప్రదాయ కుటుంబానికి చెందిన శ్యామల భారత్‌కు వచ్చినప్పుడల్లా పిల్లల్ని వెంట తీసుకువచ్చేవారు. అలా కమలకు చెన్నైతో అనుబంధం ఏర్పడింది. తన తాతయ్య గోపాలన్‌తో కలిసి ఆమె బీసెంట్‌ నగర్‌ బీచ్‌లో సేద తీరుతూ వాకింగ్‌ చేసేవారు.



భారతీయ సంప్రదాయాల పట్ల కమలకు నమ్మకం కుదిరింది. ఈ క్రమంలో తను అటార్నీ జనరల్‌గా పోటీ పడిన సమయంలో చెన్నైలో ఉండే చిన్నమ్మ సరళా గోపాలన్‌ను 108 కొబ్బరికాయలు కొట్టమని చెప్పారు. ఈ విషయాల గురించి 2018 నాటి ప్రసంగంలో కమల చెప్పుకొచ్చారు. తన తాతయ్య ఎన్నో కథలు చెప్పేవారని, ప్రజాస్వామ్య విలువల గురించి బోధించేవారని పేర్కొన్నారు. ఈరోజు తాను ఇలా ఉన్నానంటే అందుకు తాతయ్య మాటలే కారణమంటూ ఉద్వేగపూరిత ప్రసంగం చేశారు.