డచ్ ప్రధాని పదవిని దక్కించుకోనున్న స్వలింగ సంపర్కుడు.. ఇప్పటికే ఆయనకు హాకీ ఆటగాడితో నిశ్చితార్థం.. అంతేకాదు..

ఆ దేశ చరిత్రలో ప్రధాని కానున్న అతి పిన్న వయస్కుడిగా నిలవనున్నారు. వచ్చే సంవత్సరం స్పెయిన్‌లో పెళ్లి చేసుకోనున్నారు.

డచ్ ప్రధాని పదవిని దక్కించుకోనున్న స్వలింగ సంపర్కుడు.. ఇప్పటికే ఆయనకు హాకీ ఆటగాడితో నిశ్చితార్థం.. అంతేకాదు..

Updated On : November 2, 2025 / 7:50 PM IST

Rob Jetten: డచ్‌ సెంట్రిస్ట్‌ పార్టీ డీ66 నాయకుడు రాబ్‌ జెట్టెన్‌ నెదర్లాండ్స్‌లో చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన ఓ స్వలింగ సంపర్కుడు (గే). అంతేకాదు, 38 ఏళ్ల వయసులోనే ఆయన దేశానికి ప్రధాని కాబోతున్నారు. దీంతో ఆ దేశ చరిత్రలో ప్రధాని కానున్న అతి పిన్న వయస్కుడిగా నిలవనున్నారు. అక్టోబర్‌ 29న జరిగిన ఎన్నికల్లో ఆయన పార్టీ భారీ విజయం సాధించింది.

“ఈ ఎన్నికల్లో డచ్‌ సెంట్రిస్ట్‌ పార్టీ డీ66 అతి పెద్ద పార్టీగా నిలవడంతో మేము ఆనందంలో మునిగితేలుతున్నాం. డీ66 పార్టీకి ఇది చరిత్రాత్మక విజయం. అదే సమయంలో నా భుజాలపై పెద్ద బాధ్యత ఉందని అనిపిస్తోంది” అని జెట్టెన్‌ తెలిపారు. (Rob Jetten)

తీవ్ర పోటీలోనూ జెట్టెన్‌ యాంటీ ఇస్లాం పాపులిస్ట్‌ గీర్ట్‌ విల్డర్స్‌కు చెందిన పార్టీ ఫర్ ఫ్రీడంపై విజయం సాధించారు. నెదర్లాండ్స్‌లో విల్డర్స్‌ వలస వ్యతిరేక విధానాలతో ప్రచారం చేశారు. అంతేగాక, ఖురాన్‌పై నిషేధం విధించాలన్న డిమాండ్‌ను తీసుకొచ్చారు. ఆయనకు ప్రజల మద్దతు గత సంవత్సరం కంటే తగ్గింది.

జెట్టెన్‌ తన పార్టీని రెండేళ్లలో ఐదవ స్థానం నుంచి డచ్‌ రాజకీయాల్లో అగ్రస్థానానికి చేర్చారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా నినాదం “యెస్‌ వీ క్యాన్‌” నుంచి స్ఫూర్తి పొంది, హెట్‌ కాన్‌ వెల్‌ (అది సాధ్యమే) అనే సానుకూల నినాదంతో ప్రచారం చేశారు. తన ప్రత్యర్థి విల్డర్స్‌ విభజన వాదాన్ని ప్రేరేపిస్తున్నారని ఆయన ఆరోపించారు.

Also Read: ‘శబరిమల’ వెళ్లలేకపోతున్నానని బాధపడుతున్నారా? మన గోదావరి తీరాన ‘శబరిమల’ వంటి అయ్యప్ప ఆలయం.. ఆధ్యాత్మిక పరిమళాలు..

“మేము గత కొన్నేళ్లుగా నెదర్లాండ్స్‌లో వ్యాప్తి చెందిన ప్రతికూలతను తొలగించాలనే ఉద్దేశంతో ప్రచారం చేశాము. యూరప్‌ సహకారం లేకుండా మనం ఎక్కడా ఉండలేం. అందుకే నెదర్లాండ్స్‌ను మళ్లీ యూరప్‌లో ప్రధాన భాగంగా తీసుకురావాలని కోరుకుంటున్నాను” అని జెట్టెన్‌ అన్నారు.

డచ్‌ సెంట్రిస్ట్‌ రాజకీయ పార్టీ డీ66 నెదర్లాండ్స్‌ ఎన్నికల్లో అత్యధిక ఓట్లు సాధించిందని వార్తా సంస్థ ఏఎన్‌పీ తెలిపింది. డీ66 పార్టీని గీర్ట్‌ విల్డర్స్‌ నేతృత్వంలోని ఫార్‌ రైట్‌ ఫ్రీడమ్‌ పార్టీ ఇక అధిగమించడం సాధ్యం కాదని పేర్కొంది. విదేశాల్లో నివసిస్తున్న పౌరుల పోస్టల్‌ ఓట్లు లెక్కించిన తర్వాత నవంబర్‌ 3న నెదర్లాండ్స్‌ ఎన్నికల ఫలితాలను అధికారికంగా ప్రకటించనున్నారు.

జెట్టెన్‌ వ్యక్తిగత జీవితం, యువకుడితో నిశ్చితార్థం..

జెట్టెన్‌ నెదర్లాండ్స్‌ తూర్పు దక్షిణ భాగంలోని యూడెన్‌ పట్టణంలో పెరిగారు. ఆయన నైమెగెన్‌లోని రాడ్బౌడ్‌ యూనివర్సిటీలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చదివారు. చిన్నతనంలో ఫుట్‌బాల్‌, అథ్లెటిక్స్‌ ఆడేవారు. ఆయన తల్లిదండ్రులు ఇద్దరూ ఉపాధ్యాయులే.

మొదట క్రీడా రంగంలోకి ప్రవేశించాలని భావించిన జెట్టెన్.. ఆ తర్వాత హోటల్‌ రంగంలోకి రావాలని అనుకున్నారు. చివరకు రాజకీయాల్లోకి వచ్చారు.

ఒలింపిక్‌ అథ్లెట్‌, ఆర్జెంటీనా ఫీల్డ్‌ హాకీ క్రీడాకారుడు నికో కీనన్‌తో రాబ్‌ జెట్టెన్‌ ఇప్పటికే నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ విషయాన్ని 2024 నవంబరులోనే ప్రకటించారు. వచ్చే సంవత్సరం స్పెయిన్‌లో ఆ ఇద్దరు యువకులు పెళ్లి చేసుకోనున్నారు.