అమెరికాలో భార్యతో పాటు ముగ్గురు బంధువులను కాల్చి చంపిన భారతీయుడు

కాల్పులు మొదలైన సమయంలో ముగ్గురు పిల్లలు అక్కడే ఉన్నారని, ప్రాణరక్షణ కోసం పిల్లలు అల్మారాలో దాక్కున్నారని పోలీసులు అన్నారు.

అమెరికాలో భార్యతో పాటు ముగ్గురు బంధువులను కాల్చి చంపిన భారతీయుడు

Updated On : January 24, 2026 / 4:48 PM IST
  • జార్జియా రాష్ట్రం లారెన్స్‌విల్లేలో ఘటన
  • కుటుంబ కలహాలే ఈ హత్యలకు కారణం
  • నిందితుడు విజయ్‌ కుమార్‌ అరెస్ట్

Georgia shooting: అమెరికాలోని జార్జియా రాష్ట్రం లారెన్స్‌విల్లేలో ఓ భారతీయుడు తన భార్యతో పాటు మరో ముగ్గురు బంధువులపై కాల్పులు జరిపి, హత్య చేశాడు. కుటుంబ కలహాలే ఈ హత్యలకు కారణం. నిందితుడు కాల్పులు జరిపిన సమయంలో ఇంట్లో ముగ్గురు పిల్లలు ఉన్నారు.

కాల్పుల ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన అట్లాంటాలోని భారత కాన్సులేట్ జనరల్.. నిందితుడిని అరెస్టు చేసినట్టు తెలిపింది. బాధిత కుటుంబానికి అన్ని విధాలా సాయం అందిస్తున్నట్టు వెల్లడించింది.

నిందితుడు అట్లాంటాకు చెందిన విజయ్ కుమార్ (51) అని అధికారులు గుర్తించారు. మృతులను విజయ్ కుమార్ భార్య మీమూ డోగ్రా (43), ఇతర బంధువులు గౌరవ్ కుమార్ (33), నిధి చాందర్ (37), హరీశ్ చాందర్ (38)గా గ్విన్నెట్ కౌంటీ పోలీసులు గుర్తించారు.

Also Read: చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో చెప్పిన వృద్ధురాలు.. 3 సార్లు చనిపోయి బతికిందట..

డోగ్రా, కుమార్ మధ్య అట్లాంటాలోని వారి ఇంట్లో వాగ్వాదం ప్రారంభమైంది. ఆ తర్వాత కాల్పులు చోటుచేసుకున్నాయి. బ్రుక్ ఐవీ కోర్ట్ 1000 బ్లాక్ నుంచి ఈ కాల్పుల ఘటనపై తమకు కాల్‌ వచ్చిందని పోలీసులు తెలిపారు. అక్కడికి చేరుకుని ఇంట్లో నలుగురి మృతదేహాలను గుర్తించారమని అన్నారు. అందరూ తుపాకీ గాయాలతోనే మృతి చెందినట్టు చెప్పారు.

భయంతో వణికిపోయిన పిల్లలు
కాల్పులు మొదలైన సమయంలో ముగ్గురు పిల్లలు అక్కడే ఉన్నారని, ప్రాణరక్షణ కోసం పిల్లలు అల్మారాలో దాక్కున్నారని పోలీసులు అన్నారు. పిల్లల్లో ఒకరు 911కు ఫోన్ చేసి కీలక సమాచారం అందించారు. ఆ సమాచారంతో అధికారులు నిమిషాల్లో ఘటనాస్థలికి చేరుకున్నారు. పిల్లలకు ఎలాంటి గాయాలు కాలేదు. విజయ్‌ కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

నిందితుడి గురించి అదనపు వివరాలను అధికారులు విడుదల చేయలేదు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో ఇతర అనుమానితులు లేరని గ్విన్నెట్ కౌంటీ పోలీసులు స్పష్టం చేశారు.