Video: సిడ్నీ కాల్పుల ఘటన: ఉగ్రవాది నుంచి తుపాకీ లాక్కుని.. టూరిస్టుల ప్రాణాలు కాపాడిన ఈ వీరుడు ఎవరు?

ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంటోనీ అల్బనీస్ కూడా అహ్మద్‌ను “హీరో”గా అభివర్ణించారు.

Video: సిడ్నీ కాల్పుల ఘటన: ఉగ్రవాది నుంచి తుపాకీ లాక్కుని.. టూరిస్టుల ప్రాణాలు కాపాడిన ఈ వీరుడు ఎవరు?

Ahmed Al Ahmed

Updated On : December 15, 2025 / 6:08 PM IST

Ahmed Al Ahmed: ఆస్ట్రేలియాలో ఆదివారం సిడ్నీ బోండీ బీచ్‌లో కొందరు దుండగులు కాల్పులు జరిపి 16 మందిని చంపిన విషయం తెలిసిందే. మరో 36 మందికి గాయాలయ్యాయి. యూదు మతంలో వెలుగుల పండుగగా జరుపుకునే హనుక్కా వేడుక వేళ ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ సమయంలో ఓ వ్యక్తి చాకచక్యంగా, ధైర్యసాహసాలతో ఓ దుండగుడి నుంచి గన్‌ను లాక్కుని చాలా మంది ప్రాణాలు కాపాడాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అతడిని ప్రజలు “హీరో” అంటూ ప్రశంసిస్తున్నారు.

ఆ హీరో పేరు అహ్మద్ అల్ అహ్మద్‌ (43). ఆయన వద్ద ఏ ఆయుధమూ లేదు. అయినప్పటికీ ఒట్టి చేతులతో దుండగుడి వద్దకు పులిలా పరుగులు తీశారు. దుండగుడు కాల్పులు జరుపుతుండగానే అతడిపైకి అహ్మద్ దూకారు. అహ్మద్‌ వల్లే చాలా మంది ప్రాణాలతో బయటపడ్డారని స్థానికులు చెబుతున్నారు.

పార్క్ చేసిన కార్ల వెనుక దాక్కొన్న అహ్మద్.. దుండగుడి వెనుక నుంచి పరుగెత్తుకుంటూ వెళ్లడం ఈ వీడియోలో చూడొచ్చు. మొదట దుండగుడి మెడను పట్టుకుని, తుపాకీ లాక్కొని, నేలకూల్చి, ఆ ఆయుధాన్నే తిరిగి అతడి వైపు చూపించారు.

Also Read: Kavitha: 2029 ఎన్నికల్లో పోటీ చేస్తాను: కవిత ప్రకటన

ఎవరీ అహ్మద్?
అహ్మద్ అల్ అహ్మద్‌ పండ్ల వ్యాపారి. ఈ దాడిలో అతడికి రెండు తూటా గాయాలు తగిలినట్టు సమాచారం. స్థానిక మీడియాతో ముస్తఫా అనే వ్యక్తి మాట్లాడుతూ.. తాను అహ్మద్‌కు బంధువునని చెప్పారు. “అహ్మద్‌ ఆసుపత్రిలో ఉన్నారు. లోపల ఆయన పరిస్థితి ఎలా ఉందో తెలియదు. అతడు క్షేమంగా ఉండాలని ఆశిస్తున్నాం. అతడు నిస్సందేహంగా హీరో” అని చెప్పారు.

అహ్మద్‌కు ఆ రాత్రే శస్త్రచికిత్స జరగాల్సి వచ్చింది. ఆయుధాలపై అనుభవం లేకపోయినా, అహ్మద్‌ జోక్యం చేసుకుని ఉగ్రవాది ఆటను కట్టించారు.

ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంటోనీ అల్బనీస్ కూడా అహ్మద్‌ను “హీరో”గా అభివర్ణించారు. హనుక్కా వేడుక సందర్భంగా బోండీ బీచ్‌లో యూదు సమాజాన్ని లక్ష్యంగా చేసుకుని దుండగులు కాల్పులు జరిగినట్టు పోలీసులు తెలిపారు.

దాడికి పాల్పడినవారు తండ్రి, కుమారుడు అని పోలీసులు సోమవారం వెల్లడించారు. వారిని సాజిద్ అక్రమ్ (50), నవీద్ అక్రమ్‌ (24)గా గుర్తించారు. అక్రమ్ ఆ ఘటనాస్థలిలోనే మరణించాడు. అతడి కుమారుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడి పరిస్థితి విషమంగా ఉంది. న్యూ సౌత్ వేల్స్ పోలీసులు ఈ దాడిని ఉగ్రవాద ఘటనగా ప్రకటించారు.

మృతుల్లో ఒక ఇజ్రాయెల్ పౌరుడు ఉన్నట్టు ఇజ్రాయెల్ విదేశాంగ శాఖ తెలిపింది. ఈ దాడి తరువాత జాతీయ భద్రతా కమిటీని అత్యవసరంగా సమావేశపరిచినట్టు ప్రధానమంత్రి ఆంటోనీ అల్బనీస్ చెప్పారు.